గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 22, 2020 , 11:16:26

బుమ్రా.. జాగ్ర‌త్త‌: క‌పిల్‌దేవ్‌

బుమ్రా.. జాగ్ర‌త్త‌: క‌పిల్‌దేవ్‌

ముంబై: ప‌్ర‌స్తుతం ప్ర‌పంచ క్రికెట్‌లోని బెస్ట్ పేస్ బౌల‌ర్ల‌లో టీమిండియా పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా కూడా ఒక‌డు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. షార్ట్ ర‌న‌ప్‌తో అత‌డు జ‌న‌రేట్ చేసే పేస్‌ను ఎదుర్కోవ‌డానికి బ్యాట్స్‌మ‌న్ కిందా మీదా ప‌డ‌తారు. అయితే దీంతోనే బుమ్రా కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నాడు లెజెండ‌రీ బౌల‌ర్ క‌పిల్‌దేవ్‌. అంత త‌క్కువ ర‌న‌ప్‌తో ఆ స్థాయి పేస్ జ‌న‌రేట్ చేయ‌డానికి చాలా సామ‌ర్థ్యం అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని, అది బుమ్రా శ‌రీరంపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని క‌పిల్ అంటున్నాడు. విండీస్ మాజీ దిగ్గ‌జం మైకేల్ హోల్డింగ్ కూడా గ‌తంలో ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. తాను కూడా అత‌నితో ఏకీభ‌విస్తున్న‌ట్లు క‌పిల్ చెప్పాడు. ఇలాంటి ర‌న‌ప్‌తో ఎక్కువ కాలం బుమ్రా కొన‌సాగ‌డం అంత సులువు కాద‌ని అన్నాడు. నాలుగు లేదా ఎనిమిది ఓవ‌ర్ల వ‌ర‌కూ ఓకే కానీ.. రోజూ 20 నుంచి 25 ఓవ‌ర్లు వేస్తూ 3, 4, 5 టెస్టులు వ‌రుస‌గా ఆడుతుంటే బుమ్రా శ‌రీరంపై తీవ్ర ఒత్తిడి ప‌డుతుందని క‌పిల్ అభిప్రాయ‌ప‌డ్డాడు. 

హోల్డింగ్ చెప్పింది నిజ‌మేన‌ని, బుమ్రా త‌న శ‌రీరంపై ఒత్తిడి బాగా పెంచుతున్నాడ‌ని అన్నాడు. అయితే అత‌ను ఈ స‌వాలును దీటుగా ఎదుర్కొంటాడ‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశాడు. త‌న షార్ట్ ర‌న‌ప్‌తో బుమ్రాలాగా బ్యాట్స్‌మెన్‌ను వ‌ణికించే సామర్థ్యం మ‌రే ఇత‌ర బౌల‌ర్‌కు లేద‌ని క‌పిల్ స్ప‌ష్టం చేశాడు. ఒక‌ప్పుడు టీమిండియా పేస్ బౌలింగ్ భారాన్ని ఒంటిచేత్తో మోసిన క‌పిల్‌.. ప్ర‌స్తుత టీమ్‌లోని పేస‌ర్ల‌ను చూసి గ‌ర్వంగా ఫీల‌వుతున్నాడు. తాను క‌పిల్‌దేవ్‌నైనా ఎదుర్కొంటాను కానీ బుమ్రాతో క‌ష్ట‌మ‌ని బ్ర‌యాన్ లారా చెప్పిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా క‌పిల్ గుర్తు చేశాడు. మ‌న ఫాస్ట్ బౌల‌ర్లు అద్భుతం. ష‌మి, బుమ్రాను చూడండి. ఇవాళ మ‌నం పేస్‌బౌల‌ర్ల‌పై ఆధార‌ప‌డుతున్నామ‌ని చెప్ప‌డానికి ఓ క్రికెట‌ర్‌గా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక మ్యాచ్‌లో 20 వికెట్లు తీసుకునే స‌త్తా మ‌న బౌల‌ర్ల‌కు ఉంది అని క‌పిల్ అన్నాడు. ఒక‌ప్పుడు కుంబ్లే, హ‌ర్భ‌జ‌న్‌లాంటి స్పిన్న‌ర్ల‌పై టీమిండియా ఆధార‌ప‌డేద‌ని, కానీ ఇప్పుడు ఏ దేశం కూడా ఇండియన్ టీమ్‌కు బౌన్సీ వికెట్లు ఇచ్చే సాహ‌సం ఇప్పుడు చేయ‌ద‌ని క‌పిల్ తేల్చి చెప్పాడు.