37 బంతుల్లోనే సెంచరీ బాదిన అజారుద్దీన్

ముంబై: మీరు పేరు సరిగ్గానే చదివారు. మహ్మద్ అజారుద్దీన్ సెంచరీ బాదాడు. అది కూడా కేవలం 37 బంతుల్లోనే. అయితే ఈ అజారుద్దీన్ మన హైదరాబాదీ అజ్జూ భాయ్ కాదు. కేరళకు చెందిన 26 ఏళ్ల యువ బ్యాట్స్‌మన్. నిజానికి అజర్ ఆటంటే ఇష్టపడే అతని సోదరుడు అతనికి ఆ పేరు పెట్టాడు. అందుకు తగినట్లే ఆ స్టైలిష్ బ్యాట్స్‌మన్ పేరు నిలబెడుతున్నాడు ఈ యువ అజారుద్దీన్. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా ముంబై టీమ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మహ్మద్ అజారుద్దీన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
టోర్నీ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు అజారుద్దీన్. 37 బంతుల్లోనే సెంచరీ కొట్టడం కాదు.. చివరికి 54 బంతుల్లో 137 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని జోరుతో ముంబై విధించిన 197 పరుగుల భారీ లక్ష్యాలన్ని 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి కేరళ ఛేదించింది. ఈ క్రమంలో కేరళ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంతేకాదు ముస్తాక్ అలీ టోర్నీలో ఇది అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 11 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.
అతనికి ఆ పేరు ఎలా వచ్చింది?
అసలు అతని పేరు వెనుకే ఓ ఆసక్తికరమైన స్టోరీ ఉంది. ప్రస్తుతం కేరళ కోచ్‌గా ఉన్న టిను యొహానన్ స్పోర్ట్స్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిని వెల్లడించాడు. నిజానికి అతనికి ఈ పేరు పెట్టింది అతని సోదరుడు కమ్రుద్దీన్. అతనికి అజర్ అంటే చాలా ఇష్టం. దీంతో తన తమ్ముడికి తన ఆరాధ్య క్రికెటర్ అజారుద్దీన్ పేరే పెట్టాలని పట్టుబట్టాడు. ఈ అజర్ పుట్టింది 1994లో. అప్పటికి ఇండియన్ క్రికెట్లో మహ్మద్ అజారుద్దీన్ ఓ వెలుగు వెలిగిపోతున్నాడు. ఇండియన్ టీమ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా అజర్‌కు పేరున్న విషయం తెలిసిందే.