గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 06, 2020 , 23:22:02

IPL 2020: ముంబై అదుర్స్‌.. చిత్తుగా ఓడిన రాజస్థాన్‌

IPL 2020: ముంబై అదుర్స్‌.. చిత్తుగా ఓడిన రాజస్థాన్‌

అబుదాబి:  ఐపీఎల్‌-13లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది.   రాజస్థాన్‌ రాయల్స్‌పై  57 పరుగుల   తేడాతో రోహిత్‌సేన గెలిచింది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ 18.1 ఓవర్లలో  136 పరుగులే చేసి ఆలౌటైంది.  ముంబై బౌలర్లు బుమ్రా(4/20), బౌల్ట్‌(2/26), పాటిన్సన్‌(2/19)  ధాటికి రాజస్థాన్‌ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(70: 44 బంతుల్లో  4ఫోర్లు, 5సిక్సర్లు) ఒంటరి పోరాటం వృథా అయింది. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్‌(24: 11 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) మెరుపులు మెరిపించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. 

194 పరుగుల ఛేదనలో  రాజస్థాన్‌  ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించలేదు.  ముంబై బౌలర్ల ధాటికి  రాజస్థాన్‌ 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన  ఇన్నింగ్స్‌  తొలి ఓవర్‌ రెండో బంతికే  ఓపెనర్‌ జైశ్వాల్(0)‌ కీపర్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  స్పీడ్‌స్టర్‌ బుమ్రా వేసిన తర్వాతి ఓవర్‌లో రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(6) కూడా డికాక్‌కే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

ఆరంభం నుంచే వికెట్ల పతనం సాగడంతో కోలుకోవడం కష్టమైంది. పవర్‌ప్లే ముగిసేసరికే  స్టార్‌ బ్యాట్స్‌మెన్‌  పెవిలియన్‌ చేరడంతో  లక్ష్య ఛేదనలో చేతులెత్తేసింది.  వైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్‌ బట్లర్‌ మాత్రం  బౌలర్లను  లక్ష్యంగా చేసుకుంటూ  బౌండరీలతో హోరెత్తించాడు.   ఒంటరిగా పోరాడుతున్న  బట్లర్‌ను  14వ ఓవర్‌లో పాటిన్సన్‌  ఔట్‌ చేయడంతో రాజస్థాన్‌ ఆశలు వదులుకుంది. బట్లర్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమయ్యారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 193  పరుగులు చేసింది.  సూర్యకుమార్‌ యాదవ్‌(79 నాటౌట్:‌ 47 బంతుల్లో 11ఫోర్లు, 2సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకోవడంతో ముంబై భారీ స్కోరు చేసింది.  కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(35: 23 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు),   హార్దిక్‌ పాండ్య(30 నాటౌట్‌: 19 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌)  రాణించారు.  రాజస్థాన్‌  స్పిన్నర్‌  శ్రేయస్‌ గోపాల్‌(4/28)  తన స్పిన్‌ మ్యాజిక్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు.