సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 07, 2020 , 03:18:00

‘షాన్‌' మసూద్‌

‘షాన్‌' మసూద్‌

  • పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ 326 ఆలౌట్‌.. ఇంగ్లండ్‌ 92/4 

మాంచెస్టర్‌: ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ షాన్‌ మసూద్‌ (156; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ శతకంతో రెచ్చిపోవడంతో.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్‌ మంచి స్కోరు చేసింది. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా.. మసూద్‌ ఒంటరి పోరాటం చేయడంతో పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది. షాబాద్‌ ఖాన్‌ (45) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రాడ్‌, ఆర్చర్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ తొలిరోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.  బర్న్స్‌ (4), సిబ్లే (8), స్టోక్స్‌ (0), రూట్‌ (14) విఫలమయ్యారు. పాక్‌ బౌలర్లలో మహమ్మద్‌ అబ్బాస్‌ 2, షాహీన్‌ షా అఫ్రిది, యాసిర్‌ షా చెరో వికెట్‌ పడగొట్టారు. 

అతనొక్కడే..

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 139/2తో గురువారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్థాన్‌ అదే స్కోరు వద్ద బాబర్‌ ఆజమ్‌ (69) వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత అసద్‌ షఫీఖ్‌ (7), రిజ్వాన్‌ (9) ఎక్కువసేపు నిలువలేకపోయారు. ఈ దశలో షాదాబ్‌ ఖాన్‌తో కలిసి షాన్‌ మసూద్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ 6వ వికెట్‌కు 105 పరుగులు జోడించారు. షాదాబ్‌ వెనుదిరిగిన ఒంటరి పోరాటంతో జట్టు స్కోరును 300 దాటించిన మసూద్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత పాక్‌ ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.

సంక్షిప్త స్కోర్లు

పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 326 (మసూద్‌ 156, బాబర్‌ 69; బ్రాడ్‌ 3/54, ఆర్చర్‌ 3/59), ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 92/4 (పోప్‌ 46 బ్యాటింగ్‌; అబ్బాస్‌ 2/24).

తాజావార్తలు


logo