గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 17, 2020 , 02:22:03

పొట్టకూటి కోసం

పొట్టకూటి కోసం

డెలివరీ బాయ్స్‌గా మారిన ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌, క్రికెటర్‌

ఒకరు టీ20 ప్రపంచకప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సిన క్రికెటర్‌ అయితే.. మరొకరు 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన ఫెన్సర్‌. వీరిద్దరి జీవితాలను తలకిందులు చేసిన కొవిడ్‌-19.. పొట్టకూటి కోసం డెలివరీ బాయ్స్‌గా మార్చింది. విధి విచిత్రమైన ఆటలు ఆడినా..  నవ్వుతూ ముందుకు సాగాల్సిందే అని ఒకరు అంటుంటే.. డబ్బు సంపాదించేందుకు ఏదో ఒక పని చేసుకోవడంలో తప్పులేదని మరొకరు అంటున్నారు. వారి ఆవేదనకు అక్షర రూపం ఇస్తే.. 

ఆ తృప్తే వేరు..

వెనిజులాకు చెందిన రూబెన్‌ లిమార్డో లండన్‌ (2012) ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గాడు. కత్తిసాము చేయడంలో చాంపియన్‌ అయిన లిమార్డో ఫెన్సింగ్‌లో పసిడి నెగ్గి దేశానికి మంచి పేరు తెచ్చాడు. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తండ్రి అయిన లిమార్డో వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్న విశ్వక్రీడల్లో పాల్గొనాలనుకుంటున్నాడు. మెరుగైన శిక్షణ కోసం పోలాండ్‌కు వలస వచ్చిన రూబెన్‌.. మహమ్మారి విజృంభణతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తిరిగి స్వదేశానికి వెళ్దామంటే అక్కడ కూడా పరిస్థితులు బాగా లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కుటుంబ పోషణ కోసం పార్ట్‌ టైమ్‌ జాబ్‌గా డెలివరీ బాయ్‌ అవతారమెత్తాడు. ‘నా కుటుంబానికి తిండిపెట్టడం కోసం ఈ పని ఎంచుకున్నా. దీనికి నేను సిగ్గుపడటం లేదు. గర్వంగా భావిస్తున్నా. కష్టపడి సంపాదించి తినడంలో ఉన్న తృప్తే వేరు. నాతో పాటు చాలా మంది అథ్లెట్లు ప్రస్తుతం ఇదే బాటలో ఉన్నారు’అని రూబెన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. 

క్రికెట్‌ను పక్కనపెట్టి..

పాల్‌ వాన్‌ మీకెరెన్‌ నెదర్లాండ్‌ జాతీయ జట్టులో ప్రధాన పేసర్‌. కెరీర్‌లో అతడు 39 టీ20లు, 5 వన్డేలు ఆడాడు. పొట్టి ఫార్మాట్‌లో ప్రభావవంతమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న మీకెరెన్‌.. అంతా అనుకున్నట్లు జరిగితే ఆసీస్‌ వేదికగా జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ ఆడేవాడు. కానీ విశ్వవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో మెగాటోర్నీ వాయిదా పడింది. ‘కరోనా లేకపోతే మెల్‌బోర్న్‌ మైదానంలో ఈ రోజు (ఆదివారం) పొట్టి ప్రపంచకప్‌లో ఫైనల్‌ పోరు చూసేవాళ్లం’అని ఈఎస్‌పీఎస్‌ క్రికెఇన్ఫో చేసిన ట్వీట్‌కు మీకెరన్‌ స్పందిస్తూ.. ‘విధి విచిత్రమైంది. ఈ రోజు క్రికెట్‌ ఆడుతూ ఉండాల్సింది. కానీ, ప్రస్తుతం పూట గడవడం కోసం ఉబర్‌ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నా. జీవితాలు అతలాకుతలం అయ్యాయి. అయినా నవ్వుతూ ముందుకు సాగిపోవాలి’అని రీట్వీట్‌ చేశాడు. భావోద్వేగాలతో కూడిన ఈ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గడ్డుకాలం పూర్తికాగానే తిరిగి క్రికెట్‌ ఆడుతావని నెటిజన్లు అతడికి ధైర్యం చెబుతున్నారు.