ఆదివారం 12 జూలై 2020
Sports - Apr 18, 2020 , 21:02:27

ఆ బ్యాట్ అక్ర‌మ్‌ద‌ట‌!

ఆ బ్యాట్ అక్ర‌మ్‌ద‌ట‌!

ఆ బ్యాట్ అక్ర‌మ్‌ద‌ట‌! 

న్యూఢిల్లీ: స‌రిగ్గా 34 ఏండ్ల క్రితం ఇదే రోజున‌(ఏప్రిల్ 18) భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య మరుపురాని మ్యాచ్ చోటు చేసుకుంది. అవును షార్జా క్రికెట్ స్టేడియం వేదిక‌గా దాయాదుల పోరు నేటికి  అభిమానుల మదిలో మెదులుతూనే ఉన్న‌ది.  విజ‌య‌మో, వీర స్వ‌ర్గ‌మో అన్న రీతిలో ఆఖ‌రి వ‌ర‌కు నువ్వానేనా అన్న రీతిలో జ‌రిగిన మ్యాచ్‌లో పాక్ ఉత్కంఠ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య అచిర‌కాలం గుర్తుండిపోయే మ్యాచ్ అది. 

అవును ఆస్ట్ర‌ల్ ఆసియా క‌ప్ ఫైన‌ల్లో భాగంగా భార‌త్‌, పాకిస్థాన్ జట్లు కొద‌మ సింహాల్లా త‌ల‌ప‌డ్డాయి. నిర్దేశిత ల‌క్ష్య‌ఛేదన‌కు బ‌రిలోకి దిగిన పాక్‌..విజ‌యానికి ఆఖ‌రి బంతికి నాలుగు ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఇక్క‌డే నాట‌కీయ ప‌రిణామం చోటు చేసుకుంది. క్రీజులో ఉన్న‌ది విధ్వంస‌క వీరుడు జావెద్ మియాందాద్‌..బౌల‌రేమో చేత‌న్ శ‌ర్మ‌. స్టేడియంలోని ప్రేక్ష‌కులంతా ఊపిరి బిగ‌ప‌ట్టుకుని కూర్చున్నారు. శ‌ర్మ వేసిన బంతిని మియాందాద్ దంచి కొడితే నేరుగా పోయి స్టాండ్‌లో ప‌డింది. అంతే..భార‌త క్రికెట‌ర్లంతా ఒక్క‌సారిగా నిశ్చేష్టులు కాగా, పాక్ సంబురాల్లో మునిగి పోయింది. సుదీర్ఘ క్రికెట్ చ‌రిత్ర‌లో మియాందాద్ కొట్టిన సిక్స్ మ‌రుపురానిదిగా నిలిచిపోయింది. అయితే ఇక్కడ ఆస‌క్తిక‌ర విష‌య‌మేంటంటే..సిక్స్ కొట్టిన బ్యాట్ త‌న‌దేనంటూ వ‌సీం అక్ర‌మ్ తాజాగా వెల్ల‌డించాడు. చ‌రిత్రాత్మ‌క మ్యాచ్‌లో భాగ‌మైన తాను ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా శ‌నివారం అభిమానుల‌తో పంచుకున్నాడు. ‘ మియాందాద్ కొట్టిన సిక్స్ క‌ల‌కాలం గుర్తుండిపోతుంది. షార్జాలో భార‌త్‌పై సిక్స్‌తో  మేము గెలిచిన తీరు మాట‌ల‌కంద‌నిది. క్రికెట్ అత్యుత్త‌మ సంద‌ర్బాల్లో ఒక‌టిగా నిలిచిపోయింది. ఆ వీడియో ఎప్పుడు చూసినా..మియాందాద్ ఎంత గొప్ప బ్యాట్స్‌మ‌న్ అన్న‌ది అర్థ‌మ‌వుతుంది. చ‌రిత్ర‌కు తార్కాణంగా నిలిచిన ఆ బ్యాట్ నాదే ’ అని అక్ర‌మ్ రాసుకొచ్చాడు. 


logo