సోమవారం 13 జూలై 2020
Sports - May 15, 2020 , 00:40:34

స్వల్పకాలిక లక్ష్యాలే మేలు

స్వల్పకాలిక లక్ష్యాలే మేలు

  • క్రికెట్‌ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియట్లేదు
  • టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ  

ముంబై: టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తన విజయ సూత్రాన్ని వెల్లడించాడు. క్రికెట్‌లో తాను స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు ప్రాధాన్యమిస్తానని, భవిష్యత్తులోనూ ఇలాగే ముందుకు సాగుతానని చెప్పాడు. దీర్ఘకాలిక లక్ష్యాలు ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచుతాయని అభిప్రాయపడ్డాడు. గురువారం ఓ టీవీ షో కోసం రోహిత్‌ మాట్లాడాడు. ‘దీర్ఘకాలిక లక్ష్యాలు ఏ విధంగానూ సాయం చేయవని నేను గ్రహించా. అలా నిర్దేశించుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే నేను ఎప్పుడూ స్వల్పకాలిక లక్ష్యాల మీదే దృష్టిపెడతా. తర్వాతి కొన్ని మ్యాచ్‌లు లేదా రెండు, మూడు నెలల కాలం గురించే ఆలోచిస్తా. మనం ఎవరితో ఆడతాం, నేను అత్యుత్తమంగా ఏం చేయగలను అని ఆలోచిస్తా. ప్రతి సిరీస్‌ లేదా టోర్నమెంట్‌ కోసం లక్ష్యాలను పెట్టుకోవడం నాకు చాలా సాయం చేస్తున్నది. ఇదే విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తా’ అని రోహిత్‌ శర్మ అన్నాడు. కరోనా ప్రభావం తగ్గి మళ్లీ క్రికెట్‌ ఆడే అవకాశం త్వరగానే వస్తుందని తాను ఆశిస్తున్నానని అన్నాడు. అయితే ఆట మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియడం లేదని రోహిత్‌ చెప్పాడు. గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్‌ ఐదు శతకాలతో విశ్వరూపం చూపడం సహా టెస్టుల్లోనూ ఓపెనర్‌ అవతారమెత్తి అద్భుతంగా రాణించాడు.    

మంచిని కూడా చూడాలి

కరోనా వైరస్‌ కారణంగా అందరి జీవితాలు అలజడికి గురయ్యాయని, అయితే ఇలాంటి క్లిష్ట సమయాల్లోనూ కొన్ని సానుకూల అంశాలను గమనించాలని రోహిత్‌ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రజలకు సూచించాడు. పర్యావరణం మళ్లీ కోలుకుంటున్నదని చెప్పాడు. ‘ఇది(కరోనా వైరస్‌) ఓ తుఫాను లాగా వచ్చి  మన  జీవితాల్లో అలజడి సృష్టించింది. ఒకవేళ మనం ఈ పరిస్థితుల్లోనూ సానుకూల అంశాన్ని చూడాలనుకుంటే.. భూమాత కోలుకునేందుకు అవకాశం దొరుకుతున్నది. సంక్షోభంలోనూ మంచిని గ్రహించడాన్ని ఇలాంటి పరిస్థితులు నేర్పుతాయి. దేనికి కట్టుబడి ఉండాలో తెలియజేస్తాయి’ అని శర్మ పేర్కొన్నాడు. కాగా లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం క్రికెటర్లందరూ ఇండ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే.


logo