శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 17, 2020 , 22:33:43

టెస్ట్ లో సెంచరీ చేశా.. ఇక రిటైర్మెంట్ తీసుకుంటా

టెస్ట్ లో సెంచరీ చేశా.. ఇక రిటైర్మెంట్ తీసుకుంటా

మహేంద్ర సింగ్ ధోని.. స్థిర ప్రశాంతత, దూకుడు బ్యాటింగ్ కారణంగా అద్భుత ఖ్యాతిని పొందాడు. కాని అతడు విపరీత పరిస్థితులలో కూడా భావోద్వేగాలను ప్రదర్శించలేడని నిరూపించాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ సొగసరి బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్.. ధోనీతో తన అనుభవాలను స్టార్ క్రికెట్ తో పంచుకున్నారు.

“ 2006 లో పాకిస్తాన్ ఫైసలాబాద్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. అనంతరం డ్రెస్సింగ్ రూంకు వచ్చిన ధోనీ.. బాంబు పేల్చాడు. క్రికెట్ నుంచి వీడ్కోలు ప్రకటిస్తున్నట్లు బాంబు పేల్చాడు. దాంతో నేను నిశ్చేష్టుడనయ్యాను. అదేంటి బ్రదర్ అలా ఎందుకు..? ఇంకా చాలా ఉంది ఆడాల్సింది.. అని చెప్పి చూశా. టెస్టులో సెంచరీ చేశా, ఇక చాలు రిటైర్మెంట్ తీసుకుంటా అని కూల్ గా చెప్పాడు” అని లక్ష్మణ్ వెల్లడించారు.

2008 లో నాగ్ పూర్ లో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మరోసారి తనను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడని లక్ష్మణ్ చెప్పాడు. “మ్యాచ్ సమయంలో అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ ప్రకటించడంతో ధోనీ ఫుల్ టైమ్ కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత హోటల్ కు వెళ్తుండగా.. బస్సు డ్రైవర్ ను వెనక సీట్లో కూర్చోమని చెప్పి.. తానే బస్సును నడిపించుకుంటూ హోటల్ కు తీసుకెళ్లాడు. జట్టును నడిపించేవాడిని ఈ మాత్రం డ్రైవర్ గా సేవచేయలేనా? అంటూ ప్రశ్నించి మమ్మల్ని ఆశ్చర్యపరిచాడు” అని తెలిపారు వీవీఎస్ లక్ష్మణ్. ఈ రెండు సందర్భాలు చాలా ధోనీ క్రికెట్ తోపాటు జీవితాన్ని ఎంతగా ఆస్వాదించేవాడో అర్థమవుతుందని లక్ష్మణ్ అన్నారు. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన ధోనీ.. తన క్రికెట్ ఆటతీరుతో ప్రపంచాన్నే తన పాదాక్రాంతం చేసుకుని లక్షల మందిని అభిమానులుగా సంపాదించుకున్నాడని లక్ష్మణ్ కొనియాడారు.


logo