శుక్రవారం 29 మే 2020
Sports - May 24, 2020 , 00:00:20

అప్పులతో బతకాల్సిందే

అప్పులతో బతకాల్సిందే

  • కరోనాతో ఈ పదేండ్లు సంక్షోభమే: ఆర్థికవేత్త రౌబిని

వాషింగ్టన్‌, మే 23: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా చేసిన నష్టం అపారమని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ నౌరీల్‌ రౌబిని అన్నారు. ఈ సంక్షోభం పదేండ్లదాకా ఉండొచ్చని అంచనా వేసిన ఆయన అందరికీ మిగిలేది అప్పుల భారమేనని హెచ్చరించారు. 2008లో సంభవించిన అంతర్జాతీయ మాంద్యాన్ని చాలామంది కంటే ముందే రౌబిని పసిగట్టడం గమనార్హం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కోలుకున్నా.. కరోనా ప్రభావం నుంచి బయటపడటానికి చాలా ఏండ్లే పడుతుందని న్యూయార్క్‌లోని తన నివాసం నుంచి బీబీసీ టాకింగ్‌ ఆసియా కార్యక్రమంలో పాల్గొంటూ చెప్పారు. ఇది మనం మునుపెన్నడూ చూడని ఆందోళనకర పరిస్థితి అని వ్యాఖ్యానించారు. కరోనా ప్రభావంతో కోల్పోయిన ఉద్యోగాల్లో కొన్ని తిరిగి ఎప్పటికీ రావన్నారు. సగటు మనిషికి ఉద్యోగ భద్రత కరువవుతుందని, ఆర్థిక పరిస్థితులు తలకిందులవుతాయని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న పలు ఆసియా దేశాల పరిస్థితి మున్ముందు బాగుండవచ్చని రౌబిని అంచనా వేశారు. 


logo