సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 11, 2020 , 02:42:07

కింగ్స్‌ ఖేల్‌ఖతం!

కింగ్స్‌ ఖేల్‌ఖతం!

  • చేజేతులా ఓడిన పంజాబ్‌
  • రాహుల్‌, మయాంక్‌ పోరాటం వృథా
  • కార్తీక్‌సేన అద్భుత విజయం

దురదృష్టమంటే పంజాబ్‌దే. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు..హార్డ్‌ హిట్టర్లతో కళకళలాడుతున్నా..అవసరమైనప్పుడు జట్టును ఆదుకునే వారు కరువయ్యారు. కోల్‌కతాతో మ్యాచ్‌ను చూసిన ఏ అభిమానికైనా ఇదే అభిప్రాయం కల్గుతుంది. 165 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లు రాహుల్‌, మయాంక్‌ అర్ధసెంచరీలతో అలవోక విజయాన్నందుకునే అవకాశాన్ని పంజాబ్‌ చేజేతులా జారవిడుచుకుంది. 14 పరుగుల తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయి వరుసగా ఐదో ఓటమిని ఖాతాలో వేసుకుని  ప్లేఆఫ్స్‌ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. మరోవైపు పోరాడితే పోయేదేమి లేదన్న తరహాలో విజృంభించిన కోల్‌కతా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 

అబుదాబి: అభిమానులకు వీకెం డ్‌ స్పెషల్‌ అదిరిపోయింది. శనివారం ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన మ్యాచ్‌లో పంజాబ్‌పై 2 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) విజయం సాధించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్‌ 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్లు రాహుల్‌ (74), అగర్వాల్‌(56) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ప్రసిద్ధ్‌ (3/29), నరైన్‌(2/28) రాణించారు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌.. కార్తీక్‌ (58), గిల్‌(57) అర్ధసెంచరీలతో 20 ఓవర్లలో 164/6 స్కోరు చేసింది. షమీ, అర్ష్‌దీప్‌సింగ్‌, బిష్ణోయ్‌కు ఒక్కో వికెట్‌ దక్కింది. అర్ధసెంచరీతో జట్టుకు పోరాడే స్కోరు అందించిన కార్తీక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. 

పంజాబ్‌ చేజేతులా

లక్ష్యఛేదనలో పంజాబ్‌కు శుభారంభం దక్కింది. రాహుల్‌, మయాంక్‌ మరోమారు బ్యాట్లు ఝులిపించారు.  అయితే ప్రసిద్ధ్‌  వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను రస్సెల్‌ విడిచిపెట్టాడు. ఈ కన్నడ ద్వయం చూడచక్కని షాట్లతో అలరించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి 47/0 స్కోరు చేసింది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌లో మయాంక్‌ను ఔట్‌ చేసిన ప్రసిద్ధ్‌ మ్యాచ్‌ను కోల్‌కతా వైపు తిప్పాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన పూరన్‌(16) మూడు ఓవర్ల తేడాతో నిష్క్రమించాడు. దీంతో గెలుపు సమీకరణం కాస్తా 12 బంతుల్లో 20 పరుగులుగా మారింది. కానీ ఇక్కడే కోల్‌కతా కమాల్‌ చేసింది. 19 ఓవర్లో ప్రసిద్ధ్‌ మూడు బంతుల తేడాతో ప్రభ్‌సిమ్రన్‌(4), రాహుల్‌ను పెవిలియన్‌ పంపాడు. ఆఖరి ఓవర్లో పంజాబ్‌ విజయానికి 14 పరుగులు కావాలి. క్రీజులో మ్యాక్స్‌వెల్‌, మన్‌దీప్‌సింగ్‌ ఉన్నారు. నరైన్‌ తన స్పిన్‌ మాయాజాలంతో మన్‌దీప్‌ను బోల్తా కొట్టించాడు. ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరమైన దశలో మ్యాక్స్‌వెల్‌ తన బలాన్నంతా కూడదీసుకుని కొట్టినా...ఇంచు తేడాతో బౌండరీ ముందు పడటంతో పంజాబ్‌ ఓటమి ఖరారైంది. 

మెరిసిన కార్తీక్‌, గిల్‌ 

కోల్‌కతాకు సరైన ఆరంభం లభించలేదు. పంజాబ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 63 పరుగులకే మూడు కీలక వికెట్లు త్రిపాఠి(4), రానా(2), మోర్గాన్‌(24) వికెట్లు కోల్పోయింది. స్వల్ప స్కోరుకే పరిమితమవుతుందనుకున్న కోల్‌కతా..గిల్‌, కార్తీక్‌ ఇన్నింగ్స్‌తో  పోరాడే స్కోరు అందుకుంది.

కోల్‌కతా: త్రిపాఠి(బి)షమీ 4, గిల్‌(రనౌట్‌) 57, రానా (రనౌట్‌) 2, మోర్గాన్‌(సి)మ్యాక్స్‌వెల్‌(బి)బిష్ణోయ్‌ 24, కార్తీక్‌(రనౌట్‌) 58, రస్సెల్‌(సి)ప్రభ్‌సిమ్రన్‌(బి)అర్ష్‌దీప్‌ 5, కమి న్స్‌ 5 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 164/6;  వికె ట్ల పతనం: 1-12, 2-14, 3-63, 4-145, 5-150, 6- 164; బౌలింగ్‌: షమీ 4-0-30-1, అర్ష్‌దీప్‌ 4-1-25-1, జోర్డాన్‌ 4-0-37-0, రెహమాన్‌ 4-0-44-0, బిష్ణోయ్‌ 4-0-25-1. 

పంజాబ్‌: రాహుల్‌(బి)ప్రసిద్ధ్‌ 74, అగర్వాల్‌(సి)గిల్‌(బి) ప్రసిద్ధ్‌ 56, పూరన్‌(బి)నరైన్‌ 16, ప్రభ్‌సిమ్రన్‌(సి)రానా(బి)ప్రసిద్ధ్‌ 4, మ్యాక్స్‌వెల్‌ 10 నాటౌట్‌, మన్‌దీప్‌సింగ్‌(సి/సబ్‌)గ్రీన్‌(బి)నరైన్‌ 0, జోర్డాన్‌ 0 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 162/5; వికెట్ల పతనం: 1-115, 2-144, 3-149, 4-151, 5-158; బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-29-0, ప్రసిద్ధ్‌ 4-0-29-3, నాగర్‌కోటి 3-0-40-0, వరుణ్‌ 4-0-27-0, నరైన్‌ 4-0-28-2, రానా 1-0-7-0.