బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 08, 2020 , 12:16:47

లక్ష్యసేన్‌ నిష్క్రమణ

లక్ష్యసేన్‌ నిష్క్రమణ

కౌలాలంపూర్‌: వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌కు మలేషియా మాస్టర్స్‌ టోర్నీలో నిరాశ ఎదురైంది. సీజన్‌ ప్రారంభ టోర్నీ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 క్వాలిఫయర్స్‌లో ఓటమిపాలైన లక్ష్య.. మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో లక్ష్యసేన్‌ 21-11, 18-21, 14-21తో హన్స్‌ క్రిస్టియన్‌ సోల్‌బెర్గ్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడాడు. 49 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ నెగ్గిన లక్ష్యసేన్‌.. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరో భారత ఆటగాడు శుభంకర్‌ డే 15-21, 15-21తో లియూ డరెన్‌ (మలేషియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో ఇటీవల చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న రాంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ కూడా ఇంటిదారి పట్టింది. ప్రస్తుతం ప్రపంచ 12వ ర్యాంక్‌లో ఉన్న సాత్విక్‌ ద్వయం మెయిన్‌ ‘డ్రా’తొలి రౌండ్‌లో 15-21, 21-18, 15-21తో 19వ ర్యాంక్‌ ఓంగ్‌ యే సిన్‌-టియో ఈ యై (మలేషియా) జంట చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో పూజా దండు-సంజనా సం తోష్‌ ద్వయం క్వాలిఫయర్స్‌లోనే తమ పొరాటం ముగించింది.
lakshya1

నేడు బరిలోకి సింధు, సైనా

గతేడాది పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత స్టార్‌ షట్లర్లు తాజా సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని భావిస్తున్నారు. బుధవారం జరుగనున్న మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఆరో సీడ్‌ పీవీ సింధు.. ఎవ్‌గెనియా కొసెస్కాయా (రష్యా)తో, సైనా నెహ్వాల్‌.. లియన్నె టాన్‌ (బెల్జియం)తో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌ భారత పోరాటాన్ని ప్రారంభించనున్నాడు. తొలి రౌండ్‌లో అతడు ప్రపంచ నంబర్‌వన్‌ కెంటా మొమోటా (జపాన్‌)ను ఢీకొననున్నాడు. రెండో సీడ్‌ చౌ టైన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో కిడాంబి శ్రీకాంత్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. సమీర్‌ వర్మ, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, బి.సాయిప్రణీత్‌ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


logo
>>>>>>