లండన్: తనను విమర్శించే వారికి బంతితోనే సమాధానమిస్తానంటున్నాడు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా వికెట్లు తీసిన అనంతరం సిరాజ్.. నోటి మీద వేలు వేసుకుని సంబురాలు చేసు కుంటున్నాడు. లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేశాక ఇదే తరహాలో సెలబ్రేట్ చేశాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘అది విమర్శకులకు నా సమాధానం. నా బౌలింగ్ గురించి వాళ్లు చాలా అన్నారు. నేను ఇది చేయలేనని, అది చేయలేనని విమర్శలు చేశారు. వాళ్లందరికీ బంతితోనే సమాధానం ఇవ్వాలనుకున్నా. అందులోంచి పుట్టిందే ఈ కొత్త తరహా సెలబ్రేషన్’ అని అన్నాడు.