శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 15, 2020 , 00:21:03

మినీ ఐపీఎల్‌!

మినీ ఐపీఎల్‌!

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌.. కరాళనృత్యం చేస్తుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. మైదానాలకు తాళాలు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం.. క్రీడలకు నో అంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వాలేమో జనం ఒక్క చోట చేరడం మంచిది కాదంటున్నది. కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక క్రీడా టోర్నీలు అర్ధాంతరంగా ఆగిపోగా.. తాజాగా ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ కూడా ఈ సీజన్‌ ప్రారంభంపై స్పష్టతనివ్వలేకపోయింది. ప్రజారోగ్యమే తమ ప్రథమ ప్రాధాన్యమంటున్న బీసీసీఐ.. ఐపీఎల్‌ను వాయిదా వేయడంతో పాటు దేశవాళీ టోర్నీలన్నింటినీ రద్దు చేసింది. మరో అడుగు ముందుకేసిన ఫిఫా వచ్చే నెలలోనూ ఎలాంటి పోటీలు నిర్వహించకూడదని తీర్మానించింది. రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే ఆసీస్‌, కివీస్‌ వన్డే సిరీస్‌ రద్దుకాగా, ఫెర్గూసన్‌ కరోనా పరీక్షలో నెగెటివ్‌గా తేలాడు. మైదానాల్లోకి అభిమానులను అనుమతించకుండా మ్యాచ్‌లు నిర్వహించాలా..!వారాంతాల్లో రెండేసి మ్యాచ్‌లు పెట్టి టోర్నీ ముగించాలా..!అసలు టోర్నీ మొత్తాన్ని కుదించి మినీ ఐపీఎల్‌ నిర్వహించాలా..!ఇలా అనేక అంశాలపై చర్చించిన బీసీసీఐ పాలక మండలి సమావేశం చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. వైరస్‌ వ్యాప్తి వేగంగా సాగుతున్న సమయంలో ప్రస్తుతానికి ఆటలను పక్కనపెట్టి ప్రజారోగ్యానికే పెద్దపీట వేయాలని అంతా మూకుమ్మడిగా ఓకే చేసేశారు.

  • ఇది ఒక ఆప్షన్‌ మాత్రమే: బీసీసీఐ..
  • లీగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేమన్న దాదా
  • ఎటూ తేల్చని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌

ముంబై: కొవిడ్‌-19 ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. మూడు రాష్ర్టాల ప్రభుత్వాలు మ్యాచ్‌లు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడంతో ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29న ప్రారంభం కావాల్సిన లీగ్‌ ఏప్రిల్‌ 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానులతో శనివారం జరిగిన  గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ లీగ్‌ ప్రారంభంపై స్పష్టత కొరవడింది. కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో టోర్నీ నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించినా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో మినీ ఐపీఎల్‌ అంశం తెరపైకి వచ్చినా.. అది ఒక అవకాశం మాత్రమే అని బీసీసీఐ తేల్చినట్లు సమాచారం. ‘లీగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై ఇప్పుడే చెప్పలేం. ప్రజల ఆరోగ్యమే మా (బీసీసీఐ, ఐపీఎల్‌, స్టార్‌ నెట్‌వర్క్‌) ప్రథమ ప్రాధాన్యం. ఆర్థిక పరమైన నష్టం గురించి ఆలోచించడం లేదు’ అని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహయజమాని నెస్‌ వాడియా పేర్కొన్నారు.


ఏడింటిపై చర్చ: 

సమావేశంలో మొత్తం ఏడు ఆంశాలు చర్చకు వచ్చినట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ‘మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించి అందులో అగ్రభాగంలో నిలిచిన నాలుగు జట్లతో ప్లే ఆఫ్స్‌ నిర్వహించడంపై చర్చ జరిగింది. వారాంతాల్లో రోజు రెండు మ్యాచ్‌లు నిర్వహించాలనే అంశం తెరపైకి వచ్చింది. ఇక మరో ఆప్షన్‌గా ప్రేక్షకులను అనుమతించకుండా.. ప్లేయర్లకు ఇబ్బంది లేకుండా.. పరిమిత మైదానాల్లోనే అన్నీ మ్యాచ్‌లు నిర్వహించాలని కూడా చర్చ సాగింది. తక్కువ వ్యవధిలో 60 మ్యాచ్‌లను ఖాళీ మైదానాల్లో ఆడిస్తే.. ఫ్రాంచైజీ యాజమాన్యాలకు ఎక్కువ నష్టం రాదనే అంశంపై చర్చించాం. అయితే విదేశాల్లో ఐపీఎల్‌ నిర్వహణ అంశం మాత్రం చర్చకు రాలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షాతో పాటు బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌), ఆకాశ్‌ అంబానీ      (ముంబై ఇండియన్స్‌), పార్థ్‌ జిందాల్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌), నెస్‌ వాడియా (కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌)తో పాటు మిగిలిన ఫ్రాంచైజీల యజమానులు పాల్గొన్నారు. 


షెడ్యూల్‌ ప్రకారమే ఒలింపిక్స్‌  

టోక్యో: కరోనా వైరస్‌ అంతకంతకు విస్తరిస్తున్నా..షెడ్యూల్‌ ప్రకారమే టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహిస్తామని జపాన్‌ ప్రధాని షింజో అబె స్పష్టం చేశారు. వైరస్‌ కారణంగా ఓవైపు రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతున్న వేళ..టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై ఒకింత సందిగ్ధత ఏర్పడింది. అయితే శనివారం మీడి యా సమావేశంలో షింజో అబె మాట్లాడుతూ ‘కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులతో కలిసి మేము నిరంతరం సమీక్షిస్తూనే ఉన్నాం. పరిస్థితులపై ఎప్పటికప్పుడు అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్య(ఐవోసీ)తో సంప్రదింపులు జరుపు తున్నాం.  ఎలాంటి సమస్యలు లేకుండా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే  జూలైలో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు ముందుకు వెళుతున్నాం’ అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహణ గురించి స్పష్టంగా చెప్పలేం. కరోనా వైరస్‌ కారణంగా ప్రారంభ తేదీని ఏప్రిల్‌ 15కు మార్చాం. అంటే లీగ్‌ పూర్తి స్థాయిలో జరుగడం కష్టమే. అయితే షెడ్యూల్‌ను కుదించాల్సిన అవసరం ఉంది. అది ఎన్ని మ్యాచ్‌లు, ఎప్పుడు ప్రారంభమవుతుందనే అంశం మాత్రం ఇప్పుడే చెప్పలేం. 

-  గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడుఆటగాళ్లు, అభిమానులు, యాజమాన్యాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తాం. వైరస్‌ వ్యాప్తి తగ్గి ఐపీఎల్‌ కొనసాగాలని కోరుకుంటున్నా. సమావేశం సందర్భంగా మేమంతా పదేపదే చేతులను శానిటైజ్‌ చేసుకున్నాం. 

- షారుఖ్‌ ఖాన్‌మనం ధైర్యంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. వ్యాధి వచ్చాక ఇబ్బంది పడేకంటే.. రాకముందే ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం ముఖ్యం. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది.

- విరాట్‌ కోహ్లీ


logo