శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 18, 2020 , 17:37:26

SRH vs KKR: రాణించిన మోర్గాన్‌, కార్తీక్‌

SRH vs KKR: రాణించిన మోర్గాన్‌, కార్తీక్‌

అబుదాబి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌  బ్యాట్స్‌మెన్‌ సమిష్టిగా రాణించారు. సన్‌రైజర్స్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని  బ్యాట్స్‌మెన్‌ తమదైన శైలిలో ఆడటంతో కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఆరంభంలో శుభ్‌మన్‌ గిల్‌(36: 37 బంతుల్లో 5ఫోర్లు) శుభారంభం అందించగా ఆఖర్లో  ఇయాన్‌  మోర్గాన్‌(34: 23 బంతుల్లో 3ఫోర్లు), దినేశ్‌ కార్తీక్‌(29 నాటౌట్:‌ 14 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. 

మధ్య ఓవర్లలో  రాహుల్‌  త్రిపాఠి(23: 16 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌), నితీశ్‌ రాణా(29: 20 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. ఈ పిచ్‌పై కోల్‌కతా సవాల్‌ విసిరే స్కోరునే సాధించింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో టి నటరాజన్‌(2/20) రెండు వికెట్లు తీయగా బసిల్‌ థంపి, విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.    టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన  కోల్‌కతాను సన్‌రైజర్స్‌  బౌలర్లు భారీ షాట్లు ఆడకుండా నిలువరించారు.  పవర్‌ప్లే ఆఖరికి 48/1తో పటిష్ఠస్థితిలో నిలిచింది.  అయినప్పటికీ ఓపెనర్లు వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు.   మధ్య ఓవర్లలో   కోల్‌కతాను  సమర్థవంతంగా కట్టడి చేశారు. 

మరోవైపు క్రీజులో కుదురుకున్న  శుభ్‌మన్‌ గిల్‌,  నితీశ్‌రాణా   స్వల్ప వ్యవధిలోనే  పెవిలియన్‌ చేరారు. క్రీజులో కుదురుకున్న బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌  చేరడంతో కోల్‌కతా స్కోరు వేగం తగ్గింది.  రషీద్‌ ఖాన్‌ వేసిన 12వ ఓవర్‌లో శుభ్‌మన్‌గిల్‌ (36) ఔటయ్యాడు.  నాలుగో బంతికి భారీ షాట్‌ ఆడగా డీప్‌లో గార్గ్‌  డైవింగ్‌  చేసి  కళ్లుచెదిరే క్యాచ్‌ అందుకున్నాడు.    దీంతో 87 పరుగుల వద్ద కోల్‌కతా రెండో వికెట్‌  కోల్పోయింది.    

విజయ్‌ శంకర్‌ వేసిన   తర్వాతి  ఓవర్‌ తొలి బంతికి నితీశ్‌ రాణా(29)  క్యాచ్‌ ఔటయ్యాడు.   మొదటి బంతిని  భారీ షాట్‌ ఆడగా ప్రియమ్‌ గార్గ్‌  సూపర్బ్‌ క్యాచ్‌ అందుకున్నాడు.  దీంతో కోల్‌కతా 88 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయి కష్టాల్లోపడింది.  ఆఖర్లో కార్తీక్‌, మోర్గాన్‌ మెరుపులు మెరిపించారు.   ఐదో  వికెట్‌కు వీరిద్దరూ 58  పరుగులు జోడించడంతో   కోల్‌కతా 160  మార్క్‌ దాటింది.  ఆఖరి 3 మూడు ఓవర్లలో కోల్‌కతా 42 పరుగులు రాబట్టింది.