ఆదివారం 29 మార్చి 2020
Sports - Jan 26, 2020 , 03:32:58

నారీశక్తికి భూషణం

నారీశక్తికి భూషణం

మహిళా శక్తికి ప్రతిరూపంగా.. ఎందరికో స్ఫూర్తిగా విరాజిల్లుతున్నక్రీడామణులు పీవీ సింధు, మేరీకోమ్‌కు సముచిత గౌరవం దక్కింది. క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబర్చడంతో పాటు అంతర్జాతీయ యవనికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన ఈ ఇద్దరికి సమోన్నత పురస్కారాలు దక్కాయి. మేరీకోమ్‌ను దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ వరించగా..తెలుగమ్మాయి, బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధుకు పద్మభూషణ్‌ పురస్కారం దక్కింది.

  • మేరీకోమ్‌కు పద్మవిభూషణ్‌
  • తెలుగు షట్లర్‌ పీవీ సింధుకు పద్మభూషణ్‌

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌, తెలుగు క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధుకు మరో అపూర్వ గౌరవం దక్కింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ అవార్డులను ప్రకటించగా... దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్‌ సింధును వరించింది. మణిపూర్‌ మణిపూస, ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ మేరీ కోమ్‌కు పద్మవిభూషణ్‌ దక్కింది. తల్లి అయ్యాక కూడా బాక్సింగ్‌ రింగ్‌లో పంచ్‌లు విసురుతూ దేశం తరఫున అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ఘనతలు సాధించిన మేరీ.. టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ప్రస్తుతం సన్నద్ధమవుతున్నది. మరోవైపు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌తో పాటు క్రీడావిభాగంలో మరో ఐదుగురికి పద్మశ్రీ అవార్డు దక్కింది. భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌, పురుషుల జట్టు మాజీ కెప్టెన్‌ ఎంపీ గణేశ్‌, స్టార్‌ షూటర్‌ జీతూరాయ్‌, భారత మహిళా ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఓనమ్‌ బెంబెం దేవీ, ఆర్చర్‌ తనూదీప్‌ రాయ్‌లను పద్మశ్రీ అవార్డులు వరించాయి.


బ్యాడ్మింటన్‌ ‘క్వీన్‌' సింధు 

అలుపెరుగని కృషి, అంకిత భావం, కఠోర శ్రమతో తెలుగమ్మాయి పీవీ సింధు.. బ్యాడ్మింటన్‌ ప్రపంచానికి రారాణిగా వెలుగొందుతున్నది. దేశం తరఫున ఎన్నో పతకాలు మరెన్నో ఘనతలు సాధిస్తూ ముందుకుసాగుతున్నది. 2013 సీనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో మొదలుపెడితే ఇప్పటి వరకు ఎన్నో విజయాలతో దేశ ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై ఇనుమడింపజేస్తూనే ఉన్నది. భారత బ్యాడ్మింటన్‌లో స్వర్ణ యుగమని చెప్పుకునేలా 2016 నుంచి సింధు విశేషంగా రాణిస్తున్నది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకంతో మురిసిన తెలుగమ్మాయి.. కామన్వెల్త్‌ (2018) క్రీడల్లోనూ జాతీయ జెండాను రెపరెపలాడించింది. ఆసియా గేమ్స్‌, ఆసియా చాంపియన్‌షిప్‌, సౌత్‌ ఆసియా గేమ్స్‌తో పాటు అనేక అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శనలతో భారత్‌లో బ్యాడ్మింటన్‌కు కొత్త కళ తెచ్చింది. గతేడాది స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జగజ్జేతగా నిలిచిన సింధు.. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. సింధు ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2015లోనే పద్మశ్రీతో సత్కరించగా.. మరిన్ని విశిష్ట విజయాలతో ప్రస్తుతం బ్యాడ్మింటన్‌లో శిఖరాగ్రానికి చేరడంతో దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్‌ ప్రకటించింది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధమవుతున్న సింధు.. ఈ ప్రోత్సాహంతో విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనతో మెరుస్తుందని ఆశిద్దాం.


logo