శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Jan 18, 2021 , 13:47:37

5 వికెట్ల‌తో అరుదైన క్ల‌బ్‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్‌

5 వికెట్ల‌తో అరుదైన క్ల‌బ్‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్‌

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో హైద‌రాబాదీ పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ 5 వికెట్లు తీసుకోవ‌డం ద్వారా అరుదైన క్ల‌బ్‌లో చేరాడు. ఆడిన తొలి టెస్ట్ సిరీస్‌లోనే ఐదు వికెట్ల ఘ‌న‌త సాధించ‌డం ఒక విశేష‌మైతే.. గ‌బ్బా స్టేడియంలో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఐదో ఇండియ‌న్ బౌల‌ర్‌గా సిరాజ్ నిలిచాడు. సిరాజ్ కంటే ముందు ఎరాప‌ల్లి ప్ర‌స‌న్న‌, బిష‌న్ సింగ్ బేడీ, మ‌ద‌న్ లాల్‌, జ‌హీర్ ఖాన్ మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాధించారు. 1968లో ప్ర‌స‌న్న ఇదే గ‌బ్బా స్టేడియంలో 104 ప‌రుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ స్టేడియంలో ఒక ఇండియ‌న్ బౌలర్ అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇదే. అంతేకాదు సిరాజ్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో త‌మ‌కు పెట్ట‌ని కోట‌లా ఉన్న గ‌బ్బాలో ఆస్ట్రేలియా కూడా.. 22 ఏళ్ల త‌ర్వాత తొలిసారి రెండు ఇన్నింగ్స్‌ల‌లోనూ ఆలౌటైంది. 1987 నుంచి ఇక్క‌డ రెండు ఇన్నింగ్స్‌ల‌లో ఆస్ట్రేలియా ఆలౌట్ కావ‌డం ఇది కేవ‌లం మూడోసారి మాత్ర‌మే. 

సిరాజే టాప్‌

ఇక ప్ర‌స్తుతం బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఇండియా త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసుకున్న బౌల‌ర్‌గానూ సిరాజ్ నిలిచాడు. మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసిన సిరాజ్‌.. అశ్విన్ (12)ని వెన‌క్కి నెట్టాడు. ఆస్ట్రేలియా టూర్ ఒక విధంగా సిరాజ్‌కు మ‌రుపురానిద‌నే చెప్పాలి. అక్క‌డ అడుగుపెట్టిన త‌ర్వాత హైద‌రాబాద్‌లో త‌న తండ్రి చ‌నిపోయాడ‌న్న వార్త తెలిసింది. దీంతో తిరిగి వెళ్లిపోవ‌చ్చ‌ని బీసీసీఐ అత‌నికి అనుమ‌తి ఇచ్చింది. అయినా సిరాజ్ మాత్రం అంతటి దుఃఖంలోనూ అక్క‌డే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. 

అరంగేట్ర సిరీస్‌లోనే పెద్ద దిక్కుగా..

మెల్‌బోర్న్‌లో జ‌రిగిన రెండో టెస్ట్‌తోనే సిరాజ్.. ఐదు రోజుల ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. కానీ చివ‌రి టెస్ట్ వ‌చ్చేసరికి అత‌డే టీమ్ పేస్ బౌలింగ్‌కు పెద్ద దిక్కుగా మారిపోయాడు. గాయాల‌తో స్టార్ బౌల‌ర్లు బుమ్రా, ష‌మి, ఉమేష్ దూర‌మైన వేళ‌.. త‌న‌కున్న రెండు టెస్ట్‌ల అనుభ‌వంతోనే టీమ్ పేస్‌బౌలింగ్ భారాన్ని మోశాడు. త‌న‌పై ఉన్న అంచ‌నాల‌ను వ‌మ్ము చేయ‌కుండా ఐదు వికెట్ల‌తో స్ఫూర్తిదాయ‌క ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 

ఫ్యాన్స్ ల‌క్ష్యంగా చేసుకున్నా..

ఆస్ట్రేలియా అభిమానుల‌కు ఉన్న నోటి దురుసు సంగ‌తి తెలుసు క‌దా. ప్ర‌తి టూర్‌లో టీమ్‌లోని ఎవ‌రో ఒక ప్లేయ‌ర్‌ను ప్ర‌త్యేకంగా ల‌క్ష్యంగా చేసుకొని మాట‌ల‌తో వేధిస్తారు. ఈసారి మ‌హ్మ‌ద్ సిరాజే వాళ్ల ల‌క్ష్య‌మ‌య్యాడు. సిడ్నీ టెస్ట్‌లో కొంద‌రు అభిమానులు సిరాజ్‌పై నోరు పారేసుకున్నారు. బ్రౌన్ డాగ్‌, బిగ్ మంకీ అంటూ జాతి వివ‌క్ష వ్యాఖ్య‌లు చేశారు. బ్రిస్బేన్‌లోనూ కొంద‌రు ఫ్యాన్స్ అత‌న్ని వేధించారు. ఈ ఘ‌ట‌న‌తో సిరాజ్ కుంగిపోకుండా మ‌రింత రాటుదేలాడు. ఇంకా క‌సిగా బౌలింగ్ చేస్తున్నాడు. ఫ‌లిత‌మే ఈ ఐదు వికెట్ల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌. ఈ టూర్ అత‌నికి చిరస్మ‌ర‌ణీయంగా మిగిలిపోవ‌డ‌మే కాదు.. టీమ్‌లో అత‌ని స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. 


ఇవి కూడా చ‌ద‌వండి

పాకిస్థాన్‌లో మోదీ ప్ల‌కార్డులు.. ఎందుకు?

స్మిత్ ముందే రోహిత్ శ‌ర్మ కూడా అదే ప‌ని చేశాడా.. వీడియో

ఇక మీ ఇష్టం.. ఏ పార్టీలో అయినా చేరండి!

VIDEOS

logo