శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sports - Sep 27, 2020 , 21:12:54

మయాంక్‌ సెంచరీ...పంజాబ్‌ పరుగుల వరద

మయాంక్‌ సెంచరీ...పంజాబ్‌ పరుగుల వరద

షార్జా: ఐపీఎల్‌-2020 సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ అదరగొడుతున్నారు.   ఓపెనర్‌  మయాంక్‌ అగర్వాల్‌(106: 50 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) అద్భుత శతకంతో మెరువగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(69:54 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌) అర్ధశతకంతో రాణించడంతో పంజాబ్‌ రెండు వికెట్లకు 223 పరుగులు చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో  ఓపెనర్లు   రికార్డు 183 పరుగుల   ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.   రాజస్థాన్‌ బౌలర్లలో అంకిత్‌ రాజ్‌పుత్‌, టామ్‌ కరన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఓపెనర్లను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలమయ్యారు. 


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన  పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను  ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌‌,  మయాంక్‌ అగర్వాల్‌  కదం తొక్కించారు.  మొదటి ఓవర్‌ నుంచే ఈ జోడీ  బౌండరీల వరద పారించడంతో స్కోరు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది.  పవర్‌ప్లేలో  2020  సీజన్‌లో అత్యధిక స్కోరు (60/0) సాధించిన జట్టుగా  పంజాబ్‌ నిలిచింది. రాహుల్‌ తెవాటియా వేసిన 8వ ఓవర్లో మయాంక్‌  వరుసగా రెండు సిక్సర్లు, ఫోర్‌ బాది 19 రన్స్‌ రాబట్టాడు. మయాంక్‌ వీరవిహారం చేస్తుండటంతో పంజాబ్‌ 9 ఓవర్లలోనే 100 పరుగులు మార్క్‌ దాటింది. ఈ క్రమంలో సీజన్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని ఈ జోడీ నమోదు చేసింది.   ఏ దశలోనూ ఈ జోడీ బ్యాటింగ్‌ జోరు తగ్గలేదు. 

రాజస్థాన్‌ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా భాగస్వామ్యాన్ని విడదీయలేకపోయారు. జట్టు  మెరుగైన స్కోరు  దాటగానే  వీరిద్దరూ మరింత రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశారు. రాహుల్‌, అగర్వాల్‌   చక్కని షాట్లతో అలరించారు. వేగంగా ఆడే క్రమంలో   టామ్‌ కరన్‌ వేసిన 17వ ఓవర్లో  శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి అగర్వాల్‌ వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్‌(13 నాటౌట్‌), పూరన్‌(25నాటౌట్‌) బౌండరీలే లక్ష్యంగా విజృంభించి స్కోరు 220 దాటించారు.   బౌండరీ చిన్నగా ఉండటంతో అలవోకగా సిక్సర్లు బాదేశారు. ఓపెనర్‌ అగర్వాల్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రేక్షకులకు మజా అందించాడు. ఓపెనర్లు సిక్సర్లు, బౌండరీలతో పరుగుల వరద కురిపిస్తుంటే  రాజస్థాన్‌ బౌలర్లు నిశ్చేష్టులైపోయారు.