గురువారం 29 అక్టోబర్ 2020
Sports - Sep 30, 2020 , 23:23:36

IPL 2020: రాజస్థాన్‌పై కోల్‌కతా ఘన విజయం

IPL 2020: రాజస్థాన్‌పై కోల్‌కతా ఘన విజయం

దుబాయ్: ఐపీఎల్‌-13వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న రాజస్థాన్‌ రాయల్స్‌ జోరుకు అడ్డుకట్ట పడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో  సంచలన ప్రదర్శన చేసిన రాజస్థాన్‌   మూడో మ్యాచ్‌లో దారుణంగా విఫలమైంది.  బుధవారం జరిగిన మ్యాచ్‌లో  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 37  పరుగుల తేడాతో  రాజస్థాన్‌ను ఓడించింది.   కోల్‌కతా యువ  బౌలర్ల  దెబ్బకు రాజస్థాన్‌ విలవిల్లాడింది.  వరుస ఓవర్లలో  టపటపా వికెట్లు చేజార్చుకుంది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలువలేకపోయారు.

కోల్‌కతా నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన  రాజస్థాన్‌ 20  ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది.   బ్యాటింగ్‌ వైఫల్యంతో  స్టీవ్‌ స్మిత్‌సేన ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నది. టామ్‌ కరన్‌(54 నాటౌట్‌) అర్ధశతకం సాధించాడు. . కోల్‌కతా బౌలర్లలో   శివమ్‌ మావి(2/20), కమ్లేశ్‌ నాగర్‌కోటి(2/13), వరుణ్‌  చక్రవర్తి(2/25) కళ్లుచెదిరే బౌలింగ్‌తో ప్రత్యర్థిని కుప్పకూల్చారు. 

వికెట్లు టపటపా..

లక్ష్య ఛేదనలో  బరిలో దిగిన రాజస్థాన్‌కు  ఆరంభం నుంచి వికెట్లు కోల్పోయింది.   కోల్‌కతా పేసర్లు పదునైన బంతులతో   టాపార్డర్‌ను కుప్పకూల్చారు.  కమిన్స్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(3) వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్‌ యువ పేసర్‌ శివమ్‌ మావి బౌలింగ్‌లో  మిడ్‌వికెట్‌లో నరైన్‌కు క్యాచి ఇచ్చి   ఔటయ్యాడు.    ఫామ్‌లో ఉన్న ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరడంతో రాజస్థాన్‌ ఒత్తిడిలో పడింది. జోస్‌ బట్లర్‌, రాబిన్‌ ఉతప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాలని భావించారు. 

పవర్‌ప్లేలో  రాజస్థాన్‌ 2 వికెట్లు కోల్పోయి  39 పరుగులు చేసింది. ఏడో ఓవర్‌ మొదటి బంతికే ప్రమాదకర బట్లర్‌ను యంగ్‌గన్‌ మావి ఔట్‌ చేసి మ్యాచ్‌ను కోల్‌కతా వైపు  తిప్పాడు.  తర్వాతి ఓవర్‌లో నాగర్‌ కోటి కోల్‌కతాకు ఊహించని షాకిచ్చాడు.  తొలి బంతికే ఉతప్పను   పెవిలియన్‌ పంపిన యువ బౌలర్‌..నాలుగో బంతికి రియాన్‌ పరాగ్‌ను ఔట్‌ చేసి కోలుకోని దెబ్బకొట్టాడు. ఆ తర్వాత ఏ దశలోనూ రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగలేదు. ఆఖర్లో కరన్‌ అర్ధశతకం సాధించి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత    20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది.    యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(47: 34 బంతుల్లో 5ఫోర్లు,  సిక్స్‌)   ఆరంభంలో రాణించగా ఆఖర్లో ఇయాన్‌  మోర్గాన్‌(34 నాటౌట్:‌ 23 బంతుల్లో ఫోర్‌, 2సిక్సర్లు)  విజృంభించి జట్టుకు పోరాడే స్కోరు అందించారు. స్టార్‌ ఆల్‌రౌండర్‌  జోఫ్రా ఆర్చర్‌(2/18) అత్యద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. 

   


logo