లండన్: క్రికెట్లో లింగభేదానికి తావు లేకుండా చేసేందుకంటూ మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి క్రికెట్లో బ్యాట్స్మన్ అంటూ కేవలం పురుషులకు మాత్రమే వర్తించే పదాన్ని తొలగించే బ్యాటర్ అని పురుషులు, మహిళలకు వర్తించే పదం చేరుస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందనీ తెలిపింది. క్లబ్ లాస్ సబ్ కమిటీ గతంలో ఈ ప్రతిపాదన చేయగా.. ఎంసీసీ కమిటీ దానిని ఆమోదించింది. లింగభేదం లేని పదాన్ని ఉపయోగించడం వల్ల క్రికెట్ అందరి గేమ్ అని మరోసారి నిరూపించినట్లు ఎంసీసీ విశ్వసిస్తోందని క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దిశగా ఎంసీసీ ఇప్పటికే చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
మహిళల క్రికెట్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పురోగతి సాధించిందని, ఇలాంటి సమయంలో లింగభేదం లేని పదాలు వాడటం వల్ల మరింత మంది బాలికలు, మహిళలు గేమ్ పట్ల ఆకర్షితులవుతారని ఎంసీసీ అభిప్రాయపడింది. నిజానికి బ్యాటర్ అనే పదాన్ని ఇప్పటికే చాలా మంది వాడుతున్నారు. ఇప్పటికే బౌలర్లు, ఫీల్డర్లు అని లింగభేదం లేని పదాలు వాడుతున్నా… బ్యాటింగ్ విషయంలోనే బ్యాట్స్మన్ అన్న పదాన్ని వాడుతూ వస్తున్నారు. తాజాగా ఎంసీసీ నిర్ణయంతో ఇక బ్యాటింగ్ విషయంలోనూ బ్యాటర్ పదం రానుంది.