శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sports - Sep 23, 2020 , 15:55:48

జట్టును ముందుండి నడిపించడం అంటే ఇది కాదు:గంభీర్

 జట్టును ముందుండి నడిపించడం అంటే ఇది కాదు:గంభీర్

షార్జా:  రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ముందుండి నడిపించలేదని మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ విమర్శించారు. ధోనీ ఆఖర్లో బ్యాటింగ్‌కు రావడం వల్ల చెన్నై 16 పరుగులతో ఓడిపోయిందన్నాడు. 

217 పరుగుల లక్ష్య ఛేదనలో ధోనీ ఆఖరి ఓవర్లో మూడు సిక్సర్లు బాదినా వాటితో ఎలాంటి ప్రయోజనం లేదన్నాడు. ధోనీ కాకుండా ఇతర జట్ల కెప్టెన్‌ ఎవరైనా ఇలా చేసుంటే అతనిపై అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారని అన్నాడు.  'ఇంకెవరైనా  బ్యాట్స్‌మన్‌/కెప్టెన్‌  ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే అతనిపై విమర్శలు చేసేవారు. అది ధోనీ కాబట్టే..ఎవరూ మాట్లాడలేకపోతున్నారని'  క్రిక్‌ఇన్ఫోతో గంభీర్‌ అన్నాడు.

'ధోనీ  ఏడో స్థానంలో  బ్యాటింగ్‌ రావడం ఏంటీ? అతని కన్నా ముందు శామ్‌ కరన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లను బ్యాటింగ్‌కు పంపడంలో అర్థంలేదు.  సురేశ్‌ రైనా జట్టులో లేని సమయంలో ఇద్దరు యువ ఆటగాళ్లను ముందుగా పంపించి నీకన్నా  ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ అన్న భావాన్ని కలిగిస్తున్నది.  కెప్టెన్‌ జట్టును ముందుండి నడిపించాలి.  అంతేగానీ వాళ్లను ముందుగా బ్యాటింగ్‌కు పంపిస్తే ముందుండి నడిపించడం  ఎలా అవుతుంది.  డుప్లెసిస్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆఖరి ఓవర్లో ధోనీ మూడు సిక్సర్లు కొట్టాడు. అసలు వాటితో ఏం లాభం?   కచ్చితంగా అవి వ్యక్తిగత పరుగులే అవుతాయని' గౌతీ పేర్కొన్నాడు. 

ఏడో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగడంపై ధోనీ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.  'తనకు  చాలా రోజుల నుంచి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేదన్నాడు. టోర్నీ ఆరంభంలో కొన్ని ప్రయోగాలు చేయాలనుకున్నాం. శామ్‌ లాంటి ఆటగాళ్లకు అవకాశాలిస్తున్నాం.  కొంచెం భిన్నంగా ప్రయత్నించే అవకాశం ఉంది. ఒకవేళ అది విజయవంతం కాకపోతే మళ్లీ మీ స్థానంలోనే ఆడొచ్చు' అంటూ ధోనీ వివరించాడు. 


logo