గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 11, 2020 , 17:15:40

IPL 2020: చెలరేగిన మనీశ్‌ పాండే, వార్నర్‌

IPL 2020: చెలరేగిన మనీశ్‌ పాండే, వార్నర్‌

దుబాయ్:  రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోరాడే స్కోరు చేసింది.  మనీశ్‌ పాండే(54: 44 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు ) అద్భుత అర్ధసెంచరీకి తోడుగా డేవిడ్‌  వార్నర్‌(48: 38 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4  వికెట్లకు 158 పరుగులు చేసింది.   పటిష్ఠ హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్లను రాజస్థాన్‌  బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ఇన్నింగ్స్‌ ఆద్యంతం బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా పరుగులు రాబట్టకుండా అడ్డుకున్నారు.   చివర్లో  కేన్‌  విలియమ్సన్‌(22నాటౌట్‌: 12 బంతుల్లో 2సిక్సర్లు )  కాస్త గేరు మార్చి విరుచుకుపడడంతో సాధారణ స్కోరు చేయగలిగింది.  రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, కార్తీక్‌ త్యాగీ, ఉనద్కత్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన  సన్‌రైజర్స్‌  పిచ్‌పై పరుగులు సాధించేందుకు తెగ కష్టపడింది.   ఆరంభంలో  రాజస్థాన్‌  బౌలర్లు చక్కటి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులతో కట్టడి చేయడంతో పవర్‌ప్లేలో  హైదరాబాద్‌   26 పరుగులే  చేసింది. దూకుడుగా ఆడే క్రమంలో  కార్తీక్‌ త్యాగీ బౌలింగ్‌లో  ఓపెనర్‌ బెయిర్‌స్టో (16) ఔటయ్యాడు.    పిచ్‌  నుంచి ఆశించిన సహకారం  లభించకపోవడంతో బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి  ఆడారు.   10 ఓవర్లకు  63/1తో ఉన్న సన్‌రైజర్స్‌... 15 ఓవర్లకు 96/2తో కోలుకున్నది.   డాషింగ్‌  ఓపెనర్‌ వార్నర్‌  బ్యాట్‌ను ఝుళిపించడంతో పాటు  మనీశ్‌   నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.   

రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో  వేగంగా  ఆడేందుకు ప్రయత్నించిన వార్నర్‌..జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఓవర్‌ నాలుగో బంతిని భారీ షాట్ ఆడబోయి బౌల్డ్‌  అయ్యాడు.   దీంతో రెండో  వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వార్నర్‌ ఔటైన తర్వాత  మనీశ్‌ పాండే దూకుడు పెంచాడు.    రాహుల్‌ తెవాటియా వేసిన 16వ ఓవర్లో పాండే ఫోర్‌, సిక్సర్‌ బాది 13 పరుగులు రాబట్టాడు.  ఈ క్రమంలోనే 40 బంతుల్లోనే  అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.  ఉనద్కత్‌ వేసిన 18వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన మనీశ్‌..తెవాటియాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌  చేరాడు. చివర్లో  విలియమ్సన్‌, ప్రియం గార్గ్‌(15: 8 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ ) తమదైన శైలిలో రెచ్చిపోయి జట్టు స్కోరును 150 దాటించారు