బార్సిలోనా: లియోనెల్ మెస్సీ.. ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌లో ఒకడు. సాకర్ ప్రపంచంలో ఓ సాదాసీదా ప్లేయర్‌ను కూడా కోట్లు పెట్టి సొంతం చేసుకోవడానికి క్లబ్బులు పోటీ పడతాయి. కానీ అంతటి లియోనెల్ మెస్సీ పరిస్థితి మాత్రం ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. రెండు దశాబ్దాలుగా బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ కాంట్రాక్ట్ తాజాగా ముగిసింది. దీంతో ఇప్పుడతనో ఫ్రీ ఏజెంట్ అయిపోయాడు. ఫుట్‌బాల్‌లో ఆ స్థాయి ప్లేయర్ ఇప్పుడిలా ఫ్రీ ఏజెంట్‌గా మారడం అత్యంత అరుదుగా జరిగేదే. ఇప్పుడతని క్లబ్ భవిష్యత్తు గందరగోళంలో పడింది.
ఫ్రీ ఏజెంట్.. ఎలా అయ్యాడు?
సాధారణంగా ఓ ప్లేయర్ కాంట్రాక్ట్ ముగియడానికి చాలా కాలం ముందే దానిని రెనివల్ చేయడమో లేదంటే వదిలేయడమో క్లబ్‌లు చేస్తుంటాయి. కానీ మెస్సీ విషయంలో అలా జరగలేదు. నిజానికి అతని కాంట్రాక్ట్‌ను రెనివల్ చేసే ప్రక్రియ ప్రారంభమైనా ఇంకా ముగియలేదు. కాంట్రాక్ట్‌లోని కొన్ని క్లాజుల విషయంలో చర్చలు ఇంకా జరుగుతున్నాయి. అతని ఇమేజ్ హక్కులతోపాటు కాంట్రాక్ట్‌కు సంబంధించి ఆర్థిక, ట్యాక్స్ సంబంధిత సమస్యలు ఆలస్యానికి కారణమవుతున్నాయి. ఇప్పటికే రెండు వర్గాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈలోపే పాత కాంట్రాక్ట్ ముగియడంతో అతను ఫ్రీ ఏజెంట్ అయిపోయాడు.
బార్సిలోనా ఆర్థిక పరిస్థితీ కారణమా?
బార్సిలోనా ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. 100 కోట్ల యూరోల అప్పు ఉన్నట్లు క్లబ్ తెలిపింది. ఇలాంటి సమయంలో మెస్సీలాంటి ప్లేయర్‌తో కాంట్రాక్ట్ సైన్ చేయడం అంత సులువు కాదు. అతనికి భారీ మొత్తంలో చెల్లించాలంటే కాస్త వెనుకా ముందు ఆలోచించాల్సి ఉంటుంది. 2017లో అతనితో కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడే నాలుగేళ్లకుగాను 50 కోట్ల యూరోలు ఇవ్వడానికి బార్సిలోనా అంగీకరించింది. పైగా ఈ అప్పుల విషయంలో లా లిగా కూడా ఇప్పటికే బార్సిలోనాను హెచ్చరించింది. క్లబ్ జీతాలను తగ్గించుకోవాలని సూచించింది. దీంతో కరోనాకు ముందు ఒక సీజన్‌కు 60 కోట్ల యూరోలుగా ఉన్న బార్సిలోనా మొత్తం జీతాల బిల్లు తర్వాత 30 కోట్ల యూరోలకు తగ్గించుకున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ మెస్సీ భవిష్యత్తుకు వచ్చిన ముప్పేమీ లేదని క్లబ్ ప్రెసిడెంట్ జొవాన్ లాపోర్టా హామీ ఇస్తున్నారు. మెస్సీ కాంట్రాక్ట్ కుదురుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
13 ఏళ్ల వయసులోనే..
మెస్సీకి బార్సిలోనాతో రెండు దశాబ్దాలకుపైగా అనుబంధం. కేవలం 13 ఏళ్ల వయసులోనే మెస్సీ బార్సిలోనాకు క్లబ్‌కు వచ్చాడు. 2004లో క్లబ్ తరఫున అధికారికంగా అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ క్లబ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు (778), అత్యధిక టైటిళ్లు (34), అత్యధిక విజయాలు, అత్యధిక గోల్స్ (672) చేసిన రికార్డు మెస్సీ పేరిటే ఉన్నాయి.
అంతటి అనుబంధం ఉంది కాబట్టే ఇప్పుడు ఫ్రీ ఏజెంట్‌గా ఏదైనా టీమ్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకునే అవకాశం ఉన్నా కూడా మెస్సీ ఆ ప్రయత్నం చేయడం లేదు. బార్సిలోనాతోనే కాంట్రాక్ట్ పునరుద్ధరించుకోవాలని అనుకుంటున్నాడు. పైగా ఇతర క్లబ్‌లు మెస్సీలాంటి ఖరీదైన ప్లేయర్‌ను కొనుగోలు చేసే పరిస్థితుల్లో కూడా లేవు.