శుక్రవారం 10 జూలై 2020
Sports - Jun 16, 2020 , 07:30:38

ఏషియన్‌ గేమ్స్‌ పోటీలే మణిచందన లక్ష్యం

ఏషియన్‌ గేమ్స్‌ పోటీలే మణిచందన లక్ష్యం

తాండూర్‌ : తాండూర్‌ మండల కేంద్రానికి చెందిన వొడ్నాల మల్లేశ్‌-నాగరాణి కూతురు మణిచందన. వీరిది మధ్య తరగతి కుటుంబం. మల్లేశ్‌ చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి పెద్ద కూతురు మణిచందన, చిన్న కూతురు వందన. మణిచందన తాండూర్‌ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసి, ప్రస్తుతం సింగరేణి మహిళా కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. చిన్నతనంలోనే మార్షల్‌ ఆర్ట్స్‌లో సత్తా చాటింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన కుటుంబ సభ్యులు, గురువు సంతోష్‌కుమార్‌ వివిధ క్రీడల్లో శిక్షణ ఇప్పించారు. వేముల సతీశ్‌, ఆవుల రాజనర్సు, గడ్డం మహేశ్‌, కిక్‌ బాక్సింగ్‌ కోచ్‌ భరత్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో మేటిగా తీర్చిదిద్దారు. అటుపై ఆమెకు వాటర్‌ రిప్లింగ్‌లో శిక్షణ ఇవ్వగా, తొలి ప్రయత్నంలోనే కాంస్య పతకం సాధించింది.

సాధించిన విజయాలు

వివిధ క్రీడల్లో రాణిస్తున్న మణిచందన, లెక్కకు మించి పతకాలను తన ఖాతాలో వేసుకుంది. 64వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో నిర్వహించిన కూడో (జపనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌)కు ప్రాతినిథ్యం వహించింది. ఎస్జీఎఫ్‌ అండర్‌ -19 కుస్తీ పోటీల్లో విజయం సాధించి, వరంగల్‌లో జరిగిన కుస్తీ స్టేట్‌ మీట్‌కు ఎంపికైంది. బెల్లంపల్లిలో జరిగిన అండర్‌-19 టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్‌ తరఫున ప్రాతినిథ్యం వహించింది. బెల్లంపల్లి జరిగిన నబాబో అండర్‌-19 పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ నబాబో పోటీలకు ఎంపికైంది. ఉషూ వరంగల్‌ స్టేట్‌ మీట్‌కు ప్రాతినిథ్యం వహించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. కిక్‌ బాక్సింగ్‌లో మూడు సార్లు జాతీయ స్థాయి పోటీలు ఆడింది.

ఏషియన్‌ గేమ్స్‌లో ఆడడమే లక్ష్యం

నా ఈ విజయాల వెనుక నా తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహం ఉంది. వారి ఆశయాల సాధనకు, నా ముందున్న లక్ష్యం ఒకటే ఏషియన్‌ గేమ్స్‌ ఆడడం. ఏషియన్‌ గేమ్స్‌కు మార్షల్‌ ఆర్ట్స్‌ విభాగంలో భారత్‌ తరఫున ఆడాలనేదే ప్రథమ కర్తవ్యం. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌కు దేశం తరఫున ప్రాతినిథ్యం వహించాలని ఉంది. ఇందుకోసం ప్రతినిత్యం శ్రమిస్తున్నా. వివిధ క్రీడల్లో పాల్గొనడం వల్ల ఒత్తిడిని జయిస్తున్నా. ఒక్కో క్రీడలో ఒక్కో అంశం విశేషం ఉంది. ఏ ఆట ఆడినంతసేపు అదే ఆటకు పరిమితమవుతా.

- మణిచందన, క్రీడాకారిణి, తాండూరు.


logo