శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 16, 2020 , 00:16:21

బౌలర్లు భళా

బౌలర్లు భళా
  • అదరగొట్టిన షమీ, బుమ్రా, ఉమేశ్‌
  • న్యూజిలాండ్‌ ఎలెవన్‌ 235 ఆలౌట్‌.. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 59/0

హామిల్టన్‌: బ్యాటింగ్‌లో ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లు విఫలమవడంతో ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైన భారత్‌.. బౌలింగ్‌లో సమిష్ఠిగా సత్తాచాటింది. ఫలితంగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌ (మూడు రోజులు) తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ ఎలెవన్‌ 235 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్‌ షమీ (3/17), జస్ప్రీత్‌ బుమ్రా (2/18), ఉమేశ్‌ యాదవ్‌ (2/49), నవ్‌దీప్‌ సైనీ (2/58) ధాటికి ఆ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. కూపర్‌ (40) టాప్‌స్కోరర్‌. స్వింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై బుమ్రా, షమీ ప్రత్యర్థిని ఆటాడించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. శనివారం ఆట ముగిసే సమయానికి 7 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న భారత్‌ ప్రస్తుతం 87 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓపెనర్లు పృథ్వీ షా (25 బంతుల్లో 35 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, ఒక సిక్స్‌), మయాంక్‌ అగర్వాల్‌ (23; 4 ఫోర్లు, ఒక సిక్స్‌) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఔటైన వీరిద్దరూ రెండో ఇన్నింగ్స్‌లో వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేశారు.


బెంబేలెత్తించిన బుమ్రా, షమీ

వన్డే సిరీస్‌లో ఒక్క వికెట్‌ పడగొట్టలేకపోయిన యార్కర్‌ కింగ్‌ జస్ప్రీత్‌ బుమ్రా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అదరగొట్టాడు. రెండో ఓవర్‌లోనే యాంగ్‌ (2)ను ఔట్‌ చేసిన అతడు.. అలెన్‌ (20) వికెట్‌ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి స్పెల్‌లో ఉమేశ్‌ యాదవ్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో బంతినందుకున్న షమీ తన తొలి ఓవర్‌లోనే సీఫర్ట్‌ (9)ను పెవిలియన్‌ బాట పట్టించాడు. మధ్యలో ఉమేశ్‌ యాదవ్‌.. రవీంద్ర (34)ను ఔట్‌ చేయడంతో ఆ జట్టు 82 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్రూస్‌ (31), కూపర్‌ కాస్త పోరాడారు. ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించాక సైనీ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కాసేపటికి షమీ వరుస ఓవర్లలో కూపర్‌, నీషమ్‌ (1)ను ఔట్‌ చేసి న్యూజిలాండ్‌ ఎలెవన్‌ను గట్టి దెబ్బకొట్టాడు. టెయిలెండర్లతో కలిసి కొన్ని విలువైన పరుగులు జోడించిన కెప్టెన్‌ డారిల్‌ మిషెల్‌ (32)ను ఉమేశ్‌ యాదవ్‌ డగౌట్‌ బాట పట్టించాడు. కాసేపటికి సైనీ.. క్లీవర్‌ (13) ఆట కట్టించగా.. సోధి (14) వికెట్‌ పడగొట్టిన అశ్విన్‌ న్యూజిలాండ్‌ ఎలెవన్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. దీంతో భారత్‌కు 28 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. 


దంచికొట్టిన ఓపెనర్లు

మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ ఈసారి విజృంభించారు. వచ్చీ రావడంతోనే బౌండ్రీలతో విరుచుకుపడి.. పరుగుల వరద పారించారు. టిక్నర్‌ వేసిన తొలి ఓవర్‌లో పృథ్వీ రెండు ఫోర్లు బాదితే.. అతడి మరుసటి ఓవర్‌లో మయాంక్‌ అదే శిక్ష వేశాడు. ఈ సారి కుగ్‌లిన్‌ ఓవర్‌లో షా 6,4 దంచితే.. అతడి మరుసటి ఓవర్‌లో మయాంక్‌ 6,4,4 కొట్టాడు. ఫలితంగా రెండో రోజు ఆట ముగి సే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని టీమ్‌ఇండియా ఓవరాల్‌గా 87 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం ఆటకు ఆఖరి రోజు.


వన్డే, టీ20 ప్రపంచకప్‌ కంటే అదే ఎక్కువ.. 

ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌పై పుజారా వ్యాఖ్య

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తొలిసారి ప్రవేశపెట్టిన టెస్టు చాంపియన్‌షిప్‌ నెగ్గడం.. వన్డే, టీ20 ప్రపంచకప్‌లు సాధించడం కంటే పెద్ద ఘనత అని భారత టెస్టు బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా అభిప్రాయపడ్డాడు. చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌లూ నెగ్గి 360 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌.. ఈ నెల 21 నుంచి న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో పుజారా మాట్లాడుతూ.. ‘టెస్టు చాంపియన్‌షిప్‌ నెగ్గితే.. నా దృష్టిలో అది వన్డే, టీ20 ప్రపంచకప్‌ల కంటే ఎక్కువే. ఎందుకంటే క్రికెట్‌లో అత్యుత్తమ ఫార్మాట్‌ టెస్టులే. దిగ్గజ ఆటగాళ్లెవరిని అడిగినా మీకు ఇదే సమాధానం వస్తుంది. మాజీ, తాజా ఆటగాళ్లు కూడా టెస్టులే బెస్ట్‌ అని ఒప్పుకుంటారు. చాంపియన్‌షిప్‌లో కేవలం స్వదేశంలో మ్యాచ్‌లు నెగ్గితే సరిపోదు. పాయింట్లు సాధించాలంటే విదేశాల్లో కూడా సత్తాచాటాల్సిందే. రెండేండ్లు నిలకడైన ప్రదర్శన చేసిన జట్టే ఫైనల్‌ చేరుతుంది’ అని చెప్పుకొచ్చాడు.


అప్పుడే విమర్శలా..

రెండు, మూడు మ్యాచ్‌ల్లో రాణించలేకపోవడంతోనే జస్ప్రీత్‌ బుమ్రా ప్రతిభను తక్కువ అంచనా వేయడం సరైంది కాదని సహచర పేసర్‌ మహమ్మద్‌ షమీ పేర్కొన్నాడు. వన్డే సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయినప్పటికీ బుమ్రా ప్రమాదకర బౌలర్‌ అని, గతంలో ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాన్నందించాడని గుర్తుచేశాడు. ‘గత కొన్ని మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శన గొప్పగా సాగకపోవచ్చు. కానీ అంతకుముందు అతడు ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేసి ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. అతడు సాధించిన ఘనతలను అంత త్వరగా ఎలా మర్చిపోతారో అర్థం కావడం లేదు. ఒకరిపై కామెంట్‌ చేయడం చాలా సులువు. గాయం తర్వాత తిరిగి పుంజుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. అనుభవం పెరుగుతున్న కొద్ది సవాళ్లను ఎదుర్కొనే శక్తి వస్తుంది. సైనీ చక్కటి బంతులేస్తున్నాడు. అతడిని సానబెడితే మరింత మెరుగవుతాడు’ అని షమీ పేర్కొన్నాడు.


స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 265, న్యూజిలాండ్‌ ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌: యాంగ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 2, రవీంద్ర (సి) పంత్‌ (బి) ఉమేశ్‌ 34, సీఫర్ట్‌ (సి) పంత్‌ (బి) షమీ 9, అలెన్‌ (బి) బుమ్రా 20, కూపర్‌ (సి) మయాంక్‌ (బి) షమీ 40, బ్రూస్‌ (బి) సైనీ 31, డారిల్‌ (సి) పృథ్వీ (బి) ఉమేశ్‌ 32, నీషమ్‌ (బి) షమీ 1, క్లీవర్‌ (బి) సైనీ 13, కుగ్‌లిన్‌ (నాటౌట్‌) 11, సోధి (సి) పుజారా (బి) అశ్విన్‌ 14, ఎక్స్‌ట్రాలు: 28, మొత్తం: 74.2 ఓవర్లలో 235 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-11, 2-36, 3-70, 4-82, 5-133, 6-155, 7-161, 8-204, 9-213, 10-235, బౌలింగ్‌: బుమ్రా 11-3-18-2, ఉమేశ్‌ 13-1-49-2, షమీ 10-5-17-3, సైనీ 15-2-58-2, అశ్విన్‌ 15.2-2-46-1, జడేజా 10-4-25-0. 

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (నాటౌట్‌) 35, మయాంక్‌ (నాటౌట్‌) 23, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 7 ఓవర్లలో 59/). బౌలింగ్‌: టిక్నర్‌ 3-0-19-0, కుగ్‌లిన్‌ 3-0-34-0, జాన్సన్‌ 1-0-6-0.


logo