రోహిత్, గిల్లను రెచ్చగొట్టిన లబుషేన్.. వీడియో

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్లు అంటేనే నోటి దురుసు ఎక్కువగా ఉన్నవాళ్లు. క్రికెట్లో ఆటతోపాటు నోటికి పని చెప్పి కూడా గెలవడం వాళ్లకే చెల్లింది. అసలు క్రికెట్‌కు స్లెడ్జింగ్‌ను పరిచయం చేసిందే వాళ్లు. అయితే ఈ మధ్య కంగారూలు కాస్త తగ్గారు. ఇంతకుముందు నోటి దురుసు వాళ్లలో కనిపించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లోనూ వాళ్లు ఆటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ తొలిసారి ఆ టీమ్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ .. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆడుతున్న సమయంలో వాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. ఫార్వర్డ్ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లబుషేన్.. పదేపదే మాటలతో గిల్, రోహిత్‌లను రెచ్చగొట్టిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు.. సచినా, కోహ్లినా అంటూ గిల్‌ను అడిగాడు లాబుషేన్. తర్వాత చెబుతాను అని గిల్ అంటున్నా.. ఈ బాల్ తర్వాత చెబుతావా.. సచినా? కోహ్లినా అంటూ పదే పదే అడిగాడు. అటు రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో క్వారంటైన్లో ఏం చేశావ్ అంటూ ప్రశ్నించాడు.
.@marnus3cricket was enjoying being back under the helmet for the Aussies! #AUSvIND pic.twitter.com/GaCWPkTthl
— cricket.com.au (@cricketcomau) January 8, 2021