బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Oct 01, 2020 , 23:27:37

KXIP vs MI: 48 పరుగుల తేడాతో ముంబై గెలుపు

KXIP vs MI: 48 పరుగుల తేడాతో ముంబై గెలుపు

అబుదాబి: ఐపీఎల్‌-13లో  ముంబై ఇండియన్స్‌  రెండో విజయాన్ని నమోదు చేసింది.   రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఆల్‌రౌండ్‌ షోతో ఆధిపత్యం ప్రదర్శించి  48 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. 192 పరుగుల   లక్ష్య ఛేదనలో ముంబై బౌలర్లు బుమ్రా(2/18), రాహుల్‌ చాహర్‌(2/26), జేమ్స్‌ పాటిన్సన్‌(2/28) ధాటికి  పంజాబ్‌ 20 ఓవర్లలో  8 వికెట్లకు 143 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌(44 27 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌.   

అంతకుమందు బ్యాటింగ్‌కు దిగిన  ముంబై 20 ఓవర్లలో  4 వికెట్లకు 191 పరుగులు చేసింది.  రోహిత్‌ శర్మ(70: 45 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకంతో  రాణించగా.. ఆఖర్లో హార్దిక్‌ పాండ్య(30 నాటౌట్‌: 11 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు ), పొలార్డ్‌(47 నాటౌట్:‌ 20 బంతుల్లో  3ఫోర్లు, 4సిక్సర్లు ) ధనాధన్‌ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించారు.  ఆరంభంలో నిదానంగా సాగిన ఇన్నింగ్స్‌కు వీరిద్దరూ అదిరిపోయే ముగింపునిచ్చారు. 

భారీ లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్‌కు  మయాంక్‌ అగర్వాల్‌(25)  శుభారంభమే అందించాడు. ఐదో ఓవర్‌ ఐదో బంతికే బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.  ఆ తర్వాతి ఓవర్‌లోనే అప్పుడే క్రీజులోకి వచ్చిన కరుణ్‌ నాయర్‌ కూడా కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.  మళ్లీ కాసేపటికే    సూపర్‌ ఫామ్‌లో ఉన్న జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్(17)‌  ఔటవడంతో జట్టు కష్టాల్లో పడింది. రాహుల్‌ చాహర్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ మొదటి బంతికే రాహుల్‌ బౌల్డ్‌ అయ్యాడు.  టాప్‌ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ బౌల్డ్‌ కావడం గమనార్హం.

కీలక బ్యాట్స్‌మన్‌  పెవిలియన్‌ చేరడంతో   మ్యాచ్‌పై ముంబై మరింత పట్టుబిగించింది.   10 ఓవర్లకు 72/3తో నిలిచిన పంజాబ్‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు.  పూరన్‌ ఒక్కడే ఫోర్లు, సిక్సర్లతో వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అర్ధశతకానికి చేరువలో వచ్చిన అతడు ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లో వెనుదిరగడంతో పంజాబ్‌ ఆశలు వదులుకున్నది. మరో ఎండ్‌లో ఉన్న మాక్స్‌వెల్‌ 18 బంతులాడి కేవలం 11 రన్స్‌ మాత్రమే  చేసి నిరాశపరిచాడు. logo