గురువారం 22 అక్టోబర్ 2020
Sports - Oct 18, 2020 , 00:50:36

హైదరాబాద్‌ x కోల్‌కతా

హైదరాబాద్‌ x కోల్‌కతా

అబుదాబి: వరుస పరాజయాలతో డీలాపడ్డ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడి మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టనుంది. బౌలర్లు ఫర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటింగ్‌ వైఫల్యాల కారణంగా వెనుకబడిపోతున్న వార్నర్‌ సేన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాలని చూస్తున్నది. మరోవైపు కెప్టెన్‌ మారినా.. రాత మారని కోల్‌కతా కీలక విజయంతో పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లాలని భావిస్తున్నది. సన్‌రైజర్స్‌కు మిడిలార్డర్‌లో సమస్యలుంటే.. కోల్‌కతాకు బలమైన బ్యాటింగ్‌ ఉన్నా నిలకడ లోపించింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ది పైచేయి కాగా.. ఈ పోరు లో నెగ్గి లెక్క సరిచేయాలని సన్‌రైజర్స్‌ చూస్తున్నది. 

మిడిలార్డర్‌ గాడినపడితేనే..

వార్నర్‌, బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే, విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్‌, విజయ్‌ శంకర్‌.. ఇలా చెప్పుకోవడానికి బ్యాటింగ్‌ బలం బాగానే ఉన్నా.. వీరంతా సమిష్టిగా రాణించకపోవడమే హైదరాబాద్‌కు పెద్ద ఇబ్బందిగా మారింది. పాండే అప్పుడప్పుడు మెరుస్తున్నా నిలకడ లోపించింది. దీంతో ఓపెనర్లు మరీ నెమ్మదిగా ఆడుతున్నారు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ పవర్‌ ప్లే రన్‌రేట్‌ సగటు 7.3 మాత్రమే అంటే ఇన్నింగ్స్‌ ఎంత నిధానంగా ఆరంభమవుతున్నదో అర్థం చేసుకోవచ్చు. మిడిలార్డర్‌లో విలియమ్సన్‌ పై ఎక్కువ భారం పడుతున్నది. ఆల్‌రౌండర్ల కోటాలో జట్టులో కొనసాగుతున్న విజయ్‌ శంకర్‌ తన పాత్రకు తగ్గ న్యాయం చేయలేకపోతున్నాడు. కనీసం ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయని శంకర్‌.. బ్యాట్‌తోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గాయం కారణంగా అందుబాటులో లేకున్నా.. మిగిలినవాళ్లు ఆ లోటు కనబడనివ్వడం లేదు. మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌, షాబాజ్‌ నదీమ్‌ ప్రత్యర్థిని కట్టిపడేస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనూ ఇదే జోరు కొనసాగిస్తే.. కోల్‌కతాకు కళ్లెం వేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు.


logo