గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 05, 2020 , 01:39:15

వార్నర్‌ పోరాడినా..

వార్నర్‌ పోరాడినా..

బ్యాటింగ్‌కు స్వర్గధామంగా మారిన షార్జాలో ముంబై ఇండియన్స్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అడ్డుకోలేకపోయింది. భారీ లక్ష్యఛేదనలో కెప్టెన్‌ వార్నర్‌ ఒంటరి పోరాటం చేసినా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయహోరు కొనసాగించలేకపోయింది. మరోవైపు క్వింటన్‌ డికాక్‌ బ్యాటింగ్‌లో అదరగొట్టడం సహా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో రోహిత్‌సేన అలవోకగా విజయం సాధించింది. ఫీల్డింగ్‌లో కీలక క్యాచ్‌లను చేజార్చడం కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ కొంపముంచింది. ముంబై చేతిలో హైదరాబాద్‌ ఓటమి.. కెప్టెన్‌ డేవిడ్‌ ఒంటరి పోరు వృథా.. అగ్రస్థానానికి రోహిత్‌ సేన 

షార్జా: హ్యాట్రిక్‌ విజయాలతో జోరు కొనసాగించాలని ఆశించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌)కు చుక్కెదురైంది. బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడం సహా కెప్టెన్‌ వార్నర్‌కు మిగతా బ్యాట్స్‌మెన్‌ సహకారం అందించకపోవడంతో ముంబై ఇండియన్స్‌ చేతిలో సన్‌రైజర్స్‌కు ఓటమి ఎదురైంది.  సమిష్టిగా రాణించిన రోహిత్‌ సేన ఈ సీజన్‌ ఐపీఎల్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై 34 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(39 బంతుల్లో 67 పరుగులు; 4ఫోర్లు, 4సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. హార్దిక్‌ పాండ్య(19 బంతుల్లో 28; 2ఫోర్లు, 2 సిక్స్‌లు), కీరన్‌ పొలార్డ్‌(13 బంతుల్లో 25, 3సిక్స్‌లు), కృనాల్‌(4 బంతుల్లో 20; 2ఫోర్లు, 2సిక్స్‌లు) మెరుపు హిట్టింగ్‌తో తలోచేయి వేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో సిద్ధార్థ్‌ కౌల్‌(2/64), సందీప్‌ శర్మ(2/41) చెరో రెండు వికెట్లు తీసినా ధారాళంగా పరుగులిచ్చారు. రషీద్‌ ఖాన్‌(1/22) ఒక్కడే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. లక్ష్యఛేదనలో తడబడిన హైదరాబాద్‌ 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేయగలిగింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(44 బంతుల్లో 60; 5ఫోర్లు, 2సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేయగా.. మనీశ్‌ పాండే(19 బంతుల్లో 30; 4ఫోర్లు, ఓ సిక్స్‌), బెయిర్‌స్టో(15 బంతుల్లో 25; 2ఫోర్లు, 2సిక్స్‌లు) మంచి ఆరంభాలు అందుకున్నా నిలదొక్కుకోలేకపోయారు. ముంబై బౌలర్లలో బౌల్ట్‌(2/28), ప్యాటిన్‌సన్‌(2/29), బుమ్రా (2/41) తలా రెండు వికెట్లు తీశారు.. బౌల్ట్‌కు మ్యాన్‌  ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు  దక్కింది. గాయం కారణంగా స్టార్‌  పేసర్‌  భువనేశ్వర్‌  దూరం కావడం హైదరాబాద్‌కు ఎదురుదెబ్బగా మారింది. 

దంచేసిన ముంబై 

బౌలింగ్‌లో సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కింది.  తొలి ఓవర్లోనే ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(6)ను సందీప్‌ శర్మ పెవిలియన్‌కు పంపాడు. బెయిర్‌స్టో క్యాచ్‌ పట్టగా.. తొలుత అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు.  ఎస్‌ఆర్‌హెచ్‌ రివ్యూకి వెళ్లగా శర్మ బ్యాట్‌కు బంతి తగిలినట్టు తేలింది. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌  పేసర్‌  సిద్ధార్థ్‌ కౌల్‌  వేసిన మూడో ఓవర్‌లో డికాక్‌ ఒకటి, సూర్య కుమార్‌ మూడు ఫోర్లు బాదారు.  అచితూచి ఆడుతున్న ఈ జంటను కౌల్‌ ఆరో ఓవర్లో విడదీశాడు. సూర్య కుమార్‌(18 బంతుల్లో 27)ను ఔట్‌ చేశాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి ముంబై రెండు వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. ఆ తర్వాత డికాక్‌, ఇషాన్‌ కిషన్‌(31) నిలకడగా ఆడారు. అర్ధశతకం తర్వాత కొన్ని భారీ షాట్లు ఆడిన డికాక్‌ను హైదరాబాద్‌ స్టార్‌ రషీద్‌ ఖాన్‌ బుట్టలో పడేశాడు. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌ ఔటైనా హార్ది క్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కౌల్‌ వేసిన చివరి ఓవర్లో హార్దిక్‌ ఔట్‌ కాగా..  కృనాల్‌ పాండ్య 4 బంతుల్లో 20 పరుగులు చేసి స్కోరును 200          దాటించాడు. 

ఆ మూడు క్యాచ్‌లు పట్టుంటే.. 

ముంబై బ్యాట్స్‌మెన్‌ డికాక్‌, హార్దిక్‌, పొలార్డ్‌ ఇచ్చిన కాస్త క్లిష్టతరమైన  క్యాచ్‌లను చేజార్చి సన్‌రైజర్స్‌ మూల్యం చెల్లించుకుంది. ఏడో ఓవర్లోనే ముంబై బ్యాట్స్‌మన్‌ డికాక్‌ భారీ షాట్‌ కొట్టగా సన్‌రైజర్స్‌ ఫీల్డర్‌ మనీశ్‌ పాండేకి క్యాచ్‌ వెళ్లింది. అయితే పాండే వేళ్లను తాకుతూ అది సిక్స్‌  లైన్‌  దాటింది. అలాగే హార్దిక్‌ క్యాచ్‌ను సైతం 15వ ఓవర్లోనే వార్నర్‌ మిస్‌ చేశాడు. ఇక 18వ ఓవర్లో పొలార్డ్‌ క్యాచ్‌ను రషీద్‌ నేలపాలు చేశాడు.  అయితే ఇషాన్‌ క్యాచ్‌ను మాత్రం మనీశ్‌ అద్భుతంగా పట్టాడు.    

వార్నర్‌ శ్రమ  

ఒంటరి పోరాటం చేసిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు మిగిలిన బ్యాట్స్‌మెన్‌ నుంచి సహకారం లభించలేదు. ముంబై బౌలర్‌ బౌల్ట్‌ వేసిన మూడో బంతిని సిక్సర్‌ కొట్టిన ఓపెనర్‌ బెయిర్‌స్టో కాసేపు దూకుడుగా ఆడినా ఐదో ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరి భారీ లక్ష్యఛేదనలో నిరాశపరిచాడు. సాధికారికంగా ఆడుతున్న వార్నర్‌కు తోడైన మనీశ్‌ పాండే ఫోర్లతో మోతెక్కించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ 56పరుగులు చేసింది. ఇరువురు ఓవర్‌కో బౌండరీ చొప్పున బాదుతూ ముందుకుసాగారు. అయితే పదో ఓవర్లో పాండే ఔటవడంతో రెండో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత విలియమ్సన్‌(3), గత మ్యాచ్‌ హీరో ప్రియమ్‌ గార్గ్‌(8) తక్కువ పరుగులకే ఔటవడంతో హైదరాబాద్‌ కష్టాలపాలైంది. చివరి ఐదు ఓవర్లలో విజయానికి 70 పరుగులు అవసరమయ్యాయి. అయితే ప్యాటిన్‌సన్‌ వేసిన 16వ ఓవర్లో వార్నర్‌ వైడ్‌ బంతిని ఆడి ఇషాన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో దాదాపు మ్యాచ్‌ అక్కడే ముగిసింది. చివర్లో అబ్దుల్‌ సమద్‌(20) కాసేపు దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది .

స్కోరు బోర్డు

ముంబై: రోహిత్‌ శర్మ  (సి) బెయిర్‌స్టో (బి) సందీప్‌ శర్మ 6, డికాక్‌ (సి&బి) రషీద్‌ ఖాన్‌ 67, సూర్యకుమార్‌ (సి) నటరాజన్‌ (బి) కౌల్‌ 27, ఇషాన్‌ కిషన్‌ (సి) మనీశ్‌ (బి) సందీప్‌ శర్మ 31, హార్దిక్‌ (బౌల్డ్‌) కౌల్‌ 28, పొలార్డ్‌ (నాటౌట్‌) 25, కృనాల్‌ (నాటౌట్‌) 20. ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం:  20 ఓవర్లలో 208/5. వికెట్ల పతనం: 6-1, 48-2, 126-3, 147-4, 188-5. బౌలింగ్‌: సందీప్‌ 4-0-41-2, నటరాజన్‌ 4-0-29-0, సిద్ధార్థ్‌ కౌల్‌ 4-0-64-2, అబ్దుల్‌ సమాద్‌ 2-0-27-0, రషీద్‌ ఖాన్‌ 4-0-22-1, విలియమ్సన్‌ 2-0-24-0.

హైదరాబాద్‌: వార్నర్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) ప్యాటిన్‌సన్‌ 60, బెయిర్‌స్టో (సి) హార్దిక్‌ (బి) బౌల్ట్‌ 25, మనీశ్‌ (సి) పొలార్డ్‌ (బి) ప్యాటిన్‌సన్‌ 30, విలియమ్సన్‌ (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 3, గార్గ్‌ (సి) చాహర్‌ (బి) హార్దిక్‌ 8, అభిషేక్‌ (బౌల్డ్‌) బుమ్రా 10, సమాద్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 20, రషీద్‌ (నాటౌట్‌) 3, సందీప్‌ (నాటౌట్‌) 0. ఎక్స్‌ట్రాలు: 15, మొత్తం: 20 ఓవర్లలో 174/7. వికెట్ల పతనం: 34-1, 94-2, 116-3, 130-4, 142-5, 168-6, 172-7, బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-28-2, ప్యాటిన్‌సన్‌ 4-0-29-2, కృనాల్‌ 4-0-35-1, బుమ్రా 4-0-41-2, పొలార్డ్‌ 3-0-20-0, రాహుల్‌ చాహర్‌ 1-0-16-0.