e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home స్పోర్ట్స్ అయ్యో మేరీ..!

అయ్యో మేరీ..!

  • టోక్యో ఒలింపిక్స్‌
  • క్వార్టర్స్‌లో ఓడిన బాక్సింగ్‌ దిగ్గజం
  • బ్యాడ్మింటన్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో సింధు
  • పురుషుల హాకీ జట్టు జయభేరి

కోటి ఆశలతో టోక్యోలో అడుగుపెట్టిన భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ క్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. నాలుగు పదులకు దగ్గరవుతున్నా తనలో సత్తా తగ్గలేదంటూ పతకంపై ఆశలు రేపిన మేరీ.. కీలక పోరులో ఆధిపత్యం కనబర్చినా ఫలితం మాత్రం ఆమెకు వ్యతిరేకంగా వచ్చింది! బౌట్‌ అనంతరం జడ్జీల నిర్ణయం విస్మయ పరిచిందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు అభిప్రాయపడితే.. నాకే ఎందుకిలా జరిగిందని మేరీ నిర్వేదం వ్యక్తి చేసింది! బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, ఆర్చరీలో అతాను దాస్‌ వరుస విజయాలతో క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాను మట్టకరిపించిన పురుషుల హాకీ జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది.

టోక్యో: ప్రతిష్ఠాత్మక విశ్వక్రీడల్లో ఆరోరోజు దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ ఇంటిదారి పట్టగా.. ఇతర విభాగాల్లో మన అథ్లెట్లు అదరగొట్టారు. పురుషుల హాకీలో మన్‌ప్రీత్‌సింగ్‌ సేన 3-1తో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాను చిత్తు చేస్తే.. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో అతానుదాస్‌.. కొరియా గండాన్ని దాటి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు అలవోక గెలుపుతో క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. గోల్ఫ్‌లో అనిర్బన్‌ లాహిరి చక్కటి ప్రదర్శన కనబర్చాడు. శుక్రవారం నుంచి అథ్లెటిక్స్‌కు తెర లేవనుండగా.. వంద మీటర్ల పరుగులో ద్యుతీచంద్‌ తొలి హీట్‌లో పాల్గొననుంది.

- Advertisement -

ఇదేం నిర్ణయం?
గెలిచినా.. ఓడినట్టు ప్రకటిస్తారా..
ఐవోసీ టాస్క్‌ఫోర్స్‌పై మేరీకోమ్‌ ఆగ్రహం

టోక్యో ఒలింపిక్స్‌లో తనకు జరిగిన అన్యాయంపై భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ గళమెత్తింది. తాను బౌట్‌ గెలిచినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా.. ఓడినట్టు ప్రకటించిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) బాక్సింగ్‌ టాస్క్‌ఫోర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం చెత్త నిర్ణయమంటూ కన్నెర్రజేసింది. గురువారం జరిగిన మహిళల 51కేజీల ప్రిక్వార్టర్స్‌లో మేరీకోమ్‌.. ఇన్‌గ్రిట్‌ వాలెన్సియా (కొలంబియా)తో తలపడింది. తొలి రౌండ్‌ చేజార్చుకున్న మేరీ.. ఆ తర్వాత రెండు రౌండ్లు అద్భుతంగా ఆడింది. దీంతో అందరూ ఆమెదే విజయం అనుకున్నారు. అయితే 3-2తో ఇన్‌గ్రిట్‌ గెలిచినట్టు టాస్క్‌ఫోర్స్‌ నిర్ణయం ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మేరీ బౌట్‌ గెలిచినా.. టాస్క్‌ఫోర్స్‌ తప్పుడు నిర్ణయంతో కొంపమునిగింది. దీనిపై ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీ ఓ ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు.

అసలు టాస్క్‌ఫోర్స్‌కు ఏమైం ది? ఐవోసీకి ఏమైంది?. పోటీలు పారదర్శకంగా జరిగేందుకు నేను టాస్క్‌ఫోర్స్‌కు సహకరించా. కానీ వారేం చేశారు?. బౌట్‌ అయ్యాక నేను గెలిచానని అనుకున్నా. అయితే రిఫరీ నా ప్రత్యర్థి చేయి ఎత్తి గెలిచినట్టు ప్రకటించారు. నేను ఓడలేదని నాకు తెలుసు. కానీ నిరసన తెలిపేందుకు, రివ్యూ చేసుకునేందుకు అవకాశం లేకపోవడం బాధాకరం. ప్రపంచమంతా ఇది చూడాలి. వారు (టాస్క్‌ఫోర్స్‌) చేసింది సరికాదు. నేను రెండో రౌండ్‌లో ఏకపక్షంగా సత్తాచాటా. అయినా 3-2గా ప్రకటించారు. అసలు ఇది ఊహించని పరిణా మం. అవకాశం లేకపోయింది కానీ.. నేనైతే తప్పకుండా నిరసన వ్యక్తం చేయాలని అనుకున్నా’ అని మేరీకోమ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిరాశ
ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌, ఐదుసార్లు ఆసియా క్రీడల విజేత మాంగ్టే చుంగ్నీజాంగ్‌ మేరీ కోమ్‌ ఒలింపిక్‌ పోరాటం ముగిసింది. టోక్యోలో పసిడి పతకం పట్టడమే పరమావధిగా బరిలోకి దిగిన మేరీ.. గురువారం జరిగిన మహిళల 51 కేజీల క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లో 2-3తో ఇన్‌గ్రిట్‌ లొరేనా వలెన్సియా (కొలంబియా) చేతిలో ఓటమి పాలైంది. మూడు రౌండ్‌ల పోరులో తొలి రౌండ్‌ మినహా.. మిగిలిన రౌండ్‌లలో మేరీ ఆధిపత్యం ప్రదర్శించినా.. చివరకు న్యాయ నిర్ణేతలు వలెన్సియాను విజేతగా ప్రకటించారు. ఆరంభం నుంచి హోరాహోరీగా సాగిన పోరులో 38 ఏండ్ల మేరీ తన ట్రేడ్‌మార్క్‌ రైట్‌ హుక్స్‌తో సత్తాచాటగా.. వలెన్సియా కూడా దీటుగా బదులిచ్చింది. బౌట్‌ అనంతరం రిఫరీ వలెన్సియా చేయి పైకెత్తగానే రింగ్‌లోనే మేరీ కన్నీటి పర్యంతమైంది. లండన్‌ (2012) ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన మేరీ.. ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగినా ఆమె కల నెరవేరలేదు. ‘20 ఏండ్లుగా పోరాడుతున్నా. నేను ఇంకా పోరాడగలను. ఇప్పటికీ నాలో ఆ శక్తి ఉంది. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే. క్రమశిక్షణతో పాటు శిక్షణ కూడా చాలా ముఖ్యం’అని బౌట్‌ అనంతరం చెప్పిన మేరీ.. ఇప్పట్లో తాను ఆటకు వీడ్కోలు పలకననే సంకేతాలు ఇచ్చింది. మేరీపై విజయం సాధించిన వల్సెనియా.. కొలంబియా తరఫున ఒలింపిక్స్‌లో పతకం ఖాయం చేసుకున్న తొలి మహిళా బాక్సర్‌గా చరిత్రకెక్కింది.

ఒలింపిక్స్‌లో నువ్వు ఒక పాయింట్‌తో ఓడి పోయి ఉండొచ్చు.. కానీ మా వరకు నువ్వు చాంపియన్‌వి. ప్రపంచంలో ఏ ఇతర మహిళా బాక్సర్‌ సాధించలేని ఘనతలు నీ సొంతం. దేశం నిన్ను చూసి గర్విస్తున్నది. నువ్వు స్పష్టమైన విజేతవి. కానీ న్యాయమూర్తులకు సొంత లెక్కలున్నాయి.

కొరియాను దాటి..
టీమ్‌ ఈవెంట్‌లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత ఆర్చర్లు.. వ్యక్తిగత విభాగాల్లో సత్తాచాటుతున్నారు. మహిళల విభాగం నుంచి ప్రపంచ నంబర్‌వన్‌ దీపికా కుమారి ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌కు చేరగా.. పురుషుల విభాగంలో ఆమె భర్త అతాను దాస్‌ కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన కీలక పోరులో అతాను దాస్‌.. రెండుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ ఓహ్‌ జిన్‌ హైక్‌ (కొరియా)పై 6-5తో విజయం సాధించడం విశేషం.

షూటింగ్‌లో మోస్తరుగా..
25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మహిళల క్వాలిఫికేషన్‌ ఈవెంట్‌లో భారత్‌ నుంచి మనూబాకర్‌ 292 పాయింట్లతో 5వ స్థానంలో.. రాహి సర్ణోబత్‌ 287 పాయింట్లతో 25వ ప్లేస్‌లో నిలిచింది. ఈ విభాగంలో శుక్రవారం ర్యాపిడ్‌ రౌండ్‌ జరుగనుంది.

సజన్‌కు నిరాశ
పురుషుల 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో భారత స్విమ్మర్‌ సజన్‌ ప్రకాశ్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. సెమీస్‌ క్వాలిఫికేషన్‌ టైమింగ్‌ 51.74 సెకన్లు కాగా.. సజన్‌ 53.45 సెకన్లతో గమ్యాన్ని చేరాడు. గోల్ఫ్‌ వ్యక్తిగత స్ట్రోక్‌ ప్లే తొలి రౌండ్‌లో అనిర్బన్‌ 8వ స్థానంలో నిలువగా.. ఉదయన్‌ ఆఖరి స్థానంతో సరిపెట్టుకున్నాడు.

పంచ్‌ అదుర్స్‌

పురుషుల విభాగంలో భారత్‌ తరఫున హెవీ వెయిట్‌ (ప్లస్‌ 91 కేజీలు) ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన తొలి బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మొదటి రౌండ్‌లో 32 ఏండ్ల సతీశ్‌ 4-1తో రికార్డో బ్రౌన్‌ (జమైకా)పై విజయం సాధించాడు. కెరీర్‌ తొలినాళ్లలో కబడ్డీపై మక్కువ చూపిన సతీశ్‌ భారత ఆర్మీలో చేరాక కోచ్‌ల సాయంతో బాక్సింగ్‌ వైపు మళ్లాడు. క్వార్టర్స్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన బఖోదిర్‌ జలోవ్‌తో సతీశ్‌ తలపడనున్నాడు. ఈ బౌట్‌లో విజయం సాధిస్తే.. సతీశ్‌కు పతకం ఖాయం కానుంది.

క్వార్టర్స్‌లో భారత్‌
భారత పురుషుల హాకీ జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం పూల్‌-ఏ మ్యాచ్‌లో మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన 3-1తో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాపై విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి ఆకట్టుకున్న భారత ఆటగాళ్లు.. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా రెండు గోల్స్‌ కొట్టడం విశేషం. భారత్‌ తరఫున వరుణ్‌ (43వ నిమిషంలో), వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ (58వ ని), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (59వ ని) ఒక్కో గోల్‌ చేశారు. పూల్‌-ఏలో మూడు విజయాలు ఒక ఓటమితో రెండో స్థానంలో ఉన్న భారత్‌.. శుక్రవారం చివరి లీగ్‌ మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది.

సూపర్‌ సింధు..

టోక్యో విశ్వక్రీడల్లో పసిడి పతకం పట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగిన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు.. అంచనాలకు తగ్గట్లే క్వార్టర్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ చాంపియన్‌ సింధు 21-15, 21-13తో మియా బ్లిచ్‌ఫెల్డ్‌ (డెన్మార్క్‌)పై గెలుపొందింది. 41 నిమిషాల్లో ముగిసిన పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన సింధు.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్‌లలో మ్యాచ్‌ను ముగించింది. రియో (2016) ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన సింధు.. శుక్రవారం జరుగనున్న క్వార్టర్స్‌లో అకానె యమగుచి (జపాన్‌)తో తలపడనుంది. యమగుచితో ముఖాముఖిలో 11-7తో ముందంజలో ఉన్న సింధు.. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లోనూ ఆమెను చిత్తుచేసింది.

రోయింగ్‌లో 11వ స్థానం
రోయింగ్‌ పురుషుల లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌లో భారత జోడీ అర్జున్‌ లాల్‌-అర్వింద్‌ సింగ్‌ 11వ స్థానంతో సరిపెట్టుకుంది. విశ్వక్రీడల్లో భారత్‌ తరఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. గురువారం జరిగిన పోటీలో భారత ద్వయం 6 నిమిషాల 29.66 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. సెయిలింగ్‌ పురుషుల స్కిఫ్‌ ఈవెంట్‌లో భారత జంట కేసీ గణపతి-వరుణ్‌ ఠక్కర్‌ 17వ ప్లేస్‌లో నిలిచింది. మహిళల విభాగంలో నేత్ర 31.. పురుషుల విభాగంలో విష్ణు 23వ స్థానాల్లో నిలిచారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana