శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 07, 2020 , 21:31:12

KKR vs CSK: రప్ఫాడించిన రాహుల్

KKR vs CSK: రప్ఫాడించిన రాహుల్

అబుదాబి: ఐపీఎల్‌-13లో భాగంగా  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో  మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పోరాడే స్కోరు చేసింది. ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి(81:  51 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో మెరవడంతో     కోల్‌కతా    ఆ మాత్రం స్కోరు సాధించింది.   శార్దుల్‌ ఠాకూర్‌(2/28), కర్ణ్‌ శర్మ(2/25)  ధాటికి కోల్‌కతా 167 పరుగులకే కుప్పకూలింది.   మిగతా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా తేలిపోగా.. రాహుల్‌ పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ జట్టు సాధారణ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.  

కోల్‌కతా ఇన్నింగ్స్‌లో  త్రిపాఠి బ్యాటింగ్‌ హైలెట్‌గా నిలిచింది. శుభ్‌మన్‌ గిల్‌(11)తో కలిసి సీజన్లో తొలిసారి ఓపెనర్‌గా బరిలో దిగాడు. పవర్‌ప్లేలో చూడచక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు.  గిల్‌తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన నితీశ్‌ రాణా(9) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరగా  అతడు మాత్రం   చెన్నై బౌలర్లపై ఆద్యంతం  పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.  చెన్నై ప్రధాన బౌలర్‌ దీపక్‌ చాహర్‌ నాలుగు ఓవర్లు వేసి 47 పరుగులు సమర్పించుకున్నాడు.  అతని బౌలింగ్‌లో రాహుల్‌ వీరవిహారం చేశాడు.   

జట్టుకు మెరుపు ఆరంభం లభించినా.. మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్‌కతా చేజార్చుకున్నది.   11వ ఓవర్‌  నుంచి కోల్‌కతా జోరు తగ్గింది.  ఈ దశలో పుంజుకున్న చెన్నై బౌలర్లు  పదునైన బంతులతో విరుచుకుపడ్డారు.  పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడిన బ్యాట్స్‌మెన్‌  వరుస విరామాల్లో పెవిలియన్‌ బాట పట్టారు.  మరో ఎండ్‌లో సహకరించే బ్యాట్స్‌మెన్‌ లేకపోయినప్పటికీ  త్రిపాఠి  నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. మెరుపు ఆరంభం తర్వాత స్కోరు వేగం తగ్గిన సమయంలోనూ మరోసారి అతనే  ఆదుకున్నాడు. 

మధ్య ఓవర్లలో చెన్నై బౌలర్లు కోల్‌కతా పరుగుల వేగానికి అడ్డుకట్ట వేశారు. కర్ణ్‌ శర్మ వేసిన 11వ ఓవర్లో నరైన్‌ ఔటవడంతో పాటు 5 పరుగులే రాగా..శార్దుల్‌ ఠాకూర్‌ వేసిన 12వ ఓవర్లో ఏడు,  మళ్లీ శర్మ వేసిన 13వ ఓవర్లోనూ కేవలం 4 పరుగులే రావడంతో స్కోరు తగ్గింది. పరుగులు సాధించడానికి త్రిపాఠి, ఇయాన్‌ మోర్గాన్‌ తీవ్రంగా శ్రమించారు.  తన తొలి ఓవర్‌లో 12 పరుగులు సమర్పించుకున్న కర్ణ్‌ తర్వాతి మూడు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.  ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయడంతో పాటు పరుగులు రాకుండా బ్యాట్స్‌మెన్‌ను నిలువరించాడు.  

శామ్‌ కరన్‌ బౌలింగ్‌లో   సూపర్‌ ఫామ్‌లో  ఉన్న   మోర్గాన్‌(7) భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో  వికెట్‌ కీపర్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  మోర్గాన్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్‌(2) మరోసారి విఫలమయ్యాడు.  శార్దుల్‌ ఠాకూర్‌ వేసిన 16వ ఓవర్లో ధోనీకి క్యాచ్‌ ఇచ్చి నిరాశగా పెవిలియన్‌ బాటపట్టాడు.  ఆఖర్లో మెరుపులు మెరిపించాల్సిన కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(12) కూడా నిరాశపరిచాడు.   పాట్‌ కమిన్స్‌(17 నాటౌట్‌) ఫోర్‌, సిక్సర్‌ బాది జట్టు స్కోరును 160 దాటించాడు.  బర్త్‌డే బాయ్‌ డ్వేన్‌ బ్రావో చివరి ఓవర్లో  రెండు వికెట్లు తీశాడు. ఆఖరి బంతికి వరున్‌ చక్రవర్తి రనౌట్‌ కావడంతో కోల్‌కతా ఆలౌటైంది.