శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sports - Sep 25, 2020 , 15:55:13

IPL 2020: చెన్నై టీమ్‌లో మార్పులు..!

IPL 2020: చెన్నై టీమ్‌లో మార్పులు..!

దుబాయ్‌: ఐపీఎల్‌ 2020లో  భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే), ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ) జట్లు ఇవాళ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆసక్తికరంగా సాగే  పోరులోనూ చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఏ స్థానంలో బ్యాటింగ్‌ వస్తాడు? అనే దానిపై ఎక్కువగా చర్చ జరుగుతున్నది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.  దీంతో  గత మ్యాచ్‌లో జట్టు పేలవ ప్రదర్శన, ఢిల్లీతో మ్యాచ్‌  నేపథ్యంలో   ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌,  అనుసరించాల్సిన వ్యూహాలు, తుది జట్టులో మార్పులు తదితర అంశాలపై   సీఎస్‌కే క్యాంప్‌లో సుధీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది.

శుక్రవారం జరిగే పోరులో ధోనీ నంబర్‌ నాలుగు లేదా ఐదులో బరిలో దిగనున్నట్లు సమాచారం. ఢిల్లీతో మ్యాచ్‌లో  బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు వెళ్లాలని ధోనీని  టీమ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఒప్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  పరిస్థితులను బట్టి రుతురాజ్ గైక్వాడ్ లేదా ధోనీ బ్యాటింగ్ క్రమంలో నెంబర్ 4 & 5 స్థానాలను మార్చుకుంటారు. 

వీరిద్దరి   తర్వాత కేదార్‌ జాదవ్‌, జడేజా బరిలో దిగుతారు.  గత మ్యాచ్‌లో పేలవ బౌలింగ్‌తో నిరాశపరిచిన లుంగీ ఎంగిడీని జోష్‌ హేజిల్‌వుడ్‌తో భర్తీ చేయనున్నారు. ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న యువ ఆటగాడు శామ్‌ కరన్‌ స్థానంలో సౌతాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. 


logo