బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 26, 2020 , 00:37:07

జోరు సాగాలి..

జోరు సాగాలి..

తొలి టీ20 చూసిన వారెవరైనా.. కోహ్లీ సేన న్యూజిలాండ్‌లోఆడుతున్నదని భావించి ఉండరు. సొంతగడ్డపైలాగే టీమ్‌ఇండియా ప్రత్యర్థితో చెడుగుడాడుకుంటుంటే.. ఆక్లాండ్‌ పిచ్‌ కూడా చిన్నస్వామిని తలపించింది. రెండొందల పైచిలుకు లక్ష్యం కండ్ల ముందు కనిపిస్తున్నా..ఏ మాత్రం తడబడకుండాలెక్క ప్రకారం ముందుకు సాగిన భారత్‌.. ఛేదనలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సార్లు 200+స్కోరును ఛేజ్‌ చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కడంతో పాటు సుదీర్ఘ పర్యటనలో ఘనంగా బోణీ కొట్టింది. ఇక ఇదే దూకుడు కొనసాగిస్తూ.. మరోసారి ఆక్లాండ్‌లో అదరగొట్టాలని కోహ్లీ అండ్‌ కో రెడీ అవుతుంటే.. సిరీస్‌ సమం చేయాలని కివీస్‌ కృతనిశ్చయంతో ఉంది. మరి ఎవరిది పైచేయి అవుతుందో ఈడెన్‌ పార్క్‌ నిర్ణయించనుంది.

  • మధ్యాహ్నం12.20 నుంచిస్టార్‌ స్పోర్ట్స్‌లో..
  • నేడు భారత్‌, న్యూజిలాండ్‌ రెండో టీ20.. దూకుడుమీదున్న టీమ్‌ఇండియా

రాహుల్‌ రాణించాడు..

విరాట్‌ విజృంభించాడు.. 

అయ్యర్‌ అదరగొట్టాడు.. 

బుమ్రా బెంబేలెత్తించాడు..

ఆక్లాండ్‌: ఒక్కరోజు విరామంతో టీమ్‌ఇండియా మరో పోరాటానికి సిద్ధమైంది. సుదీర్ఘ పర్యటనలో భాగంగా తొలి టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన కోహ్లీ సేన.. ఆదివారం ఈడెన్‌ పార్క్‌లోనే కివీస్‌ను ఢీకొననుంది. జోరు కొనసాగించాలని భారత్‌ భావిస్తుంటే.. అడ్డుకట్ట వేసేందుకు కివీస్‌ కసరత్తులు చేస్తున్నది. ‘టీమ్‌ఇండియాను నిలువరించాలంటే సమిష్టిగా సత్తాచాటాల్సిందే’అని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ అంటుంటే.. విజయాల పరంపరను కొనసాగించాలని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ ఆశిస్తున్నది. ఈ ఏడాది ఆఖర్లో పొట్టి ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో.. లోటుపాట్లు సరిదిద్దుకునేందుకు టీమ్‌ఇండియాకు ఇది చక్కటి అవకాశం. అయితే, విన్నింగ్‌ కాంబినేషన్‌ను మార్చడానికి పెద్దగా ఇష్టపడని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. అదే జట్టుతో బరిలో దిగుతాడా.. లేక మార్పులకు నడుం బిగిస్తాడా చూడాలి.


మార్పుల్లేకుండానే..!

అంతర్జాతీయ టీ20ల్లో నాలుగుసార్లు రెండొందల పైచిలుకు టార్గెట్‌ ఛేజ్‌ చేసి రికార్డు సృష్టించిన టీమ్‌ఇండియా.. అదే దూకుడు కొనసాగించాలని చూస్తున్నది. తొలి మ్యాచ్‌లో టాస్‌ నెగ్గడం కూడా భారత్‌కు కలిసొచ్చింది. మరోసారి కోహ్లీని అదృష్టం వరిస్తే.. టీమ్‌ఇండియాకు తిరుగుండదు. ఒకవేళ మొదట బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే మాత్రం భారీ స్కోరు చేయాల్సిందే. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు ఆశించలేం. మొదటి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయిన రోహిత్‌ శర్మ సత్తాచాటాలని జట్టు యాజమాన్యం కోరుకుంటున్నది. హిట్‌మ్యాన్‌ నిలదొక్కుకుంటే భారీ స్కోరు ఖాయమే. రాహుల్‌, విరాట్‌, అయ్యర్‌ మంచి టచ్‌లో ఉన్నారు. 


జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడుతున్న రాహుల్‌.. అటు బ్యాటింగ్‌లో ఇటు కీపింగ్‌లో సత్తాచాటుతుండటం టీమ్‌ఇండియాకు భారీ ఉపశమనాన్ని ఇస్తున్నది. కెప్టెన్‌, కోచ్‌ ప్రణాళికలకు అనుగుణంగానే తుది జట్టు ఎంపిక ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పేర్కొన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనూ పంత్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. మిడిలార్డర్‌లో అయ్యర్‌ ఆట ఆకట్టుకున్నది. తీవ్ర ఒత్తిడిలోనూ ఏమాత్రం బెదరకుండా.. భారీ షాట్లతో విరుచుకుపడిన ఈ యువ ఆటగాడు.. ఇక నాలుగో స్థానాన్ని తన పేరిట రాసుకున్నట్లే. మిడిలార్డర్‌లో మనీశ్‌ పాండే, దూబే కూడా బాధ్యతలు పంచుకోవాల్సిన అవసరముంది. దూబేతో పూర్తి కోటా బౌలింగ్‌ చేయించి అదనపు స్పిన్నర్‌ను తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం.


logo
>>>>>>