కారు, బైక్ ఢీ.. యువకుడు మృతి

నల్లగొండ: జిల్లాలోని అనుముల మండలం అనుముల గ్రామం గాయత్రి రైస్ మిల్లు వద్ద శనివారం ద్విచక్ర వాహనం, వ్యాగన్ఆర్ కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో క్రాంతి కుమార్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుర్రంపోడు మండలం బోడపాడు గ్రామానికి చెందిన బోయిన క్రాంతి కుమార్ తల్లి ఈనెల 20న తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వచ్చింది.
తిరుమలగిరి మండల కేంద్రంలో ఉన్న తల్లిని ఇంటికి తీసుకుపోయేందుకు బైక్ పై బయలుదేరాడు. గాయత్రి రైస్ మిల్లు వద్దకు చేరుకోగానే హాలియా నుంచి పెద్దవూర వైపు వెళ్తున్న వ్యాగన్ఆర్ కారు, బైకు ఒకదానికొకటి ఢీ కొనడంతో క్రాంతి కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో నల్లగొండకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
హాలియా నుంచి నల్లగొండకు తరలించి చికిత్స అందిస్తుండగానే క్రాంతి మృతి చెందాడు. క్రాంతికుమార్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతుడు క్రాంతి బంధువుల నుంచి ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ శివ కుమార్ తెలిపారు.