ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 19, 2020 , 02:31:52

లూకీ మ్యాజిక్‌

లూకీ మ్యాజిక్‌

  • నిప్పులు చెరిగిన కోల్‌కతా పేసర్‌ ఫెర్గూసన్‌
  • హైదరాబాద్‌కు హ్యాట్రిక్‌ పరాజయం
  •  సూపర్‌ ఓవర్‌లో ఓటమి 

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) పేసర్‌ లూకీ ఫెర్గూసన్‌ నిప్పులు చెరగడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)కు మరో ఓటమి ఎదురైంది. సూపర్‌ ఓవర్లోనూ అతడిని ఎదుర్కోలేక చేతులెత్తేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ సీజన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమి పాలై ప్లేఆఫ్స్‌ అవకాశాలను ప్రమాదంలో పడేసుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన ఉత్కంఠ పోరులో హైదరాబాద్‌.. కోల్‌కతా చేతిలో సూపర్‌ ఓవర్‌లో పరాజయం పాలైంది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, ఓ సిక్స్‌), దినేశ్‌ కార్తీక్‌ (14 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చివర్లో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌ రెండు, విజయ్‌ శంకర్‌, రషీద్‌, బాసిల్‌ థంపి చెరో వికెట్‌ తీశారు. లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి సరిగ్గా 163 పరుగులు చేసింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (33 బంతుల్లో 47 నాటౌట్‌; 5 ఫోర్లు) చివరి వరకు పోరాడగా.. యువ ఆటగాడు అబ్దుల్‌ సమద్‌ (15 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, ఓ సిక్స్‌) అతడికి చక్కటి మద్దతు అందించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'లూకీ ఫెర్గూసన్‌ (3/15) మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. అతడు వేసిన సూపర్‌ ఓవర్లో వార్నర్‌ తొలి బంతికే డకౌట్‌ కాగా.. మూడో బంతికి సమద్‌ పెవిలియన్‌ చేరడంతో హైదరాబాద్‌ మూడు బంతులే ఆడి 2 పరుగులు చేయగలిగింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ మోర్గాన్‌, కార్తీక్‌ నాలుగు బంతుల్లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించారు. 

ఆరంభం అదిరినా..

లక్ష్యఛేదనలో ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (36), కేన్‌ విలియమ్సన్‌ (29) సన్‌రైజర్స్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేను ఉపయోగించుకుంటూ ఇద్దరూ పోటీపడి మరీ ఫోర్లు బాదారు. రెండో ఓవర్లో విలియమ్సన్‌ రెండు ఫోర్లతో ఆరంభిస్తే.. ఆ తర్వాత జానీ సైతం సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేశాడు. ఆ తర్వాత కూడా ఓవర్‌కు రెండు బౌండరీల చొప్పున బాదడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరు ఓవర్లకు 58 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. 

వార్నర్‌ చివరి వరకు.. 

వార్నర్‌కు జత కలిసిన యువ ఆటగాడు అబ్దుల్‌ సమద్‌ దూకుడుగా ఆడాడు. తన మూడో బంతినే సిక్సర్‌గా మలచడం సహా కీలక సమయాల్లో బౌండరీలు బాదాడు. అయితే 19 ఓవర్‌ చివరి బంతికి సిక్స్‌ వెళ్లే బంతిని ఫెర్గూసన్‌ - శివమ్‌ మావి మంచి సమన్వయంతో పట్టేయడంతో సమద్‌ వెనుదిరిగాడు. దీంతో చివరి ఓవర్‌లో 18 పరుగులు చేయాల్సి వచ్చింది. రసెల్‌ వేసిన ఆ ఓవర్లో వార్నర్‌ వరుసగా మూడు ఫోర్లు బాదడం.. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉంటే ఒకే రన్‌ రావడంతో మ్యాచ్‌ టై అయింది. 

తలాకొన్ని.. 

బ్యాట్స్‌మెన్‌ ఎవరూ 40 పరుగుల మార్కును చేరకున్నా తలా ఓ చేయి వేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా మోస్తరు స్కోరు చేసింది. ఓపెనర్లు రాహుల్‌ త్రిపాఠి (23), శుభ్‌మన్‌ గిల్‌ (36) తొలుత ఆచితూచి ఆడినా బౌండరీలతో దూకుడు పెంచడంతో తొలి ఐదు ఓవర్లలో కోల్‌కతా 42 పరుగులు చేసింది. త్రిపాఠిని హైదరాబాద్‌ పేసర్‌ నటరాజన్‌ (2/40) పెవిలియన్‌కు పంపడం.. శంకర్‌ (20/1), రషీద్‌ (28/1) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 10 ఓవర్లకు కోల్‌కతా 77 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత గిల్‌, రాణా త్వరగా ఔటవగా.. డేంజర్‌ మ్యాన్‌ ఆండ్రీ రస్సెల్‌ (9) మరోసారి విఫలమయ్యాడు. చివర్లో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, తాజా మాజీ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ దూకుడుగా ఆడి బౌండరీలు బాదడంతో కోల్‌కతా మంచి స్కోరును అందుకుంది. ఈ ఇద్దరూ చివరి నాలుగు ఓవర్లలో 52 పరుగులు చేశారు. 

వార్నర్‌ @ 5000

హైదరాబాద్‌ కెప్టెన్‌ వార్నర్‌ ఈ మ్యాచ్‌తో 5 వేల క్లబ్‌లో చేరాడు. ఐపీఎల్‌లో ఈ మైలురాయిని దాటిన తొలి విదేశీ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. కోహ్లీ (5795) అగ్రస్థానంలో ఉండగా.. రైనా (5368), రోహిత్‌ (5158) తర్వాత వార్నర్‌ (5037) నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. 

5 - ఈ ఏడాది ఐపీఎల్‌లోసూపర్‌ ఓవర్ల సంఖ్య ఐదుకు చేరింది. టోర్నీ చరిత్రలో ఒకే సీజన్‌లో ఇన్ని సూపర్‌ ఓవర్లు జరుగడం ఇదే తొలిసారి. 

లూకీ రాకతో.. 

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న కోల్‌కతా పేసర్‌ ఫెర్గూసన్‌ రంగప్రవేశంతో ఎస్‌ఆర్‌హెచ్‌ లక్ష్యఛేదన ముఖచిత్రమే మారిపోయింది. తొలి బంతికే విలియమ్సన్‌ను ఔట్‌ చేసిన అతడు.. తన తదుపరి ఓవర్లో ప్రియం గార్గ్‌ (4)ను బౌల్డ్‌ చేశాడు. ఇక ఆ తర్వాత బెయిర్‌స్టో ఔట్‌ కాగా.. మనీశ్‌ పాండే (6)ను అద్భుత యార్కర్‌తో లూకీ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి హైదరాబాద్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వార్నర్‌, విజయ్‌ శంకర్‌ (7) భాగస్వామ్య నిర్మాణంలో కాసేపు నెమ్మదిగా ఆడారు. దీంతో చివరి ఐదు ఓవర్లలో 55 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత శంకర్‌ను కమిన్స్‌ ఔట్‌ చేశాడు. 

స్కోరు బోర్డు

కోల్‌కతా: గిల్‌ (సి) గార్గ్‌ (బి) రషీద్‌ 36, త్రిపాఠి (బౌల్డ్‌) నటరాజన్‌ 23, రాణా (సి) గార్గ్‌ (బి) శంకర్‌ 29, రసెల్‌ (సి) శంకర్‌ (బి) నటరాజన్‌ 9, మోర్గాన్‌ (సి) మనీశ్‌ (బి) థంపి 34, కార్తీక్‌ (నాటౌట్‌) 29. ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 20 ఓవర్లలో 163/5. వికెట్ల పతనం: 1-48, 2-87, 3-88, 4-105, 5-163, బౌలింగ్‌: సందీప్‌ 4-0-27-0, థంపి 4-0-46-1, నటరాజన్‌ 4-0-40-2, శంకర్‌ 4-0-20-1, రషీద్‌ 4-0-28-1.

హైదరాబాద్‌: బెయిర్‌స్టో (సి) రసెల్‌ (బి) వరుణ్‌ 36, విలియమ్సన్‌ (సి) రాణా (బి) ఫెర్గూసన్‌ 29, గార్గ్‌ (బౌల్డ్‌) ఫెర్గూసన్‌ 4, వార్నర్‌ (నాటౌట్‌) 47, మనీశ్‌ (బౌల్డ్‌) ఫెర్గూసన్‌ 6, శంకర్‌ (సి) గిల్‌ (బి) కమిన్స్‌ 7, సమద్‌ (సి) గిల్‌ (బి) మావి 23, రషీద్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 163/6. వికెట్ల పతనం :1-58, 2-70, 3-70, 4-82, 5-109, 6-146, బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-28-1, మావి 3-0-34-1, వరుణ్‌ 4-0-32-1, రసెల్‌ 2-0-29-0, ఫెర్గూసన్‌ 4-0-15-3, కుల్దీప్‌ 3-0-18-0. 

 ప్రియమ్‌ పక్షిలా.. 

సన్‌రైజర్స్‌ యువ ఆటగాడు ప్రియమ్‌ గార్గ్‌ ఈ మ్యాచ్‌లో రెండు చక్కటి క్యాచ్‌లు అందుకున్నాడు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో గిల్‌ కొట్టిన బంతిని        లాంగాఫ్‌లో ఎడమ వైపు దూకుతూ పక్షిలా అందుకున్న గార్గ్‌.. మరుసటి ఓవర్‌లో తన ఫీల్డింగ్‌ విన్యాసంతో నితీశ్‌ రాణాను పెవిలియన్‌కు పంపాడు.