e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 23, 2021
Home స్పోర్ట్స్ మెస్సీ మురిసె.. కోపా అమెరికా టైటిల్‌ అర్జెంటీనా కైవసం

మెస్సీ మురిసె.. కోపా అమెరికా టైటిల్‌ అర్జెంటీనా కైవసం

మెస్సీ మురిసె.. కోపా అమెరికా టైటిల్‌ అర్జెంటీనా కైవసం
  • మెస్సీ కెరీర్‌లో తొలి అంతర్జాతీయ మేజర్‌ టైటిల్‌
  • ఫైనల్‌లో బ్రెజిల్‌పై 1-0తో గెలుపు

పదిహేనేండ్ల తండ్లాటకు ముగింపు పలుకుతూ.. సాకార్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ అర్జెంటీనాకు తొలి మేజర్‌ టైటిల్‌ అందించాడు. లీగ్‌ల్లో వందలాది విజయాలందుకున్న మెస్సీ.. జాతీయ జట్టుకు తొలి ట్రోఫీని కట్టబెట్టాక సంతోషంతో కన్నీటి పర్యంతమయ్యాడు. కోపా అమెరికా కప్‌ ఫైనల్‌లో బ్రెజిల్‌ను చిత్తుచేసిన అర్జెంటీనా 28 ఏండ్ల తర్వాత మేజర్‌ టైటిల్‌ గెలిచి.. గతేడాది కన్నుమూసిన సాకార్‌ దిగ్గజం మారడోనాకు ఘన నివాళి అర్పించింది.

రియో డి జనెరో: కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ చిరకాల ఆకాంక్ష.. అర్జెంటీనా 28 సంవత్సరాల నిరీక్షణకు ఒకేసారి తెరపడింది. తన 15 ఏండ్ల కెరీర్‌లో జాతీయ జట్టుకు తొలి మేజర్‌ టైటిల్‌ అందించి మెస్సీ మురిసిపోయాడు. ఆదివారం ఇక్కడి మరకాన స్టేడియంలో జరిగిన కోపా అమెరికా ఫైనల్‌లో అర్జెంటీనా 1-0తో బ్రెజిల్‌ను చిత్తుచేసి 1993 తర్వాత తొలి మేజర్‌ టైటిల్‌ దక్కించుకుంది. మొత్తంగా దక్షిణ అమెరికా దేశాల ఫుట్‌బాల్‌ సమరంలో అర్జెంటీనా 15వ సారి విజేతగా నిలిచింది. మ్యాచ్‌ 22వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్‌ రోడ్రిగో డీ పౌల్‌ అందించిన లాంగ్‌పాస్‌ను అంజెల్‌ డీ మారియా అద్భుతంగా వినియోగించుకున్నాడు. బ్రెజిల్‌ గోల్‌ కీపర్‌ ఎడెర్‌సన్‌ను బోల్తా కొట్టించి బంతిని గోల్‌ పోస్టులోకి పంపాడు. మూడేండ్ల తర్వాత అర్జెంటీనా తరఫున రోడ్రిగో గోల్‌ చేసి.. జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత బ్రెజిల్‌ స్టార్‌ నేమార్‌ను అర్జెంటీనా విజయవంతంగా అడ్డుకోగలిగింది. ఈ ఏడాది టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన అర్జెంటీనా కెప్టెన్‌ మెస్సీ 88వ నిమిషంలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. అయినా చివరి వరకు అతడి సేన విజయవంతంగా డిఫెన్స్‌ చేయగలిగింది. మ్యాచ్‌ సమయం ముగిశాక రెఫరీ విజిల్‌ వేసిన వెంటనే మెస్సీ మైదానంలో ముఖంపై చేతులు పెట్టుకొని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాసేపటికి కుటుంబ సభ్యులకు వీడియోకాల్‌ చేసి సంతోషాన్ని పంచుకున్నాడు.

- Advertisement -

మెస్సీ, నేమార్‌ బెస్ట్‌ ప్లేయర్స్‌
ఈ ఏడాది కోపా అమెరికా టోర్నీ బెస్ట్‌ ప్లేయర్స్‌ అవార్డు మెస్సీ, బ్రెజిల్‌ స్టార్‌ నేమార్‌ ఇద్దరికీ దక్కింది. ఫైనల్‌ ప్రారంభానికి ముందే ఈ విషయాన్ని ప్రకటించడం విశేషం. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్‌తో టోర్నీ టాప్‌స్కోరర్‌గా ఉన్న మెస్సీ.. మరో ఐదు గోల్స్‌లోనూ కీలక పాత్ర పోషించాడు. అలాగే నేమార్‌ ఐదు మ్యాచ్‌ల్లో రెండు గోల్స్‌తో పాటు మూడు అసిస్ట్స్‌ సాధించాడు. దీంతో వీరిలో ఒకరిని ఎంపిక చేయడం అసాధ్యమని ప్రకటించిన నిర్వాహకులు.. ఇద్దరికీ అవార్డు ఇచ్చారు.

నేమార్‌ను హత్తుకొని..
ఓ వైపు తన జట్టు సభ్యులు జోరుగా సంబరాలు చేసుకుంటుంటే.. ఓటమితో వేదన చెందుతున్న బ్రెజిల్‌ స్టార్‌ నేమార్‌ను లియోనెల్‌ మెస్సీ ఓదార్చాడు. మైదానంలోనే అతడిని కౌగిలించుకొని సముదాయించాడు. ఈ ఫైనల్‌ మెస్సీ, నేమార్‌ మధ్య యుద్ధంలా భావించినా.. మ్యాచ్‌ అనంతరం ఇద్దరూ హత్తుకోవడం వారి మధ్య అనుబంధాన్ని మరోసారి బయటపెట్టింది.

ఎన్నో ఎదురుదెబ్బల తర్వాత..
కోపా అమెరికా ఫైనల్స్‌లో నాలుగుసార్లు ఓటమి.. టోర్నీలో చాలాసార్లు త్వరగానే వైదొలగడం.. దీంతో వైరాగ్యం చెంది ఓసారి జాతీయ జట్టుకు రిటైర్మెంట్‌ ప్రకటించడం.. ఇలా ఎన్నో ఎదురుదెబ్బలు తగిలిన అనంతరం కెప్టెన్‌ మెస్సీ ఎట్టకేలకు సంతోషంలో మునిగితేలాడు. కెరీర్‌లో అర్జెంటీనాకు తొలి మేజర్‌ టైటిల్‌ అందించి మురిసిపోయాడు. అలాగే అర్జెంటీనా తరఫున అత్యధిక మ్యాచ్‌లు (151) ఆడిన ఆటగాడిగానూ రికార్డు బద్దలుకొట్టాడు. అర్జెంటీనా జూనియర్‌ టీమ్‌కు అండర్‌-20 ప్రపంచకప్‌ అందించాక.. 2006లో మెస్సీ సీనియర్‌ జట్టులో అడుగుపెట్టాడు. ఆ తర్వాతి ఏడాదే కోపా అమెరికా ఫైనల్‌లో అర్జెంటీనా.. బ్రెజిల్‌ చేతిలో ఓడింది. 2014 ప్రపంచకప్‌ ఫైనల్‌లోనూ జర్మనీ చేతిలో పరాజయం పాలైంది. బార్సిలోనా క్లబ్‌కు ఎన్నో టైటిళ్లు అందించిన మెస్సీ.. అర్జెంటీనా తరపున అత్యు త్తమ ప్రదర్శన చేయలేదన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 2015, 2016 కోపా అమెరికా ఫైనల్స్‌లో రెండుసార్లు చిలీ చేతిలోనే పెనాల్టీలతో ఓటమి ఎదురవడంతో.. మెస్సీ జాతీయ జట్టుకు వీడ్కోలు పలికాడు. 2018 ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ కోసం రిటైర్మెంట్‌ను పక్కనపెట్టి అర్జెంటీనా తరఫున మళ్లీ బరిలోకి దిగాడు. ఇప్పుడు 34 ఏండ్ల వయస్సులో కోపా టైటిల్‌ను ముద్దాడాడు. జీవితంలో అర్జెంటీనాకు టైటిల్‌ అందించలేనేమోనన్న అసంతృప్తి నుంచి బయటపడి.. ఫైనల్‌లో గెలిచాక తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. గతేడాది దివికేగిన అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనాకు ఘనమైన నివాళి అర్పించాడు.

సేమ్‌ టు సేమ్‌
రెండు వేర్వేరు క్రీడల్లో దిగ్గజ ఆటగాైళ్లెన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, లియోనెల్‌ మెస్సీకి ఒక సారుప్యత ఉంది. దైపాక్షిక సిరీస్‌ల్లో జట్టుకు లెక్కకు మిక్కిలి విజయాలు అందించిన మాస్టర్‌.. వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు చాన్నాళ్లు ఎదురుచూస్తే.. లీగ్‌ల్లో ఒంటిచెత్తో అద్భుత విజయాలు అందించే మెస్సీ కూడా జాతీయ జట్టు తరఫున మేజర్‌ టైటిల్‌ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూశాడు. 1983లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు.. 28 ఏండ్ల తర్వాత తిరిగి ట్రోఫీ చేజిక్కించుకుంటే.. అర్జెంటీనా కూడా 28 ఏండ్ల తర్వాతే కోపా అమెరికా కప్‌ను ముద్దాడింది. ఆ అద్వితీయ క్షణాన మాస్టర్‌ను సహచర ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకొని తిరిగితే.. మెస్సీని తోటి ఆటగాళ్లు గాల్లోకి ఎగురవేస్తూ సంబురాలు జరుపుకున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల జెర్సీ నంబర్‌ కూడా పదే కావడం విశేషం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మెస్సీ మురిసె.. కోపా అమెరికా టైటిల్‌ అర్జెంటీనా కైవసం
మెస్సీ మురిసె.. కోపా అమెరికా టైటిల్‌ అర్జెంటీనా కైవసం
మెస్సీ మురిసె.. కోపా అమెరికా టైటిల్‌ అర్జెంటీనా కైవసం

ట్రెండింగ్‌

Advertisement