గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 02, 2020 , 23:39:17

మ‌ళ్లీ ఓడిన చెన్నై.. గెలిచిన సన్‌రైజర్స్‌

మ‌ళ్లీ ఓడిన చెన్నై.. గెలిచిన సన్‌రైజర్స్‌

దుబాయ్:  ఐపీఎల్‌-13వ సీజన్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూసింది.  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి  బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో చెన్నై మళ్లీ  ఓడింది. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌ సేన వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.  బౌలర్లు అదరగొట్టిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌  7 పరుగుల తేడాతో చెన్నైపై గెలుపొందింది.  165 పరుగుల  లక్ష్య ఛేదనలో   చెన్నై నిర్ణీత ఓవర్లలో  5 వికెట్లకు 157 పరుగులు చేసింది.  ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(50 :35 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) మాత్రమే అర్ధశతకంతో రాణించాడు.  కెప్టెన్‌ ధోనీ(47 నాటౌట్‌: 36 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) ఆఖరి వరకు క్రీజులో ఉండి చెన్నైని గెలిపించలేకపోయాడు.   కీలక సమయంలో మహీ భారీ షాట్లు ఆడలేకపోయాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో నటరాజన్‌(2/43) రెండు వికెట్లు తీయగా , అబ్దుల్‌ సమద్‌, భువనేశ్వర్‌ చెరో వికెట్‌ తీశారు. 

లక్ష్య ఛేదనను చెన్నై పేలవంగా ఆరంభించింది.  సన్‌రైజర్స్‌  పేసర్ల  ధాటికి  చెన్నై 42 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకున్నది. పవర్‌ప్లేలో  బౌలర్లు పదునైన బంతులతో విరుచుకుపడ్డారు.   భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన మూడో ఓవర్లో షేన్‌ వాట్సన్‌ బౌల్డ్‌ అయ్యాడు.   మరో ఎండ్‌లో డుప్లెసిస్‌ బౌలర్లపై ఎదురుదాడి చేసే  ప్రయత్నం చేశాడు.  ఈ సయయంలో వన్‌డౌన్‌లో వచ్చిన అంబటి రాయుడు  ఎక్కువసేపు నిలువలేదు.   నటరాజన్‌ వేసిన ఆరో ఓవరో మొదటి బంతికి రాయుడ్‌ బౌల్డ్‌ అయ్యాడు.  మూడు, నాలుగు బంతులను డుప్లెసిస్‌ ఫోర్లుగా మలిచాడు.  ఆరో బంతికి కేదార్‌ జాదవ్‌ సింగిల్‌ తీసే ప్రయత్నం చేయగా..  డుప్లెసిస్‌ అనూహ్యంగా రనౌటయ్యాడు. మూడు కీలక వికెట్లు తీసిన సన్‌రైజర్స్‌ మ్యాచ్‌పై పట్టుబిగించింది. 

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్‌ ధోనీతో కలిసి జాదవ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.   యువ బౌలర్‌ అబ్దుల్‌ సమద్‌..జాదవ్‌ వికెట్‌ తీసి చెన్నైని ఒత్తిడిలో పడేశాడు.  ఈ దశలో క్రీజులో ఉన్న ధోనీ, జడేజా నిదానంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపించారు. చివరి  ఓవర్లలో జడేజా వేగంగా ఆడి హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటి వరకు  చాలా నెమ్మదిగా ఆడిన ధోనీ 19వ ఓవర్లో  6, 4 బాది 16 రన్స్‌ రాబట్టాడు. చివరి ఓవర్‌లో 23 రన్స్‌ అవసరం కాగా అబ్దుల్‌ సమద్‌ తొలి బంతిని వైడ్‌ వేయడంతో 5  పరుగులు వచ్చాయి.  ధోనీ ఒక ఫోర్‌, శామ్‌ కరన్‌ సిక్స్‌  కొట్టడంతో  20 పరుగులు వచ్చినా  గెలుపు అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. 

అంతకుముందు  ప్రియం గార్గ్‌(51 నాటౌట్:  26 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌ )  మెరుపు అర్ధశతకంతో రాణించడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు  164 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ(31: 24 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌)  కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.   వార్నర్‌(28), మనీశ్‌ పాండే(29) ఫర్వాలేదనిపించారు.  చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌(2/31) రెండు వికెట్లు తీయగా శార్దుల్‌ ఠాకూర్‌, పియూశ్‌ చావ్లా  చెరో వికెట్‌ తీశారు.   కుర్రాళ్లు  గార్గ్‌,  అభిషేక్‌  ఆద్యంతం ఆకట్టుకున్నారు. వారిద్దరి ధనాధన్‌ బ్యాటింగ్‌ మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచింది.