సోమవారం 30 నవంబర్ 2020
Sports - Nov 14, 2020 , 02:19:07

జట్లను పెంచితేనే..

జట్లను పెంచితేనే..

  •  అప్పుడు నైపుణ్యానికి తగ్గ అవకాశాలు లభిస్తాయి.. ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీలపై ద్రవిడ్‌

ప్రస్తుతం సీజన్‌లో 60 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఒక వేళ తొమ్మిది ఫ్రాంచైజీలు అయితే 76 మ్యాచ్‌లు, 10 జైట్లెతే 91 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఐపీఎల్‌ విండోలో ఇన్ని మ్యాచ్‌లు నిర్వహించడం కష్టసాధ్యం. ఒకవేళ తప్పదు అనుకుంటే వచ్చే సీజన్‌లో డబుల్‌ హెడర్‌ల సంఖ్య పెరుగనుంది. ప్రస్తుతం శని, ఆదివారాల్లోనే రెండేసి మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇక మీదట శుక్రవారం కూడా డబుల్‌ ధమాకా చూడొచ్చు.

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను విస్తరించేందుకు సమయం ఆసన్నమైందని భారత మాజీ కెప్టెన్‌, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. మన దేశంలో అపార నైపుణ్యం దాగి ఉందని యువ ఆటగాళ్లలోని ప్రతిభ వెలుగులోకి రావాలంటే కొత్త ఫ్రాంచైజీలు అవసరమని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. ఈ అంశంపై శుక్రవారం ద్రవిడ్‌ మాట్లాడుతూ.. ‘నైపుణ్యం పరంగా చూసుకుంటే ఐపీఎల్‌ విస్తరణకు సిద్ధంగా ఉందని భావిస్తున్నా. తుది జట్టులో ఆడేందుకు అవకాశం లభించని ప్రతిభావంతులైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. మరిన్ని జట్లు ఉంటే బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లందరికీ అవకాశాలు లభిస్తాయి. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం బీసీసీఐకే ఉంది. 2021 సీజన్‌లో తొమ్మిది జట్ల ఐపీఎల్‌ నిర్వహించడం సాధ్యమే. కాకపోతే మధ్యాహ్నం మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుంది. యువ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడాన్ని ఆస్వాదిస్తా. ఐపీఎల్‌ కారణంగా ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. కోచ్‌లు ఎన్ని విషయాలు చెప్పినా.. అనుభవం నేర్పే పాఠాలు చాలా విలువైనవి. ప్రపంచ ఉత్తమ ఆటగాైళ్లెన విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌తో కలిసి బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు దేవదత్‌ పడిక్కల్‌ చాలా నేర్చుకొని ఉంటాడు. అలాగే వార్నర్‌, విలియమ్సన్‌ సలహాలతో నటరాజన్‌ రాటుదేలి ఉంటాడు. ఇలాగే మరింత మందికి అవకాశం రావాలంటే ఫ్రాంచైజీల సంఖ్య పెంచడమే మంచింది. ఇక లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు పటిష్టంగా కనిపించడానికి వారి వద్ద బలమైన కోర్‌ గ్రూప్‌ ఉండటమే ప్రధాన కారణం’ అని చెప్పుకొచ్చాడు.

దీపావళి తర్వాత ప్రకటన!

ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీ అడుగు పెట్టబోతున్నదా అంటే ఔననే సమాధానమే వస్తున్నది. ఐపీఎల్‌ పాలసీ ప్రకారం 2020 సీజన్‌ అనంతరం లీగ్‌లో జట్ల సంఖ్య పెరుగాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ ఏడాది సీజన్‌ ఆలస్యంగా ముగియగా.. వచ్చే ఏడాది  స్వదేశంలోనే ఐపీఎల్‌ 14వ సీజన్‌ నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశాడు. అయితే వచ్చే సీజన్‌కు ఎక్కువ రోజులు లేకపోవడంతో వేలం ప్రక్రియను వాయిదా వేయాలని తొలుత భావించినా.. కొత్త ఫ్రాంచైజీ రాక నేపథ్యంలో అది సాధ్యపడేలాలేదు. అంతా అనుకున్నట్లు సాగితే జనవరిలో మెగా వేలం ప్రక్రియ జరుగవచ్చు. అహ్మదాబాద్‌ కేంద్రంగా కొత్త ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ప్రముఖ సంస్థలు పోటీపడుతుండగా.. వేలం, కొత్త ఫ్రాంచైజీ, పాలసీ, నిబంధనలు, రైట్‌ టు మ్యాచ్‌ అంశాలపై సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

  • గతేడాది రూపొందించిన ఐపీఎల్‌ పాలసీ ప్రకారం 2020 సీజన్‌ తర్వాత రెండు కొత్త ఫ్రాంచైజీలను లీగ్‌లో చేర్చాలి.2021లో ఒకటి, 2022 సీజన్‌లో మరొకటి చేర్చాలని బోర్డు సభ్యులు సూచించారు. 
  • దీపావళి తర్వాత కొత్త ఫ్రాంచైజీ కోసం టెండర్లు  ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. 
  • మరి స్టార్‌ ఆటగాళ్లంతా వేలంలో అందుబాటులో ఉంటే పాత ఫ్రాంచైజీల బ్రాండ్‌ వ్యాల్యూ తగ్గే ప్రమాదం పొంచి ఉంది.
  • సెంట్రల్‌ రెవెన్యూ పూల్‌ పాలసీ 2023 వరకు అమల్లో ఉంటుంది. అంటే కొత్తగా ఎన్ని జట్లు వచ్చినా.. ఈ రెవెన్యూ పూల్‌నే షేర్‌ చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఇప్పుడు ఫ్రాంచైజీలకు లభిస్తున్న ఆదాయానికి గండిపడనుంది.
  • ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రతి జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకునే చాన్స్‌ ఉంది. వీరితో పాటు మరో ఆటగాడిని రైట్‌ టు మ్యాచ్‌ ద్వారా తిరిగి తీసుకోవచ్చు. అయితే కొత్త ఫ్రాంచైజీ వస్తే ఇది సాధ్యపడకపోవచ్చు.
  • యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఫైనల్‌ వీక్షించేందుకు దుబాయ్‌ వెళ్లిన కేరళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌.. బైజూస్‌తో కలిసి ఫ్రాంచైజీ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.