శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 10, 2020 , 19:34:39

IPL 2020: ఉత్కంఠ పోరులో కోల్‌కతా విజయం

IPL 2020: ఉత్కంఠ పోరులో కోల్‌కతా విజయం

దుబాయ్:  ఐపీఎల్‌-13లో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ మళ్లీ డీలాపడింది. ఆశలు వదులుకున్న స్థితి నుంచి అసాధారణ పోరాటం చేసిన  కోల్‌కతా నైట్‌రైడర్స్  జట్టు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటే.. అత్యంత అవమానకర రీతిలో  రాహుల్‌సేన  విజయాన్ని వదులుకున్నది.  పంజాబ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నది.

గెలుపు దిశగా సాగుతున్న మ్యాచ్‌లో ఒత్తిడికి లోనైన  పంజాబ్‌  2 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.   చేతిలో వికెట్లు ఉన్నా 12  బంతుల్లో  20  పరుగులు చేయలేక చివరకు మూల్యం చెల్లించుకుంది.  అందివచ్చిన విజయాన్ని వదులుకొని వరుసగా మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  165 పరుగుల ఛేదనలో పంజాబ్‌ 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. పంజాబ్‌ను భారీ దెబ్బకొట్టిన  ప్రసిద్‌ కృష్ణ(3/29), నరైన్‌(2/28)  కేకేఆర్‌కు ఊహించని విజయాన్నందించారు.  కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(74: 58 బంతుల్లో 6ఫోర్లు), మయాంక్‌ అగర్వాల్‌(56: 39 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌)  పోరాటం కనబర్చినా  మిగతా బ్యాట్స్‌మెన్‌  చివర్లో చేతులెత్తేశారు. 

తొలి వికెట్‌కు రాహుల్‌, మయాంక్‌ జోడీ 115 పరుగులు జోడించింది.  సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉన్నా ఆఖర్లో కోల్‌కతా బౌలర్లు ఒత్తిడి పెంచడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ మ్యాచ్‌పై పట్టుసాధించారు.  జట్టు గెలుపు కోసం చివరి వరకు పోరాడిన రాహుల్‌ ప్రసిద్‌ వేసిన 19వ ఓవర్‌ ఆఖరి బంతికి ఔటవడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. 

ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమైన సమయంలో మాక్స్‌వెల్‌ తొలి బంతికే రెండు పరుగులు సాధించాడు.  తర్వాతి బంతి డాట్‌బాల్‌ కాగా మూడో బంతికి ఫోర్‌ రాబట్టాడు. నాలుగో బంతికి సింగిల్‌ తీయగా  ఐదో బంతికి భారీ షాట్‌ ఆడిన మన్‌దీప్‌ బౌండరీ వద్ద ఫీల్డర్‌ చేతికి చిక్కాడు. ఆఖరి బంతికి ఏడు పరుగులు అవసరం కాగా మాక్స్‌వెల్‌ ఫోర్‌ కొట్టాడు. బంతి బౌండరీ లైన్‌కు కొన్ని ఇంచుల లోపల పడటంతో కోల్‌కతా గెలుపు ఖాయమైంది. 

 అంతకుముందు యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(57: 47 బంతుల్లో 5ఫోర్లు), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(58: 29 బంతుల్లో  8ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌(1/25), రవి బిష్ణోయ్‌(1/25),  మహ్మద్‌ షమీ(1/30) కోల్‌కతా  బ్యాట్స్‌మెన్‌ను  కట్టడి చేశారు.