శుక్రవారం 15 జనవరి 2021
Sports - Dec 02, 2020 , 11:56:23

కోహ్లి స్పీడుకు సాటెవ్వ‌రు?

కోహ్లి స్పీడుకు సాటెవ్వ‌రు?

క్యాన్‌బెరా: రికార్డులున్న‌వి బ్రేక్ చేయ‌డానికే. ఎంతటి రికార్డులైనా ఏదో ఒక రోజు బ‌ద్ధ‌ల‌వ్వాల్సిందే. ఒక‌ప్పుడు క్రికెట్‌లో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ప‌రుగుల సునామీ చూసి అస‌లు ఈ రికార్డులను ఎవ‌రైనా తిర‌గ‌రాయ‌గ‌ల‌రా అన్న అనుమానం క‌లిగేది. కానీ ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి జోరు చూస్తుంటే.. మాస్ట‌ర్ రికార్డుల‌కు కూడా ముప్పు పొంచే ఉందని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్ప‌టికే స‌చిన్ రికార్డుల వేట‌లో ఉన్న కింగ్ కోహ్లి.. తాజాగా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో మ‌రో మాస్ట‌ర్ రికార్డును బ‌ద్ధ‌లుకొట్టాడు. వ‌న్డేల్లో అత్యంత వేగంగా 12 వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మ‌న్‌గా కోహ్లి కొత్త రికార్డు సృష్టించాడు. అంత‌టి క్రికెట్ గాడ్‌కే ఈ మైల్‌స్టోన్ అందుకోవ‌డానికి 300 ఇన్నింగ్స్ ప‌డితే.. కోహ్లి మాత్రం జ‌స్ట్ 242 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సాధించాడు. ఇదొక్క‌టే కాదు.. అత‌ని స్పీడు ముందు ఇప్ప‌టికే ఇలాంటి ఎన్నో రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. 

అస‌లు వ‌న్డేల్లో 8000 ప‌రుగుల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి వెయ్యి ప‌రుగుల మైల్‌స్టోన్‌ను అత్యంత వేగంగా అందుకున్న‌ది కోహ్లియే కావ‌డం విశేషం. 175 ఇన్నింగ్స్‌లో 8000 ప‌రుగులు చేసిన విరాట్‌.. ఆ త‌ర్వాత 9000 ప‌రుగుల‌ను 194వ ఇన్నింగ్స్‌లో, 10000 ప‌రుగుల‌ను 205వ ఇన్నింగ్స్‌లో, 11000 ప‌రుగుల‌ను 222వ ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు. ఈ రికార్డులే కాదు.. విరాట్ జోరు చూస్తుంటే వ‌న్డేల్లో స‌చిన్ సెంచ‌రీల రికార్డు కూడా మ‌రుగున ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. వ‌న్డేల్లో మాస్ట‌ర్ 49 సెంచ‌రీలు చేశాడు. ప్ర‌స్తుతం కోహ్లి 43 సెంచ‌రీల‌తో అత‌నికి చాలా ద‌గ్గ‌ర్లోనే ఉన్నాడు. నిజానికి అత‌డు త‌న మునుప‌టి స్పీడు క‌న‌బ‌ర‌చి ఉంటే.. ఇప్ప‌టికే మాస్ట‌ర్ రికార్డుకు అతి చేరువ‌గా వెళ్లేవాడు. కానీ వ‌న్డేల్లో చాలా కాలంగా కోహ్లి సెంచ‌రీ చేయ‌లేదు. అత‌ను చివ‌రిసారి 15 నెల‌ల కింద‌ట సెంచరీ చేశాడు. అప్ప‌టి నుంచీ 44వ సెంచ‌రీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో వ‌న్డేలో దానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చినా.. 89 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. తాజాగా మూడో వ‌న్డేలోనూ మాంచి జోరు మీద క‌నిపించినా.. 63 ప‌రుగుల ద‌గ్గ‌ర వెనుదిరిగాడు. అయితే ప్ర‌స్తుతం 32 ఏళ్లు మాత్ర‌మే ఉన్న విరాట్‌కు ఇంకా చాలా ఏళ్ల కెరీర్ మిగిలే ఉంది. దీంతో వ‌న్డేల్లోనే కాదు.. ఓవ‌రాల్‌గా అంత‌ర్జాతీయ క్రికెట్ మొత్తంలో మాస్ట‌ర్ సాధించిన 100 సెంచ‌రీల రికార్డు కూడా బ‌ద్ధ‌లైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.