e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home స్పోర్ట్స్ వరుణ్‌ మ్యాజిక్‌

వరుణ్‌ మ్యాజిక్‌

  • బెంగళూరుపై కోల్‌కతా ఘన విజయం

ప్రత్యర్థి బౌలర్ల పనితనం కంటే.. తమ పేలవ ఆటతీరు వల్లే బెంగళూరు పరాజయం వైపు నిలిచింది. ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంచైజీ తరఫున 200వ మ్యాచ్‌ బరిలో దిగిన విరాట్‌ కోహ్లీ ప్రభావం చూపలేకపోగా.. ఏబీ డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌ అతడినే అనుసరించారు. ఫలితంగా జట్టంతా కలిసి రెండంకెల స్కోరే చేస్తే.. కోల్‌కతా ఓపెనర్లు దంచి కొట్టి 10 ఓవర్లు మిగిలిండగానే మ్యాచ్‌ను ముగించారు. వేదికతో పాటు జెర్సీ రంగు మారినా బెంగళూరుకు కలిసిరాలేదు. ఈ విజయంతో కోల్‌కతా రన్‌రేట్‌ మెరుగుపర్చుకోవడంతో పాటు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరగా.. బెంగళూరు మూడో స్థానంలోనే కొనసాగుతున్నది.

అబుదాబి: బ్యాట్స్‌మెన్‌ వైఫల్యానికి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) భారీ మూల్యం చెల్లించుకుంది. స్టార్‌ ఆటగాళ్లు పేలవ ప్రదర్శన కనబర్చడంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 14వ సీజన్‌ రెండో దశను కోహ్లీ సేన పరాజయంతో ప్రారంభించింది. సోమవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగళూరు 19 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. ఈ సీజన్‌ అనంతరం కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించిన విరాట్‌ కోహ్లీ (5) ఆకట్టుకోలేకపోగా.. ‘మిస్టర్‌ 360’ ఏబీ డివిలియర్స్‌ (0) ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆదుకుంటాడనుకున్న గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (10) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (22) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

- Advertisement -

ఈ మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్‌ భరత్‌ (16) ఫర్వాలేదనిపించగా.. ఒకే ఫ్రాంచైజీ తరఫున 200వ మ్యాచ్‌ ఆడిన ఏకైక ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, రస్సెల్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో కోల్‌కతా 10 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 94 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (48; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌)తో పాటు అరంగేట్ర ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ (41 నాటౌట్‌; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించారు. బెంగళూరు బౌలర్లలో చాహల్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

శ్రీకర్‌ అరంగేట్రం
ఈ మ్యాచ్‌ ద్వారా ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్‌ భరత్‌ ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వికెట్‌ కోల్పోవడంతో వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా క్రీజులో అడుగుపెట్టిన భరత్‌ ఫర్వాలేదనిపించాడు. గతంలో స్టాండ్‌బై ప్లేయర్‌గా భారత జట్టుతో చాన్నాళ్ల పాటు కొనసాగిన భరత్‌.. స్పిన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కున్నా.. పేసర్లను ఆడటంలో కాస్త తడబడ్డాడు. అరగంటకు పైగా క్రీజులో గడిపిన భరత్‌.. 19 బంతుల్లో 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు తరఫున భరత్‌తో పాటు శ్రీలంక ఆల్‌రౌండర్‌ హసరంగ అరంగేట్రం చేయగా.. కోల్‌కతా తరఫున ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ తొలి మ్యాచ్‌ ఆడాడు.

బ్లూ జెర్సీలో..
ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన ప్రత్యేకమైన బ్లూ జెర్సీలో బరిలోకి దిగింది. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సమయంలో.. తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన కోవిడ్‌ వారియర్స్‌కు సహాయ పడే లక్ష్యంతో బెంగళూరు జట్టు ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌ అనంతరం ఈ జెర్సీలను వేలం వేసి.. తద్వారా వచ్చిన మొత్తాన్ని కోవిడ్‌ వారియర్స్‌కు అందించనున్నట్లు ఆట ఆరంభానికి ముందు విరాట్‌ పేర్కొన్నాడు.

1 ఒకే ఫ్రాంచైజీ (బెంగళూరు) తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా విరాట్‌ రికార్డుల్లోకెక్కాడు.

200 రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున విరాట్‌ కోహ్లీ ఆడిన మ్యాచ్‌ల సంఖ్య.

5 ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌ల మార్క్‌ చేరిన ఐదో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. మహేంద్రసింగ్‌ ధోనీ (212), రోహిత్‌ శర్మ (207), దినేశ్‌ కార్తీక్‌ (203), సురేశ్‌ రైనా (201) అతడికంటే ముందున్నారు.

స్కోరు బోర్డు
బెంగళూరు: కోహ్లీ (ఎల్బీ) ప్రసిద్ధ్‌ 5, పడిక్కల్‌ (సి) కార్తీక్‌ (బి) ఫెర్గూన్‌ 22, భరత్‌ (సి) గిల్‌ (బి) రస్సెల్‌ 16, మ్యాక్స్‌వెల్‌ (బి) వరుణ్‌ 10, డివిలియర్స్‌ (బి) రస్సెల్‌ 0, సచిన్‌ బేబీ (సి) రాణా (బి) వరుణ్‌ 7, హసరంగ (ఎల్బీ) వరుణ్‌ 0, జెమీసన్‌ (రనౌట్‌/వరుణ్‌) 4, హర్షల్‌ (బి) ఫెర్గూసన్‌ 12, సిరాజ్‌ (సి) వరుణ్‌ (బి) రస్సెల్‌ 8, చాహల్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 19 ఓవర్లలో 92 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-10, 2-41, 3-51, 4-52, 5-63, 6-63, 7-66, 8-76, 9-83, 10-92, బౌలింగ్‌: వరుణ్‌ చక్రవర్తి 4-0-13-3, ప్రసిద్ధ్‌ కృష్ణ 4-0-24-1, ఫెర్గూసన్‌ 4-0-24-2, నరైన్‌ 4-0-20-0, రస్సెల్‌ 3-0-9-3.

కోల్‌కతా: గిల్‌ (సి) సిరాజ్‌ (బి) చాహల్‌ 48, వెంకటేశ్‌ (నాటౌట్‌) 41, రస్సెల్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 10 ఓవర్లలో 94/1. వికెట్ల పతనం: 1-82, బౌలింగ్‌: సిరాజ్‌ 2-0-12-0, జెమీసన్‌ 2-0-26-0, హసరంగ 2-0-20-0, చాహల్‌ 2-0-23-1, హర్షల్‌ 2-0-13-0.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement