బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 28, 2020 , 15:56:15

బెంగళూరుతో మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ దూరం!

బెంగళూరుతో మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ దూరం!

దుబాయ్: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొడ కండరాల గాయం నుంచి ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా రోహిత్‌ ముంబై టీమ్‌తో కలిసి నెట్‌సెషన్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు.  ఐతే పూర్తి ఫిట్‌నెస్‌  సాధించకపోవడంతో బుధవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ బరిలో దిగలేదు.   రోహిత్‌ గాయం తీవ్రత, ఫిట్‌నెస్‌ గురించి ఇప్పటి వరకు ముంబై ఫ్రాంఛైజీ, బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

'ప్రస్తుతం రోహిత్‌ సాధన చేస్తూనే ఉన్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌ మరుసటి రోజు విశ్రాంతి కాబట్టి ఎవరూ ప్రాక్టీస్‌ చేయలేదు. ముంబై టీమ్‌ నెట్‌ సెషన్‌ ఉన్నప్పుడు మాత్రం అతడు   కాలుపై ఒత్తిడి పడకుండా బ్యాటింగ్‌ సాధన చేస్తున్నాడు. గత మ్యాచ్‌ ఆరంభానికి ముందు మైదానంలో త్రోడౌన్‌లు కూడా ప్రాక్టీస్‌ చేశాడు. పూర్తి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించేందుకు  నిబద్ధతతో ప్రయత్నిస్తున్నాడని' ఈ పరిణామాలతో సంబంధం ఉన్న వర్గాలు ధ్రువీకరించాయి.