మంగళవారం 04 ఆగస్టు 2020
Sports - Jul 08, 2020 , 10:21:40

మెల్‌బోర్న్‌లో మళ్లీ లాక్‌డౌన్‌..టీ20 వరల్డ్‌ కప్‌ లేనట్టే!

మెల్‌బోర్న్‌లో మళ్లీ  లాక్‌డౌన్‌..టీ20 వరల్డ్‌ కప్‌ లేనట్టే!

సిడ్నీ:  కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతుండటంతో ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద నగరం మెల్‌బోర్న్‌లో ఆరు వారాల పాటు మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. దీంతో  షెడ్యూల్‌ ప్రకారం ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది  జరగాల్సిన  టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ వీలైనంత త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.  ప్రస్తుత పరిస్థితుల్లో తమ దేశంలో   ప్రపంచకప్‌ నిర్వహణ సాధ్యం కాదని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇప్పటికే స్పష్టం చేసింది.  దీనిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి  ఉన్నందున ఆసీస్‌తో పాటు భారత్‌కు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.  ప్రపంచకప్‌ రద్దైతే అదే సమయంలో  ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 

మెల్‌బోర్న్‌ లాక్‌డౌన్‌తో ప్రపంచకప్‌ వాయిదా లేదా రద్దు ప్రకటన మరికొన్ని రోజుల్లో రావడం దాదాపు ఖాయమైంది. మూడు రోజుల్లో టీ20 వరల్డ్‌కప్‌పై తుది నిర్ణయం వస్తుందని ఐసీసీకి చెందిన ఓ అధికారి తెలిపారు.   సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం సన్నద్ధమవ్వాలంటూ ఆసీస్‌ ఆటగాళ్లకు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నుంచి  ఆదేశాలు వెళ్లాయి.  ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రేలియా  మీడియా తెలిపింది.  లాజిస్టిక్‌ సమస్యల కారణంగా అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు  జరగాల్సిన  వరల్డ్‌కప్‌ను వాయిదా వేసేందుకు ఐసీసీ సిద్ధమైందని త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆస్ట్రేలియా పత్రిక పేర్కొన్న విషయం తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo