గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 01, 2020 , 01:34:28

సీఏసీలో ఆర్పీ సింగ్‌

 సీఏసీలో ఆర్పీ సింగ్‌

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా సీనియర్‌ జట్టు సెలెక్టర్ల ఎంపిక కోసం క్రికెట్‌ సలహాదారుల కమిటీ(సీఏసీ)ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) శుక్రవారం  నియమించింది. సీఏసీలో టీమ్‌ఇండియా మాజీ పేసర్లు రుద్ర ప్రతాప్‌ సింగ్‌, మదన్‌ లాల్‌తో పాటు భారత మహిళల జట్టు మాజీ వికెట్‌ కీపర్‌ సులక్షణ నాయక్‌కు చోటు దక్కింది. సెలెక్టర్లు ఎమ్మెస్కే ప్రసాద్‌, గగన్‌ కోడా పదవీ కాలం పూర్తి కావడంతో వారి స్థానంలో కొత్త వారిని సీఏసీ ఎంపిక చేయనుంది. కొత్త సీఏసీ ఏడాది పాటు కొనసాగుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షాతెలిపారు. మాజీ ఓపెనర్‌ గంభీర్‌కు సీఏసీలో చోటివ్వాలని తొలుత బీసీసీఐ ఆలోచించినా... ప్రస్తుతం అతడు పార్లమెంటు సభ్యుడిగా ఉండడంతో సాధ్యపడలేదు. దీంతో ఆర్పీ సింగ్‌కు మార్గం సుగమమైంది. మదన్‌ లాల్‌, సులక్షణ పేర్లను బీసీసీఐ ఎప్పుడో ఖరారు చేసింది. 1983 ప్రపంచకప్‌ గెలిచిన జట్టు లో సభ్యుడైన మదన్‌ లాల్‌..  టీమ్‌ఇండియా తరఫున మొత్తం 39టెస్టులు(71వికెట్లు), 67వన్డేలు(73వికెట్లు) ఆడాడు. గతంలో సెలెక్షన్‌ కమిటీ సభ్యుడిగానూ పనిచేశాడు. ఆర్పీ సింగ్‌ మొత్తం 14టెస్టులు(40వికెట్లు), 58వన్డేలు (69), 10టీ20ల్లో జాతీయ జట్టుకు ఆడగా.. 2007 టీ20 ప్రపంచకప్‌ భారత్‌ గెలువడంలోనూ అతడు సింగ్‌ కీలకపాత్ర పోషించాడు. భారత మహిళల జట్టు తరఫున మాజీ వికెట్‌ కీపర్‌ సులక్షణ నాయక్‌ 46వన్డేలు, 31టీ20లు ఆడింది. గతంలో సీఏసీ సభ్యులుగా విధులు నిర్వర్తించిన సచిన్‌, గంగూలీ,  లక్ష్మణ్‌తో పాటు  కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌, శాంతరంగ స్వామి కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు రావడంతో బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. 


logo