శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 16, 2020 , 23:39:53

నవతరానికి స్ఫూర్తి

నవతరానికి స్ఫూర్తి

న్యూఢిల్లీ: అనూహ్య నిర్ణయంతో యావత్‌ క్రీడాలోకాన్ని షాక్‌కు గురిచేసిన మహేంద్రసింగ్‌ ధోనీకి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) శుభాకాంక్షలు తెలిపింది. ఒక తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ధోనీ ఆటను మిస్‌ అవుతున్నామని ఐసీసీ సీఈవో మను సాహ్నీ ఆదివారం పేర్కొన్నారు. ‘ఎంఎస్‌ ధోనీ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఆటగాళ్లలో ఒకడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో అతడు కొట్టిన విన్నింగ్‌ షాట్‌ ప్రపంచ క్రికెట్‌ అభిమానుల మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అతడు మొత్తం తరానికి స్ఫూర్తిగా నిలిచాడు. అతడి ఆటను మిస్సవుతాం. ఈ సందర్భంలో అతడికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నా’ అని సాహ్నీ అన్నారు. 

జేబుదొంగల కంటే వేగంగా: 

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ధోనీ రిటైర్మెంట్‌పై చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. లెఫ్టినెంట్‌ కర్నల్‌ ధోనీకి  సెల్యూట్‌ అని స్పందిస్తూ ‘మహీ ఎవరి తర్వాత కాదు. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి దేశ క్రికెట్‌ స్వరూపాన్నే మార్చేశాడు. అతను చేసే స్టంప్‌ ఔట్‌లు, రనౌట్లు అద్భుతం. జేబులు కట్‌ చేసే దొంగల కంటే వేగంగా వికెట్లను గిరాటు వేయడం మహీకే సొంతం. టీ20, వన్డే ప్రపంచకప్‌లు, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ, టెస్టుల్లో నంబర్‌వన్‌ ఇలా ధోనీ ఘనతలు లెక్కకు మిక్కిలి. ఖరగ్‌పూర్‌లో రైల్వే టికెట్‌ కలెక్టర్‌ నుంచి మొదలుపెడితే భారత కెప్టెన్‌గా ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. కెరీర్‌ ఆసాంతం నిరాడంబరతను ప్రదర్శించిన ధోనీ అదే రీతిలో వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచాడు. వికెట్‌కీపింగ్‌లో అతను అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పాడు’ అని అన్నాడు. 

నీ తరంలో అథ్లెట్‌ అయినందుకు గర్విస్తున్నా: సానియా

ధోనీ రిటైర్మెంట్‌పై భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా స్పందించింది. మహీ ఆడిన తరంలోనే అథ్లెట్‌ అయినందుకు గర్విస్తున్నానని చెప్పింది. ‘ధోనీ నువ్వో దిగ్గజం. దేశానికి నువ్వందించిన సేవలకు ధన్యవాదాలు. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ క్రీడాకారుల్లో నువ్వు ఒకడివి. నువ్వ ఆడిన తరంలోనే నేనూ ఓ క్రీడాకారిణి అయినందుకు గర్విస్తున్నా. నీ భవిష్యత్తు మరింత బాగుండాలని ఆశిస్తున్నా’ అని సానియా అంది. 

ధోనీని ఆకాశానికెత్తిన క్రీడాలోకం

తన ఫినిషింగ్‌ మ్యాజిక్‌తో యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ధోనీకి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతున్నది. ఐసీసీ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ అని కీర్తిస్తే.. సునీల్‌ గవాస్కర్‌ దిగ్గజంగా అభివర్ణించాడు. జేబుదొంగల కన్నా వేగంగా వికెట్లను గిరాటేస్తాడని రవిశాస్త్రి ఆకాశానికెత్తితే.. ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్‌ అని  కోహ్లీ వేనోళ్ల పొగిడాడు.  

ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్‌


టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌  ధోనీని తన మార్గదర్శిగా పేర్కొనే భారత సారథి కోహ్లీ.. మహీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ‘ఇంకెన్నాైళ్లెనా నువ్వే నా కెప్టెన్‌' అని పేర్కొన్నాడు. తన బ్యాటింగ్‌, కెప్టెన్సీ, వికెట్‌ కీపింగ్‌తో భారత జట్టుకు ఎన్నో విజయాలందించిన ధోనీపై తనకున్న అభిమానాన్ని విరాట్‌ ఓ వీడియాలో పంచుకున్నాడు. దాన్ని బీసీసీఐ ఆదివారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ‘నీతో ఉన్న అనుబంధాన్ని మాటల్లో చెప్పడం కష్టం. ప్రతీక్షణం జట్టు విజయం కోసమే తపించావు. నీ నాయకత్వంలో ఆడటం నాకు దక్కిన అదృష్టం. నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞుడిని. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పాను.. ఎప్పటికీ నువ్వే నా సారథివి’ అని కోహ్లీ అందులో చెప్పాడు.  

ధోనీ ఓ దిగ్గజం: గవాస్కర్‌ 

భారత ఆల్‌టైం ఎలెవన్‌ ఎంచుకోవాల్సి వస్తే.. హర్యానా హరికేన్‌ కపిల్‌ దేవ్‌ కంటే..  ధోనీ వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయని సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు. వాళ్లిద్దరూ గొప్ప ఆటగాళ్లే అని.. తమ జట్లకు విజయం అందించడం తప్ప మరోదాన్ని  తట్టుకోలేని వ్యక్తిత్వాలని సన్నీ పేర్కొన్నాడు.

 ‘కన్నీళ్లు రాల్చే ఉంటావు’ 


ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలుపుతూ.. అతడు సాధించిన ఘనతలు గుర్తుచేసుకుంటుంటే.. భార్య సాక్షి ధోనీ భావోద్వేగానికి గురైంది. సామాజిక మాధ్యమాల్లో తన భావాలను పంచుకుంది. ‘ఆటకు అత్యుత్తమ సేవలు అందించినందుకు అభినందనలు. నువ్వేం సాధించావో దాని పట్ల గర్వంగా ఉండాలి. నీ వ్యక్తిత్వం పట్ల గర్విస్తున్నా. నీకు ఎంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలకడమంటే కచ్చితంగా కన్నీళ్లు రాల్చే ఉంటావు నాకు తెలుసు. ఇకపై నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటూ మరిన్ని గొప్ప విషయాలను ఆస్వాదించాలని ఆశిస్తున్నా. నువ్వేం చెప్పావో, ఏం చేశావో ప్రజలు మర్చిపోయినా.. వాళ్లని ఎలా మైమరిపించావో మాత్రం ఎప్పటి మరువరు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. 

 నంబర్‌ 7కు రిటైర్మెంట్‌ ఇవ్వాలి: కార్తీక్‌


 ధోనీ వీడ్కోలుతో అతడి జెర్సీకి కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాలని భారత ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ బీసీసీఐని కోరాడు. ఏడో నంబర్‌ జెర్సీతో దుమ్మురేపిన మహీకి ఈ గౌరవం ఇవ్వడం సముచితంగా ఉంటుందని పేర్కొన్నాడు. 16 ఏండ్ల కెరీర్‌కు ధోనీ శనివారం వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీంతో అతడితో పాటు అతడి జెర్సీకి కూడా పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ఇవ్వాలని కార్తీక్‌ అన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ధోనీతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసిన కార్తీక్‌.. భవిష్యత్తులో అంతా మంచే జరగాలని ఆకాంక్షించాడు. గతంలో భారత దిగ్గజం సచిన్‌ విషయంలోనూ ఇలాంటి చర్చ జరిగింది. సచిన్‌ వాడిన 10వ నంబర్‌ జెర్సీని బీసీసీఐ ఇప్పటివరకు ఇతర క్రికెటర్లకు కేటాయించని సంగతి తెలిసిందే. 


logo