e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home స్పోర్ట్స్ గెలిచాను

గెలిచాను

  • అవును.. గెలిచింది.. విశ్వక్రీడల్లో పతకం మాత్రమే కాదు..
  • 130 కోట్ల మంది భారతీయుల మనసులు గెలిచింది..

ఆ.. అమ్మాయే కదా.. ఏం చేయలేస్తుందిలే అనుకున్న వాళ్ల అహంకారాన్ని గెలిచింది.. మారుమూల గ్రామం నుంచి వచ్చింది.. విశ్వస్థాయిలో పతకం తేగలదా.. అనుకున్న వాళ్ల అనుమానాలను
గెలిచింది..రియోలో నిరాశ పరిచింది.. ఆమెపై ఆశలు అవసరమా అనుకున్న వాళ్ల నిస్తేజాన్ని గెలిచింది.అన్నిటి కంటే ముఖ్యంగా.. ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాక రోజులు లెక్కపెడుతూ..
మన దేశం పతకాల పట్టికలో బోణీ ఎపుడు కొడుతుందా అని ఎదురుచూసే వాళ్ల నిరీక్షణను గెలిచింది. టోక్యోలో విశ్వక్రీడల తొలిరోజే త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన మీరాబాయి చాను ప్రస్థానంపై ఓ కన్నేస్తే.

ఐదేండ్లలో ఐదు రోజులు మాత్రమేరియో ఒలింపిక్స్‌లో ఓటమి పాలైనప్పుడే.. టోక్యోలో నేనేంటో నిరుపించుకోవాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ ఐదేండ్లలో కేవలం ఐదు రోజులు మాత్రమే ఇంటి దగ్గర ఉన్నా. ఇప్పుడు ఈ పతకంతో ఊళ్లో అడుగుపెడుతా

- Advertisement -

మీరాబాయి

అది రియో ఒలింపిక్స్‌ ప్రధాన స్టేడియం. వెయిట్‌ లిఫ్టింగ్‌ మహిళల 49 కేజీల విభాగంలో పోటీలు జరుగుతున్నాయి. భారత్‌ తరఫున బరిలోకి దిగిన ఓ లిఫ్టర్‌ ఎంత ప్రయత్నించినా నిర్దేశించుకున్న బరువు ఎత్తలేకపోయింది. మూడు ప్రయత్నాల్లోనూ విపలమై రిక్తహస్తాలతో వెనుదిరిగింది. సరిగ్గా ఐదేండ్ల తర్వాత టోక్యో విశ్వవేదికపై అడుగుపెట్టిన ఆ అమ్మాయి రెండొందల కేజీల బరువును అలవోకగా ఎత్తిపడేసి రజతం పతకం సొంతం చేసుకుంది. ఆమె మణిపూర్‌కు చెందిన సైఖోమ్‌ మీరాబాయి చాను. రాజధాని ఇంఫాల్‌ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలోని మారుమూల గ్రామమైన నాగ్‌పాక్‌ కాక్‌చింగ్‌లో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన చాను.. నేడు యావత్‌ భారతావని గర్వపడేలా చేసింది. అయితే దీని వెనుక ఆమె పడ్డ కష్టం చిన్నదేం కాదు. కుటుంబ సభ్యులను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని మీరా.. ఏండ్లకు ఏండ్లు ప్రాక్టీస్‌కే పరిమితమైంది. సోదరుల పెండ్లీలకు కూడా దూరంగా ఉండిపోయిన మీరా.. టోక్యోలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాక ‘చివరకు నా కల సాకారమైంది’ అని ట్వీట్‌ చేసింది.

మణిపూర్‌కే చెందిన దిగ్గజ లిఫ్టర్‌ కుంజరాణి దేవి ప్రభావంతో బరువులెత్తడాన్ని కెరీర్‌గా ఎంచుకున్న మీరాకు పేదరికం ఆడ్డుగా నిలిచింది. బలమైన పౌష్టికాహారం తీసుకునేందుకు సరిపడ ఆదాయ మార్గాలు లేక నానా ఇబ్బందులు పడింది. ఆ బాధలన్నీ పంటిబిగువున భరిస్తూ.. తన గ్రామం నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రైనింగ్‌ సెంటర్‌కు రెండు బస్సులు మారుతూ ప్రయాణం సాగించిన చాను ఎట్టకేలకు లిఫ్టింగ్‌ శిక్షణ ఆరంభించింది. ఆ సమయంలో వెదురు బొంగులతో తయారు చేసిన ట్రంక్‌ పెట్టెను వెంట తీసుకెళ్లిన చాను.. దాన్ని స్వయంగా తానే రూపొందించుకోవడం లిఫ్టింగ్‌పై ఆమెకున్న ఇష్టాన్ని స్పష్టం చేస్తుంది. అనేక కష్ట నష్టాలకోర్చి 2009లో తొలిసారి జాతీయ స్థాయి పతకంతో మెరిసిన చాను.. 2014 కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం పట్టి శభాష్‌ అనిపించుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌ సమయంలో 21 ఏండ్ల చానుపై భారీ అంచనాలు నెలకొనగా.. మూడు ప్రయత్నాల్లోనూ ఎంచుకున్న బరువు ఎత్తడంలో విఫలమైన మీరా నిరాశగా వెనుదిరిగింది. మరుసటి ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌సిప్‌లో విజేతగా నిలిచిన చాను.. తద్వారా రెండు దశాబ్దాల తర్వాత ఈ ఘనత సాధించిన భారత లిఫ్టర్‌గా రికార్డుల్లో కెక్కింది. అదే జోరులో 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో పసిడి పతకం కొల్లగొట్టింది. వరుస స్వర్ణాలతో మీరా ప్రభ వెలుగుతున్న సమయంలోనే గాయాలు ఆమెను వెనక్కి లాగాయి. వెన్ను నొప్పి కారణంగా 2018 ఆసియా క్రీడలకు దూరమైన మీరా.. ఏడాది తర్వాత గోడకు కొట్టిన బంతిలా టోక్యో పోటీల తొలిరోజే పతకం కొల్లగొట్టి భారతీయులను గర్వపడేలా చేసింది.

ఆ రోజు ఆర్చరీ సెంటర్‌ తెరిచి ఉంటే..

ఆరుగురు కుటుంబ సభ్యుల్లో అందరికంటే చిన్నదైన చానుకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు ఉన్నారు. పెద్ద కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులంతా పనిచేయనిదే ఇళ్లు గడవని పరిస్థితి. దీంతో చిన్నానాటి నుంచి కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకున్న మీరా.. పన్నేండేండ్ల వయసుకు వచ్చేసరికి తన సోదరుల కంటే ఎక్కువ బరువు మోస్తూ కుటుంబ సభ్యులను ఆశ్చర్య పరిచింది. కొండలు, గుట్టలపైకి వెళ్లి కట్టెలు తేవడమే ఆ కుటుంబ జీవనాధారం కాగా.. మీరా ఎత్తుపల్లాలను లెక్కచేయకుండా తలపై భారీ బరువులు మోస్తూ మైళ్లకు మైళ్లు నడిచివెళ్లేది. మంచినీటి సదుపాయం కూడా లేని మారుమూల గ్రామం కావడంతో చానుకు నీళ్ల క్యాన్‌లు మోయడం తప్పేది కాదు. చెరువు నుంచి ఇంటివరకు నీళ్ల క్యాన్‌ తేవడానికి తన అన్నలు నానా తంటాలు పడుతున్న సమయంలో చాను మాత్రం 30 లీటర్ల క్యాన్‌ అలవోకగా ఎత్తిపడేసేది. చిన్నప్పటి నుంచి ఆటలపై మక్కువ పెంచుకున్న మీరా.. తొలినాళ్లలో ఆర్చర్‌ కావాలని అనుకుంది. దాని కోసం ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. అయితే విధి మాత్రం ఆమెను లిఫ్టింగ్‌ వైపు లాగింది. ఆర్చరీ సెంటర్‌లో చేరేందుకు వెళ్లిన చానుకు.. అక్కడ తాళం వేసిన గేట్లు దర్శనమివ్వడంతో.. పక్కనే వెయిట్‌ లిఫ్టింగ్‌ శిక్షణ సాగుతుంటే ఆసక్తిగా అటువైపు అడుగేసింది. ఒకవేళ ఆ రోజు ఆర్చరీ సెంటర్‌ తెరిచి ఉంటే.. ఈ రోజు భారత్‌ వెండి కొండను కోల్పోయేదేమో!

టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా స్వర్ణం సాధిస్తానని లేదంటే కనీసం ఏదో ఒక పతకమైనా సొంతం చేసుకుంటానని మీరా గట్టిగా చెప్పింది. ఆ ఆనంద క్షణాల కోసం మేం ఎంతగానో ఎదురుచూశాం. చాను విజయాన్ని వీక్షించేందుకు మా బంధువులు, మిత్రులు ఒక రోజు ముందే మా ఇంటికి చేరుకున్నారు. అంతా కలిసి టీవీలో మీరా ప్రదర్శన తిలకించాం. రజతం సొంతం కాగానే మేమంతా సంతోషంలో మునిగిపోయాం. పట్టలేని ఆనందంతో మా కండ్లు చెమర్చాయి. మా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.
టాంబీ లైమా, మీరాబాయి తల్లి

కోటి నజరానా

ఇంఫాల్‌: టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన మీరాబాయి చానుకు డబుల్‌ ధమాకా దక్కింది. విశ్వక్రీడల్లో పతకంతో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన మీరాకు సొంత రాష్ట్రం మణిపూర్‌ కోటి రూపాయల నజరానా ప్రకటించింది. దీనికి తోడు ఉద్యోగాన్ని కూడా ఆమె కోసం రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు మణిపూర్‌ సీఎం బిరేన్‌సింగ్‌ శనివారం ప్రకటించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana