మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 26, 2020 , 23:03:07

క్రిస్‌గేల్‌ విధ్వంసం..కోల్‌కతాపై పంజాబ్‌ గెలుపు

క్రిస్‌గేల్‌ విధ్వంసం..కోల్‌కతాపై పంజాబ్‌ గెలుపు

షార్జా : ఐపీఎల్‌-13లో  కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మళ్లీ మెరిసింది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన  పంజాబ్‌   సీజన్‌లో వరుసగా ఐదో  విజయాన్నందుకుంది.  సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.   విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌(51: 29 బంతుల్లో 2ఫోర్లు, 5సిక్సర్లు), మన్‌దీప్‌ సింగ్‌(66 నాటౌట్‌: 56 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో విజృంభించడంతో  18.5  ఓవర్లలోనే  2 వికెట్లు  కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

వీరిద్దరికి తోడుగా ఆరంభంలో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(28) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్‌ను కట్టడి చేయడంలో కోల్‌కతా బౌలర్లు తేలిపోయారు.  గేల్‌, మన్‌దీప్‌ జోడీ రెండో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించారు.  రాహుల్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గేల్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అందరి బౌలింగ్‌లోనూ బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలోనే 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌ లో మన్‌దీప్‌ కూడా ఆచితూచి ఆడుతూ గేల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

 అంతకుముందు    శుభ్‌మన్‌ గిల్‌(57: 45 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) అర్ధశతకానికి తోడు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(40: 25  బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు )  రాణించడంతో  కోల్‌కతా  20 ఓవర్లలో 9 వికెట్లకు 149  పరుగులు  చేసింది. పంజాబ్‌ బౌలర్లు మహ్మద్‌ షమీ(3/35), రవి బిష్ణోయ్‌(2/20), క్రిస్‌ జోర్డాన్‌(2/25) దెబ్బకు కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ వరుస విరామాల్లో పెవిలియన్‌ చేరారు.