బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Nov 19, 2020 , 01:05:19

పేసర్లకు రొటేషన్‌!

 పేసర్లకు రొటేషన్‌!

పనిభారం తగ్గించేందుకు మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌

టీ20 సిరీస్‌కు బుమ్రా, షమీ దూరం!న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో పేసర్లపై పనిభారాన్ని తగ్గించేందుకు జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీలను పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో రొటేషన్‌ పద్ధతిలో వాడాలని టీమ్‌ఇండియా భావిస్తున్నది. సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ గాయం కారణంగా తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రధాన పేసర్లు గాయాల పాలవకుండా కాపాడుకునేందుకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ అనంతరం దుబాయ్‌ నుంచి నేరుగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత జట్టు క్వారంటైన్‌లోఉంటూనే ప్రాక్టీస్‌ చేస్తున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 27న ప్రారంభమయ్యే ఈ పర్యటనలో టీమ్‌ఇండియా తొలుత 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. డిసెంబర్‌ 17 నుంచి బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్‌లో తొలి పోరు డే అండ్‌ నైట్‌గా జరుగనుండటంతో దానిపైనే దృష్టి సారించిన టీమ్‌ఇండియా సుదీర్ఘ ఫార్మాట్‌ కోసమే ప్రాక్టీస్‌ చేస్తున్నది. షమీ, బుమ్రా నెట్స్‌లో చెమటోడుస్తున్న విధానాన్ని బట్టి చూస్తే వన్డే, టీ20 సిరీస్‌ల్లో వారిని రొటేషన్‌ పద్ధతిలో వినియోగించనున్నట్లు అర్థమవుతున్నది.

భరత్‌ అరుణ్‌ సూచనతో..

12 రోజుల వ్యవధిలో ఆరు మ్యాచ్‌లు ఆడితే ప్రధాన పేసర్లు అలసిపోయే ప్రమాదం ఉండటంతో బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వన్డే సిరీస్‌ తర్వాత డిసెంబర్‌ 4 నుంచి 8 వరకు జరిగే టీ20 సిరీస్‌కు బదులు.. అదే సమయంలో జరిగే వామప్‌ మ్యాచ్‌లో బుమ్రా, షమీ బరిలో దిగే అవకాశం ఉంది. గులాబీ బంతితో జరుగనున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ వీరిద్దరూ ఆడనున్నారు. అయితే పొట్టి సిరీస్‌లో వీరిద్దరు లేని లోటును దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, నవదీప్‌ సైనీ భర్తీ చేయొచ్చు.


సాహా సాధన.. 

సిడ్నీ: సీనియర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన సాహా.. కండరాల గాయం కారణంగా టెస్టు సిరీస్‌లో ఆడుతాడా లేదా అనేది అనుమానంగా మారింది. తొలి టెస్టుకు దాదాపు నెల రోజులు ఉండగా.. సాహా సాధన మొదలు పెట్టడం టీమ్‌ఇండియాకు శుభపరిణామం. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యుత్తమ వికెట్‌ కీపర్‌గా పేరు తెచ్చుకున్న సాహా ఫిట్‌గా ఉంటే రిషబ్‌ పంత్‌ను పక్కన పెట్టి తుది జట్టులో అతడికే అవకాశమివ్వచ్చు. బుధవారం టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో థ్రోడౌన్‌ స్పెషలిస్ట్‌లు నువాన్‌ సునెవిరత్నె, దయానంద గరాని బంతులేస్తుండగా.. సాహా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన బీసీసీఐ ‘నెట్స్‌లో ఎవరు ప్రాక్టీస్‌ చేస్తున్నారో చూశారా?’ అనే వ్యాఖ్య జోడించింది. నెట్స్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బంతులు ఎదుర్కొన్న సాహా.. సౌకర్యవంతంగా కనిపించాడు. తొలి టెస్టు వరకు సాహా కోలుకుంటాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేసినట్లుగానే.. వృద్ధిమాన్‌ కోలుకొని నెట్స్‌లో అడుగుపెట్టాడు.