మంగళవారం 26 జనవరి 2021
Sports - Jan 04, 2021 , 00:02:09

గల్లీబాయ్స్‌..

గల్లీబాయ్స్‌..

బ్యాటింగ్‌లో గణేశ్‌.. బౌలింగ్‌ ఖయ్యూం

క్రికెట్‌లో సత్తాచాటుతున్న పాలమూరు ప్లేయర్స్‌

జాతీయ స్థాయిలో రాణించాలనే కసి ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో.. పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసుకుంటూ ట్రైనింగ్‌ కొనసాగిస్తున్న ఆ కుర్రాడు.. హెచ్‌సీఏ లీగ్‌ల్లో దుమ్మురేపుతున్నాడు. ఒకే సీజన్‌లో రెండు ట్రిపుల్‌ సెంచరీలు బాది అందరి చూపు తనవైపు తిప్పుకున్న ఆ పాలమూరు మెలిమి ముత్యం.. హైదరాబాద్‌ రంజీ జట్టుకు ఎంపికవడమే తన లక్ష్యమంటున్నాడు. మారథాన్‌ ఇన్నింగ్స్‌లు ఆడటంతో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటగలనంటున్న గణేశ్‌.. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని భావిస్తుంటే.. అదే గడ్డపై నుంచి వచ్చిన మరో యువ ఆటగాడుమహమ్మద్‌ ఖయ్యూం తన లెఫ్టార్మ్‌ స్పిన్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లకు సింహస్వప్నంలా నిలుస్తున్నాడు. మారుమూల గ్రామంలో పుట్టి.. అంచలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరిన ఈ ఇద్దరు పాలమూరు ఆటగాళ్ల ప్రస్థానంపై ప్రత్యేక కథనం..

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌: నారాయణపేట జిల్లా మరికెల్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించిన గడుగు గణేశ్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే పిచ్చి. తండ్రి వ్యవసాయం, తల్లి టైలర్‌ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటే.. గణేశ్‌ తనకిష్టమైన ఆటలో రాణిస్తున్నాడు. పాఠశాల స్థాయిలోనే చక్కటి ప్రతిభ కనబర్చిన అతడు నెమ్మదిగా జిల్లాస్థాయికి ఎదిగాడు. మిడిలార్డర్‌లో ధాటిగా బ్యాటింగ్‌ చేయగల సత్తాతో పాటు అవసరమైన సమయంలో బంతితోనూ మాయ చేయగల 21 ఏండ్ల గణేశ్‌ చూస్తుండగానే జిల్లా జట్టుకు కెప్టెన్‌గా ఎదిగాడు. 2019-20 సీజన్‌లో తొలిసారి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) రెండు రోజుల లీగ్‌లో పాల్గొనే అవకాశం దక్కగా.. దాన్ని అతడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.

రెండు ట్రిపుల్‌ సెంచరీలు..

మంచి కసిమీద ఉన్న సమయంలో హెచ్‌సీఏ లీగ్‌లో ఆడే అవకాశం రావడంతో గణేశ్‌ రెచ్చిపోయాడు. రాజు సీసీతో జరిగిన మ్యాచ్‌లో 200 బంతుల్లో 318 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అందులో 42 ఫోర్లు, 7 సిక్సర్లు ఉంటే.. ఆ తర్వాత డబ్ల్యూసీసీతో జరిగిన పోరులో అయితే గణేశ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 192 బంతుల్లో 40 ఫోర్లు, 17 సిక్సర్లతో 329 పరుగులు చేసి కెరీర్‌ బెస్ట్‌ స్కోరు నమోదు చేశాడు. సీజన్‌ మొత్తంలో రెండు ట్రిపుల్‌ సెంచరీలతో పాటు మరో సెంచరీ సాయంతో మొత్తం 1,007 పరుగులు చేసిన గణేశ్‌ 7 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో అతడికి బీసీసీఐ అండర్‌-23 టోర్నీలో హెచ్‌సీఏకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. హెచ్‌సీఏ మూడు రోజుల లీగ్‌లో కంబైన్డ్‌ డిస్ట్రిక్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన గణేశ్‌.. అక్కడ కూడా సత్తాచాటుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న 2020-21 సీజన్‌లో ఎంపీ కోల్ట్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రాణించిన గణేశ్‌.. హైదరాబాద్‌ రంజీ జట్టుకు ఎంపికవడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. 

   అచ్చమైన ఆల్‌రౌండర్‌..

చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి.. సోదరుడి సహకారంతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ వస్తున్న 20 ఏండ్ల మహమ్మద్‌ ఖయ్యూం గత హెచ్‌సీఏ సీజన్‌లో అదరగొట్టాడు. రెండు రోజుల లీగ్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో 550 పరుగులు చేయడంతో పాటు 39 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ సెంచరీ (168), మూడు అర్ధశతకాలు ఉన్నాయి. పువ్వు పుట్టగానే పరిమలిస్తుందన్న చందంగా.. చిన్నప్పటి నుంచే ఆటలో రాణిస్తున్న ఖయ్యూం అండర్‌-14, అండర్‌-16, అండర్‌-19 జాతీయ స్థాయి పాఠశాల క్రీడల్లో నాలుగుసార్లు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2017లో ఆల్‌ఇండియా మొయినుద్దౌలా గోల్డ్‌కప్‌ టోర్నీలో కంబైన్డ్‌ డిస్ట్రిక్‌ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. ప్రస్తుతం జరుగుతున్న హెచ్‌సీఏ మూడు రోజుల లీగ్‌లో ఆడుతున్న ఖయ్యూం.. ఎంపీ కోల్ట్స్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ప్రాక్టీస్‌ కోసం గద్వాల్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు 90 కిలోమీటర్ల ప్రయాణం చేసే ఖయ్యూం.. ప్రస్తుతం ఎంవీఎస్‌ డిగ్రీ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే అద్భుతాలు చేయగలనని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.

బంతి పట్టిన ప్రతి ఆటగాడిలాగే నేనూటీమ్‌ఇండియాకు ఆడాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నా. కోచ్‌లు అబ్దుల్లా, శ్రీనివాసులు, పీడీ ఆనంద్‌  ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చా. మొయినుద్దౌలా గోల్డ్‌కప్‌ ఆడటం కొత్త అనుభూతినిచ్చింది. ప్రస్తుతం హెచ్‌సీఏ లీగ్‌ల్లో సత్తాచాటడంపైనే దృష్టి పెట్టా

- ఖయ్యూం

క్రికెట్‌పై ఇష్టంతో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని దాటుకుంటూ ముందుకు సాగుతున్నా. జిల్లా క్రికెట్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, కోచ్‌ అబ్దుల్లా సహకారం మరువలేనిది. హెచ్‌సీఏ రెండు రోజుల లీగ్‌లో రెండు ట్రిపుల్‌ సెంచరీలు సాధించా. భవిష్యత్తులో రంజీ జట్టుకు ఎంపికవ్వాలనేదే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం - గణేశ్‌

ప్రతిభకు ప్రోత్సాహమిస్తాం

ప్రతిభ గల క్రీడాకారులకు జిల్లా క్రికెట్‌ సంఘం తరఫున ప్రోత్సాహం అందిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఐదుసార్లు మహబూబ్‌నగర్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహించి యువ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చాం. జిల్లా క్రీడాకారులు రంజీ జట్టుకు ఆడాలి 

- రాజశేఖర్‌, మహబూబ్‌నగర్‌ క్రికెట్‌ సంఘం ప్రధాన కార్యదర్శి


logo