శనివారం 11 జూలై 2020
Sports - May 28, 2020 , 19:45:38

'ప్రేక్షకులు లేకుండానైనా ఐపీఎల్‌ జరుగుతుందనుకుంటున్నా'

'ప్రేక్షకులు లేకుండానైనా ఐపీఎల్‌ జరుగుతుందనుకుంటున్నా'

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ నిర్వహణ సాధ్యమవుతుందని భావిస్తున్నానని కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టు హెడ్‌కోచ్‌ అనిల్‌ కుంబ్లే చెప్పాడు. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో.. ప్రేక్షకులు లేకుండా.. మూడు, నాలుగు స్టేడియాల్లోనైనా టోర్నీ జరుగుతుందని ఆశిస్తున్నామని ఓ ఇంటర్వూ్యలో వెల్లడించాడు. కాగా టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడి.. అక్టోబర్‌ - నవంబర్‌లో ఐపీఎల్‌ జరుగుతుందని వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

"ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యమవుతుందని మేం ఇంకా ఆశావాదంతో ఉన్నాం. షెడ్యూల్‌లో సర్దుబాట్లు చేస్తే ఐపీఎల్‌కు తప్పకుండా అవకాశం ఉంటుంది. ప్రేక్షకులు లేకుండా.. మూడు, నాలుగు స్టేడియాల్లోనైనా టోర్నీ జరుగుతుందని అనుకుంటున్నాం" అని కుంబ్లే చెప్పాడు. కాగా ఎక్కువ స్టేడియాలు ఉన్న నగరాల్లోనే ఐపీఎల్‌ నిర్వహిస్తే.. ఆటగాళ్ల ప్రయాణాలను తగ్గించే అవకాశం ఉంటుందని బ్యాటింగ్‌ దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఈ అంశాన్ని పరిశీలిస్తాయని తాను అనుకుంటున్నానని చెప్పాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ జరుగుతుందని తాను కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నానని లక్ష్మణ్‌ అన్నాడు. కాగా కరోనా వైరస్‌ తీవ్రత కారణంగా ఈ ఏడాది మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ తొలుత ఏప్రిల్‌ 15కు వాయిదా పడింది. అప్పటికి మహమ్మారి తీవ్రత పెరిగిపోవడంతో టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది.   


logo