మంగళవారం 07 జూలై 2020
Sports - Jun 04, 2020 , 19:49:42

'ఇంట్లోనే నాన్న సాయంతో ప్రాక్టీస్‌ చేస్తున్నా'

'ఇంట్లోనే నాన్న సాయంతో ప్రాక్టీస్‌ చేస్తున్నా'

కోల్‌కతా: వికెట్‌ కీపింగ్‌ను మరింత మెరుగుపరుచుకునేందుకు శ్రమిస్తున్నానని టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్ట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా చెప్పాడు. లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లోనే ఉంటున్నా.. తన తండ్రి సాయంతో కీపింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నానని గురువారం చెప్పాడు. వీలైనంత ఎక్కువ కసరత్తులు చేస్తూ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నానని అన్నాడు.

‘వీలైనంత మేర సన్నాహకాలు చేస్తున్నా. ముఖ్యంగా చేతికి, కంటికి మధ్య సమన్వయాన్ని మరింత పెంచుకునేందుకు కృషి చేస్తున్నా. చాలాసార్లు మా ఫ్లాట్‌లో ప్రాక్టీస్‌ చేసేందుకు నాన్న (ప్రశాంత సాహా) సాయం చేస్తున్నారు. గోడకు బంతిని బలంగా బాది క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నా. ఇందుకు కావాల్సిన స్థలం ఉంది’ అని సాహా చెప్పాడు. ప్రస్తుతం భుజం గాయం నుంచి కోలుకున్నానని అతడు అన్నాడు. ‘టీమ్‌ఇండియా ఫిట్‌నెస్‌ కోచ్‌.. ఆటగాళ్లందరికీ ట్రైనింగ్‌కు సంబంధించిన ప్రణాళికను పంపుతున్నారు. నా వద్ద జిమ్‌ పరికరాలు పరిమితంగా ఉన్నాయి. అందుకే సాధారణ సమయాల్లో చేసినంత వ్యాయామం చేయలేకున్నా. క్రికెట్‌ పునఃప్రారంభమయ్యాక.. మళ్లీ గాడిలో పడేందుకు పేసర్లకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది' అని సాహా అన్నాడు.

అలాగే ఈ ఏడాది ప్రారంభంలో కివీస్‌ పర్యటనలో చోటు దక్కకపోవడంపై సాహా స్పందిస్తూ.. మేనేజ్‌మెంట్‌ ఏ నిర్ణయం తీసుకున్నా అది జట్టు సమతూకం కోసమే అని వృద్ధిమాన్‌ చెప్పాడు. 2018లో భుజం గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న సాహా కొన్ని నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. మళ్లీ గతేడాది వేలికి కూడా ఆపరేషన్‌ చేయించుకొని కోలుకున్నాడు.  


logo